సోష‌ల్ మీడియాలో వైసీపీ ప్రారంభోత్స‌వ ర‌చ్చ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిన్న‌రలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎన్ని వివాదాల్లో త‌ల‌దూర్చిందో తెలిసిందే. త‌ర‌చుగా ఏదో ఒక వివాదాస్ప‌ద‌ నిర్ణ‌యంతో వార్త‌ల్లో నిల‌వ‌డం లేదా త‌మ పార్టీ నేత‌ల చ‌ర్య‌ల‌తో సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మార‌డం వైకాపాకు అల‌వాటైపోయింది.

పార్టీ నేత‌లు అత్యుత్సాహంతోనో, ప్ర‌చార యావ‌తోనో చేస్తున్న కొన్ని ప‌నులు వైకాపాను ఇరుకున పెడుతున్న మాట వాస్త‌వం. ముఖ్యంగా చిన్నా చిత‌కా ప‌నుల‌కు ప్రారంభోత్స‌వాలు చేసి న‌వ్వుల పాల‌వ‌డం వైకాపా నాయ‌కుల‌కు అల‌వాటుగా మారిపోయింది. ఎమ్మెల్యే స్థాయి వ్య‌క్తులు ప్ర‌హ‌రీ గోడ‌ల ప్రారంభోత్స‌వాల్లో పాల్గొన‌డం ఇప్ప‌టికే చూశాం. ఉండ‌వ‌ల్లి శ్రీదేవి స‌హా కొంద‌రు నేత‌లు ఇలాంటి చిన్న కార్య‌క్ర‌మాల‌కు చేసిన హ‌డావుడి సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు ఒక గేదెకు ప్రారంభోత్స‌వం చేయ‌డానికి ఎమ్మెల్యే హాజ‌రు కావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గంలో ఎమ్మెల్యే ఉష‌శ్రీ చ‌ర‌ణ్ ఈ ప‌ని చేశారు. ఈ గేదె వ్య‌వ‌హార‌మేంటి.. దానికి ప్రారంభోత్స‌వం ఏంటి అన్న వివ‌రాలు వెల్ల‌డి కాలేదు కానీ.. గేదె చుట్టూ క‌ట్టెల‌తో బారికేడ్ల మాదిరి క‌ట్టి.. వైకాపా జెండాలోని నీలి రంగుతో ఉన్న రిబ్బ‌న్ క‌ట్టి దాన్ని ఎమ్మెల్యే క‌ట్ చేసి ప్రారంభోత్స‌వం జ‌రిపారు.

గేదె త‌ల‌కు వైకాపా జెండాలోనే ఉండే ప‌చ్చ ‌రంగుతో ఉన్న రిబ్బ‌న్ చుట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. దీనిపై ట్రోలింగ్ ఏ రేంజిలో న‌డుస్తుంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. మ‌ళ్లీ మ‌ళ్లీ కామెడీ అవుతున్న‌ప్ప‌టికీ వైకాపా నేత‌లు ఇలాంటి ప‌నులెందుకు మానుకోవ‌ట్లేదో?