రివ్యూ: సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు

రివ్యూ: సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు

సినిమా రివ్యూ: సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు

రేటింగ్‌: 2.5/5
తారాగణం: రాజ్‌ తరుణ్‌, అర్తన, రాజా రవీంద్ర తదితరులు
సంగీతం: గోపి సుందర్‌
కెమెరా: విశ్వ
ఎడిటర్‌: కార్తీక్‌ శ్రీనివాస్‌
నిర్మాతలు: శైలేంద్ర, శ్రీధర్‌, హరీష్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్‌ గవిరెడ్డి

హ్యాట్రిక్‌ విజయాలతో కెరియర్‌ ఆరంభించిన రాజ్‌ తరుణ్‌ మొదటి నాలుగు చిత్రాలతో విజయాలు అందుకుని ఇంతవరకు ఏ హీరో సాధించని ఘనత సాధిస్తాడా లేదా అనే ఆసక్తి కలిగించాడు. అతని సినిమాల ఎంపిక చూస్తే అంత ఈజీగా తప్పు చేస్తాడనిపించదు. 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' టైటిల్‌, ఆ ట్రెయిలర్స్‌లోని కలర్‌ఫుల్‌ అప్పీల్‌ అదీ చూస్తే అతని ఖాతాలో మరో విజయం ఖాయమనిపించింది. కానీ కవర్‌పేజీ చూసి పుస్తకం గొప్పతనం అంచనా వేయలేమని రుజువు చేస్తూ ఈ చిత్రం నిరాశపరిచింది. పాతకాలం నాటి ప్రేమకథలని తలపించే కథనంతో ఆసాంతం విసిగించింది. ఇప్పటివరకు రాజ్‌ తరుణ్‌ పాస్‌ అయిపోయినా కానీ ఈసారి మాత్రం ఫెయిల్యూర్‌ తప్పించుకోలేడనిపించింది.

కథ:  

రామ్‌ (రాజ్‌ తరుణ్‌) చిన్న వయసులోనే సీతామహాలక్ష్మిని (అర్తన) చూసి ప్రేమలో పడతాడు. ఆమె మంచి చదువుల కోసం ఊరొదిలి వెళ్లిపోయినా తనకోసం వేచి చూస్తూ వుండిపోతాడు. తనతో చిన్నప్పటి చనువు వల్ల కలిసి తిరిగిన సీత కూడా తనని ప్రేమిస్తుందని పొరపడతాడు. దాంతో ఆమె అతడిని కొడుతుంది. ఎలాగైతేనేం ఆమెని కూడా ప్రేమలోకి దించుతాడు కానీ అప్పటికే ఆమెకి నిశ్చితార్ధం వేరే వాడితో అయిపోతుంది. అతను క్రికెటర్‌ కావడంతో తనని క్రికెట్‌లో ఓడించి సీతని తీసుకుపొమ్మని పందెం వేస్తాడు. రామ్‌ తన జట్టునేసుకుని ఎలా గెలుస్తాడనేది మిగతా కథ.

కథనం:


వినడానికి ఇదేదో లగాన్‌ మాదిరి ట్విస్టుతో కూడా లవ్‌స్టోరీ అనిపిస్తుంది కానీ ఆ క్రికెట్‌ని కేవలం క్లయిమాక్స్‌కే పరిమితం చేసారు. ఎలాగో లగాన్‌, కబడ్డీ కబడ్డీ అనేస్తారని తెలిసినప్పుడు కనీసం ఇంటర్వెల్‌ నుంచి అయినా జట్టుని తీర్చిదిద్దడంలాంటి దృశ్యాలతో ఆసక్తి కలిగించాల్సింది. విషయం లేని కథని చివరి దాకా సాగదీసి, క్రికెట్‌ ఆటని మరీ తేలిగ్గా చేసి చూపించడంతో ఆ పాయింట్‌ కూడా క్లిక్‌ అవలేదు. అసలు ఆడవాళ్ల ఫీలింగ్స్‌తో, వారి ఇష్టాయిష్టాలతో మగవాళ్లకి పనే లేదన్నట్టు వారి మీద ఆట ఆడడం, పందాలు కాయడం లాంటివి చూస్తే ఇది ఏ కాలం నాటి సినిమానో అనిపిస్తుంది.

క్రికెట్‌ ఆడడమంటే చాలా తేలికన్నట్టు హీరో మాట్లాడతాడు. తనమీద గిన్నెలు విసిరే భార్య నుంచి దెబ్బలు తప్పించుకునే భర్తతో ఇదే క్రికెట్‌ అంటాడు హీరో. చిల్లర వేస్తే క్యాచ్‌ పట్టుకునే వాడిలోను ఒక క్రికెటర్‌ వుంటాడట. కనీసం తయారు చేసే టీమ్‌లో అయినా ఏదో ఒక ప్రత్యేకత పెట్టుకుని వుంటే, లగాన్‌ని కాపీ కొట్టారనిపించినా కానీ ఎంతో కొంత కాలక్షేపం అయినా అయ్యేది. ఆకట్టుకునే సన్నివేశాలేమీ లేకపోయినా కనీసం కామెడీతో అయినా నడిపించవచ్చు. దానికోసం ఒక ముసలమ్మ పాత్రని పెట్టి చేసిన కామెడీ అయితే టీవీ సీరియల్స్‌ని తలపిస్తుంది.

సినిమా మొదలైన కాసేపటికే ఇది హోప్‌లెస్‌ అనే సంగతి అర్థమైపోతుంది. ఇంటర్వెల్‌కి చేరినా కానీ కనీసం ఆసక్తి కలిగించే ట్విస్ట్‌లాంటిది ఏమీ లేకపోవడంతో ద్వితీయార్ధం కూడా అంతే నీరసంగా నడుస్తుంది. కుమారి 21 ఎఫ్‌ లాంటి బోల్డ్‌ సినిమా చేసిన రాజ్‌ తరుణ్‌ ఇప్పుడిలాంటి పాతకాలపు కథకి ఓకే చెప్పడం ఆశ్చర్యకరం. ఇలాంటి సినిమాతో తన విజయాల పరంపర కొనసాగించాలనుకోవడం మాత్రం అమాయకత్వం.

నటీనటులు:


రాజ్‌ తరుణ్‌ పాత్రకి తగ్గట్టు వున్నాడు. ఈసారి యాక్షన్‌ సీన్లు కూడా చేసినా ఫర్వాలేదనిపించాడు. అర్తన మరీ ఓవర్‌గా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చింది. రాజా రవీంద్రకి ఎంతో కాలం తర్వాత కాస్త లెంగ్తీ క్యారెక్టర్‌ దొరికింది. షకలక శంకర్‌కి స్పూఫ్‌లు చేసే ఛాన్స్‌ లేకపోవడంతో అతని కామెడీ పండలేదు. రణ్‌ధీర్‌, ఆదర్శ్‌ ఇద్దరూ బాగానే చేసారు. మిగిలిన పాత్రధారుల్లో సురేఖావాణి, హేమ తదితరులున్నారు.

సాంకేతికవర్గం:


దర్శకుడు శ్రీనివాస్‌ ఈ సినిమాతో ఎవరిని టార్గెట్‌ చేసాడనేది అర్థం కాదు. ఈతరం ప్రేక్షకుల అభిరుచికి ఏమాత్రం సరిపడని ఈ చిత్రం కనీసం పాత తరం వాళ్లని కూడా పూర్తిగా ఆకట్టుకోలేదు. హీరోయిన్‌ని చాలా డీసెంట్‌గా చూపించడం, క్లీన్‌ సినిమాగా తీర్చిదిద్దడం మాత్రం మెచ్చుకోతగ్గ అంశాలు. పాటలు బానే వున్నాయి. కెమెరా వర్క్‌ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్‌ కూడా ఓకే అనిపిస్తుంది. నిర్మాతలు బాగానే ఖర్చు పెట్టారు.

చివరిగా...

రాజ్‌ తరుణ్‌ మీద నమ్మకంతో వెళితే రామయ్య మొట్టికాయలేసి పంపించడం ఖాయం. థియేటర్లకి పరుగులు తీసే కంటే స్టార్‌ స్పోర్ట్స్‌లో వచ్చే పాత క్రికెట్‌ మ్యాచ్‌ రీ టెలికాస్ట్‌ చూడడం ఉత్తమం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English