పోస్టర్లతో పిచ్చెక్కిస్తున్నాడు

పోస్టర్లతో పిచ్చెక్కిస్తున్నాడు

తెలుగులో చాలా వరకు రొటీన్‌ సినిమాలే చేసిన సిద్ధార్థ్‌ సొంతగడ్డకు వెళ్లిపోయాక మాత్రం డిఫరెంట్‌ సినిమాలతో అదరగొడుతున్నాడు. జిగర్‌ తాండా, కావ్య తలైవన్‌, ఎనకుల్‌ ఒరువన్‌ లాంటి సినిమాలు సిద్ధును కోలీవుడ్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. తాజాగా అతను 'జిల్‌ జంగ్‌ జక్‌' అనే వెరైటీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

సొంత బేనర్‌ 'ఇటాకి ఎంటర్టైన్మెంట్‌'లో ఈ సినిమాను నిర్మించిన సిద్ధు.. కొత్త కుర్రాడు ధీరజ్‌ వైద్యకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు. ఈ సినిమా తొలి పోస్టర్‌ రిలీజైన నాటి నుంచి కూడా చాలా డిఫరెంట్‌ లుక్‌ తో జనాల్ని ఆకర్షిస్తోంది.

ఆ సినిమా పాటలు కానీ.. పోస్టర్లు కానీ.. వీడియోలు కానీ.. భలే వెరైటీగా ఉంటూ సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఈ నెల 12న ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సిద్ధు తాజాగా మరో వెరైటీ పోస్టర్‌ రిలీజ్‌ చేశాడు. డిజైన్‌ చేసింది ఎవరో కానీ.. ఆ పోస్టర్‌ నిండా క్రియేటివిటీతో కుమ్మేశారు. ఇప్పటికే ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో భారీ అంచనాలుండగా.. రిలీజ్‌ ముందు వారం మరింత జోరుగా పబ్లిసిటీ చేసి హైప్‌ మరింత పెంచాలని చూస్తున్నాడు సిద్ధు.

పబ్లిసిటీకి ప్రత్యేకంగా డబ్బులేమీ ఖర్చుపెట్టకుండా సోషల్‌ మీడియాను బేస్‌ చేసుకుని తన సినిమాను భలేగా ప్రమోట్‌ చేస్తూ మంచి క్రేజే సంపాదించుకున్నాడు సిద్ధు. మరి 'జిల్‌ జంగ్‌ జక్‌' అతగాడికి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు