ఈ మలయాళ మోజేంటో?

ఈ మలయాళ మోజేంటో?

తన తొలి సినిమా 'మిర్చి' దగ్గర్నుంచి పర భాషా నటులకు కీలక పాత్రలు ఇస్తున్నాడు కొరటాల శివ. 'మిర్చి'లో సంపత్‌ రాజ్‌, సత్యరాజ్‌, నదియా లాంటి తమిళ తారలు మంచి పాత్రలు చేసి సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇక 'శ్రీమంతుడు'లోనూ సంపత్‌ విలన్‌గా రాణించాడు. ఇప్పుడిక తన కొత్త సినిమా 'జనతా గ్యారేజ్‌' కోసం మలయాళ నటీనటులపై పడుతున్నాడు కొరటాల. ఈ సినిమాలో సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మలయాళ కుట్టి నిత్యా మీనన్‌ను ఓ కథానాయికగానూ ఎంచుకున్నాడతను. ఐతే కొరటాల మలయాళ మోజు ఇంతటితో ఆగట్లేదు. ఈ సినిమాలో మరో మలయాళ ఆర్టిస్ట్‌ కీలక పాత్ర పోషించబోతున్నాడు.

'బెంగళూరు డేస్‌' చూసిన వాళ్లందరికీ అందులో ముఖ్య పాత్ర చేసిన ఫాహద్‌ ఫాజిల్‌ గుర్తుండే ఉంటాడు. వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్న ఈ యువ కథానాయకుడు కూడా 'జనతా గ్యారేజ్‌'లో ఓ క్యారెక్టర్‌ చేయబోతున్నాడట. కొరటాల చెప్పిన కథ నచ్చి అతనీ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట.

ఒకప్పుడు నాగార్జునతో 'కిల్లర్‌' సినిమా చేసిన మలయాళ స్టార్‌ డైరెక్టర్‌ ఫాజిల్‌ కొడుకే ఈ ఫాహద్‌ ఫాజిల్‌. నిర్మాతగా, నటుడిగా మల్లూవుడ్‌లో మంచి పేరే సంపాదించాడు. 'రాజా రాణి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నజ్రియా నజ్రీన్‌ను గత ఏడాది పెళ్లి కూడా చేసుకున్నాడు. పెళ్లికి ముందు బెంగళూరు డేస్‌లో ఈ జంట భార్యాభర్తలుగా నటించింది కూడా. నజ్రియా ఇంతకుముందు 'రభస' సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా ఎంపికైంది. కానీ తర్వాత ఆమెను తప్పించారు. ఐతే ఇప్పుడామె భర్త ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నాడన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు