నాని సినిమా నచ్చిందంటున్న రెబల్‌ స్టార్‌

నాని సినిమా నచ్చిందంటున్న రెబల్‌ స్టార్‌

నిన్నటి తరం నటీనటులెవరైనా.. ఈ కాలంలో వస్తున్న సినిమాల గురించి పొగిడితే అంతకు మించి కాంప్లిమెంట్‌ ఉండదు. ఎందుకంటే పాత తరం వాళ్లు తమ సినిమాలే గొప్ప అంటారు. ఇప్పుడొచ్చే సినిమాల్ని తేలిగ్గా తీసిపడేస్తారు. రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు కూడా మిగతా సినిమాలన్నింటినీ తీసి పడేశారు కానీ.. 'భలే భలే మగాడివోయ్‌' మూవీ మీద మాత్రం ప్రశంసలు కురిపించారు.

తనకీ మధ్య కాలంలో బాగా నచ్చిన సినిమా ఇదేనన్నారు. ఈ సినిమాలో నాని నటించడం పట్ల కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ''నాని ఓ స్థాయిలో ఉన్న హీరో. అతను ఇలాంటి మతిమరుపు పాత్ర ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించింది. మా రోజుల్లో నేనైతే ఇలాంటి పాత్ర వస్తే అంగీకరించేవాడిని కాదు'' అని చెప్పారు కృష్ణంరాజు.

ఇక తాను ఈ ఏడాది నటించిన రెండు సినిమాల గురించి మాట్లాడుతూ.. ''ఎవడే సుబ్రమణ్యం, రుద్రమదేవి సినిమాల్లో చాలా మంచి పాత్రలు పోషించా. అవి నాకెంతో సంతృప్తినిచ్చాయి. ముఖ్యంగా 'ఎవడే సుబ్రమణ్యం'లో రామయ్య పాత్రను ఎప్పటికీ మరిచిపోలేను. ఇలాంటి పాత్రలొస్తే నటిస్తూనే ఉంటా'' అన్నారు.

ప్రభాస్‌తో ఓ రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ తీయాలని ఆలోచిస్తున్నానని.. బాహుబలి-2 తర్వాత తమ 'గోపీకృష్ణ మూవీస్‌' బేనర్లోనే ఆ సినిమా ఉండొచ్చని కృష్ణం రాజు చెప్పారు. తన దర్శకత్వంలో ప్రభాస్‌ తో తీయాలనుకున్న 'ఒక్క అడుగు' సినిమాకు కూడా స్క్రిప్టు సిద్ధంగా ఉందని.. కానీ అది ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో చెప్పలేనని కృష్ణం రాజు అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు