తారక్.. ఏంటా గెటప్?

 తారక్.. ఏంటా గెటప్?

ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గురించి.. నాన్నకు ప్రేమతో సినిమా కోసం అతను వేసిన కొత్త గెటప్ గురించి కాదు లెండి. ఈ తారక్ అంటే తారకరత్న అన్నమాట. తెలుగు సినీ చరిత్రలో.. ఆ మాటకొస్తే భారతీయ, ప్రపంచ సినీ చరిత్రలోనే ఏ హీరోకు సాధ్యం కాని రీతిలో అరంగేట్రంలోనే తొమ్మిది సినిమాల ఓపెనింగుతో సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ మనవడు.. తర్వాత ఏ స్థితికి చేరాడు అందరికీ తెలిసిందే.

ఈ మధ్య తారకరత్న ఏం సినిమాలు చేస్తున్నాడు.. అవి విడుదలవుతున్నాయా లేదా అని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ మధ్య ‘అమరావతి’ సినిమాలో విలన్ పాత్ర చేసి నంది అవార్డు కూడా అందుకున్న తారకరత్న.. కనీసం ఆ తరహా పాత్రలైనా ఎంచుకుంటే మంచిదన్న ఫీలింగ్ కలిగించాడు. కానీ తర్వాత మళ్లీ హీరో వేషాలకే పరిమితమై పూర్తిగా ఫేడవుట్ అయిపోయాడు.

ఐతే ఈ మధ్య మళ్లీ అతడికి జ్నానోదయం అయినట్లుంది. నారా రోహిత్ హీరోగా వారాహి చలనచిత్రం బేనర్లో ఓ సినిమాలో విలన్‌గా నటించడానికి తారక్ ఓకే చెప్పినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్త నిజమా కాదా అనుకుంటున్న సమయంలో తారకరత్న క్లారిటీ ఇచ్చేశాడు. వారాహి సంస్థ సమర్పిస్తున్న ‘జత కలిసే’ మూవీ ఆడియో ఫంక్షన్లో తళుక్కుమన్నాడు నందమూరి హీరో. ఈ ఫంక్షన్‌కు నారా రోహిత్ కూడా రావడంతో వీళ్లిద్దరి కాంబినేషన్ ఖాయమని తేలిపోయింది. ఐతే ఈ వేడుకలో తారక్ గెటప్ చూసి అందరూ షాకైపోయారు. నెత్తిన జుట్టు తగ్గిపోయింది.

జుట్లు అక్కడక్కడా తెల్లబడింది కూడా. ఫుల్లుగా గడ్డం కూడా పెంచేశాడు. సినిమా కోసం ఇలా తయారయ్యాడా.. మామూలుగానే అలా కనిపిస్తున్నాడా తెలియదు కానీ.. తారకరత్నను సడెన్‌గా చూసి పోల్చుకోవడమైతే కష్టమైంది. ఎలాగైతేనేం చాలా కాలం తర్వాత కనిపించిన తారక్.. ఇన్నాళ్లకు జనాల నోళ్లల్లో నానే సినిమా చేయబోతున్నాడు సంతోషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు