మల్లాది విష్ణు కు ఏం జరగబోతోంది?

మల్లాది విష్ణు కు ఏం జరగబోతోంది?

విజయవాడ కల్తీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నెల రోజుల అజ్ఞాతం తరువాత బయటకొచ్చి సిట్‌ విచారణకు హాజరయ్యారు బుధవారం ఉదయం ఆయన కృష్ణలంకలోని పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ప్రత్యేక దర్యాప్తు బందం ముందుకొచ్చారు. ఈ కేసులో ఆయన బుక్కవుతారా... తప్పించుకుంటారా అన్న చర్చ విజయవాడలో జరుగుతోంది. నెల రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న సమయంలో ఆయన మొత్తం ఏర్పాట్లు చేసుకున్నారని... ఇందులోంచి ఆయన బయటపడతారని ఆయన అనుచరవర్గం గుసగుసలాడుతోంది.

మల్లాది విష్ణు సోదరుడికి చెందిన స్వర్ణబార్‌లోని జరిగిన కల్తీ మద్యం కేసులో సిట్‌ ఆయన్ను విచారిస్తోంది. స్వర్ణబార్‌ కల్తీ మద్యం కేసులో బుధవారం (జనవరి 6) కోర్టు ముందు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మల్లాది విష్ణు అజ్ఞాతం వీడిన సంగతి తెలిసిందే. మల్లాది విష్ణు సోదరుడి పేరుతో ఉన్న కృష్ణలంకలోని స్వర్ణబార్‌లో మద్యం సేవించి ఐదుగురు వ్యక్తులు చనిపోగా, 25 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ కేసులో మల్లాది విష్ణు సోదరుడు శ్రీనివాస్‌తో సహా పలువురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు విష్ణుని 9వ నిందితుడిగా చార్జిషీట్‌లో చేర్చారు.

అయితే... ఘటన జరిగిన సుమారు నెల రోజుల వరకు ఆయన్ను పోలీసులు పట్టుకోలేకపోవడం... ఇప్పుడు కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన నెల రోజుల తరువాత సిట్‌ ముందుకు రావడం వంటి పరిణామాలు చూస్తే ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆయన అన్ని రకాలుగా సిద్దమై వచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిట్‌ విచారణ నామమాత్రమవుతుందని... మల్లాది విష్ణు ఈ కేసు నుంచి తప్పించుకుంటారని విజయవాడలో పెద్ద ఎత్తున వినిపిస్తోంది. తొలుత సీరియస్‌ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై పట్టు వదిలేసినట్లుగా ఉందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. మల్లాది విష్ణును ఇంతకాలం పట్టుకోకపోవడమే దానికి ఉదాహరణగా చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు