సినిమా రివ్యూ: బెంగాల్‌ టైగర్‌

సినిమా రివ్యూ: బెంగాల్‌ టైగర్‌

రేటింగ్‌: 2.75/5
తారాగణం: రవితేజ, తమన్నా, రాశి ఖన్నా తదితరులు
సంగీతం: బీమ్స్‌ సిసిరాలియో
కెమెరా: సౌందరరాజన్‌
ఎడిటర్‌: గౌతమ్‌ రాజు
నిర్మాత: కె.కె. రాధామోహన్‌
రచన, దర్శకత్వం: సంపత్‌ నంది

పక్కా మాస్‌ సినిమా వచ్చి చాలా కాలమైపోతుంది. వెరైటీ ఆదరించే మూడ్‌లో తెలుగు సినిమా ప్రేక్షకులున్నా కానీ మసాలా సరిగా దట్టించిన కమర్షియల్‌ సినిమాలకెప్పుడూ గిరాకీ వుంటుందని నమ్మిన వాళ్ళల్లో సంపత్‌నంది వుంటాడు. రచ్చ సినిమా ఏదో ఫ్లూక్‌గా ఆడేసిందని కాదని బలంగా నమ్మేసాడు కాబట్టే ఇప్పుడు 'బెంగాల్‌ టైగర్‌'ని కూడా అచ్చంగా అలాగే తెర మీదకి తెచ్చేసాడు. రవితేజలోని మాస్‌ లక్షణాలకి తగ్గ కథని సంపత్‌ నంది రాసుకున్నాడు. కామెడీకి, మసాలాకీ బాగా స్కోప్‌ వుంచుకుని ఇద్దరు హీరోయిన్ల గ్లామర్‌తో కనికట్టు చేసాడు. కానీ సంపత్‌ నంది చూపించిన తెలివితేటలన్నీ ఫస్టాఫ్‌ వరకు పనికొచ్చాయి. ఆ తర్వాత సినిమా రాంగ్‌ ట్రాక్‌ పట్టేసి ఏదో ముగించాలి కనుక ముగించేస్తున్నామన్నట్టు చేంతాడంత క్లయిమాక్స్‌తో ముగిసింది. టోటల్‌గా చూసుకుంటే టైమ్‌పాస్‌ సినిమానే కానీ అందరికీ నచ్చే కాలక్షేపం కాదిది.

కథ:    

ఆకాష్‌ (రవితేజ) వెంటనే ఫేమస్‌ అయిపోవాలని ఒక మంత్రిని నిండుసభలో రాయితో కొడతాడు. అతని దగ్గరే ఉద్యోగానికి చేరి, ఆ తర్వాత ఇంకా పెద్ద మంత్రి ఇంట్లో పని దొరికితే ఈ మంత్రిని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతాడు. హోంమంత్రి కూతుర్ని ప్రేమలో పడేసి సాక్షాత్తూ ఆమె తండ్రే పెళ్లి ప్రపోజల్‌ పెడితే తాను ప్రేమిస్తున్నది సీఎం కూతురినని చెప్తాడు. ఆకాష్‌ ఇదంతా చేయడానికి వెనుక ఒక కారణముంటుంది. అది ఏమిటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథనం:

ఏనాడో కాలం చెల్లిపోయిందని అనుకుంటోన్న రివెంజ్‌ కథతో రచ్చ తీసి హిట్‌ కొట్టిన సంపత్‌ నంది మళ్ళీ అలాంటి కథాంశాన్నే ఎంచుకుని ఈ సినిమా తీసాడు. హీరో పాత్రని పరిచయం చేసి అతనికో గోల్‌ సెట్‌ చేసాడే తప్ప మధ్యలో ఒక సీన్‌ దాచేసి దాంట్లోనే అసలు కథని దాచి పెట్టి ఫస్టాఫ్‌లో కాలక్షేపం చేసాడు. ఫస్టాఫ్‌ అంతా హీరో పాత్ర ద్వారా మనల్ని రాంగ్‌ ట్రాక్‌ పట్టించినా కానీ వినోదానికి లోటు లేకుండా చూసుకున్నాడు. ఈమధ్య ప్రతి సినిమాలోను వేరే హిట్‌ సినిమాల స్పూఫ్‌లు చేస్తోన్న పృధ్వీతో ఇందులో అత్తారింటికి దారేది, శ్రీమంతుడు తదితర స్పూఫ్‌లు చేయించి బాగా నవ్వించారు. రవితేజ వుంటేనే వినోదానికి ఢోకా వుండదు. ఇక అతనికి తోడు పృధ్వీ, పోసాని కలిసి ఇంటర్వెల్‌ వరకు టైమ్‌ ఎలా అయిపోయిందో తెలియనివ్వలేదు.

ఇంటర్వెల్‌లో వచ్చిన ట్విస్టుని ముందే ఊహించడం కష్టం. ఆ ట్విస్టు బాగా పేలి సెకండాఫ్‌ మీద అంచనాలు పెంచుతుంది. ఫస్టాఫ్‌లో వున్నంత కామెడీ సెకండాఫ్‌లో కూడా వుంటుందనుకుంటే కామెడీని వెనక పడేసి రొటీన్‌ సీన్లతో నడిపించేయడం వల్ల ఒక లెవల్‌కి వచ్చే సరికి బోర్‌ కొట్టేస్తుంది. హీరో, విలన్‌ మధ్య సరైన గేమ్‌ నడిపించలేక సంపత్‌ నంది తనకున్న పరిధులు ఏమిటనేది చూపించాడు. ఇంటర్వెల్‌ తర్వాత రవితేజ, బోమన్‌ ఇరానీ మధ్య తెలివైన ఆట డించి వుంటే ఈ సినిమా రక్తి కట్టేది. పతాక సన్నివేశాల్లో ఫైట్‌ సీన్‌ బాగా తీసినా కానీ బాగా సాగతీయడం వల్ల అప్పటికే విసిగిపోయిన జనం బయటకి వెళ్లిపోతారు.

నటీనటులు:

రవితేజ ఎప్పటిలానే తనదైన శైలిలో తనకోసమే రాసినట్టున్న పాత్రలో అలరించాడు. ఈమధ్య తన సినిమాల్లో తగ్గుతోన్న వినోదం పాళ్లు ఇందులో కాస్త ఎక్కువే వుండేలా చూసుకున్నారు. తమన్నా లేట్‌ ఎంట్రీ ఇచ్చినా కానీ తన గ్లామర్‌తో అదరగొట్టేసింది. రాశి ఖన్నా ఏమీ వెనకపడలేదు. తమన్నాకి ధీటుగానే నిలబడింది. బోమన్‌ ఇరానీని విలన్‌ పాత్రలో చూడడం కాస్త వెరైటీ. పృధ్వీ కామెడీ సినిమాకే హైలైట్‌. పోసాని కూడా తనదైన శైలిలో నవ్వించాడు. బ్రహ్మానందం క్యారెక్టర్‌ క్లిక్‌ అవలేదు. రావు రమేష్‌, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేసారు.

సాంకేతికవర్గం:

పాటలు వినగా వినగా ఆకట్టుకుంటాయేమో. బీట్స్‌ బాగానే వున్నాయి. చిత్రీకరణ పరంగా మాత్రం అన్ని పాటలు కట్టి పడేస్తాయి. ఫస్ట్‌ సాంగ్‌ చిత్రీకరణ చూస్తే గబ్బర్‌సింగ్‌ ఇన్‌స్పిరేషన్‌లా అనిపిస్తుంది. పవన్‌కళ్యాణ్‌ని డైరెక్ట్‌ చేసే అవకాశాన్ని మిస్‌ అయిన సంపత్‌ నంది తన అభిమానాన్ని డైలాగుల రూపంలో చాటుకున్నాడు. కెమెరా వర్క్‌ చాలా బాగుంది. ఆ బురదలో తీసిన ఫైట్‌ అయితే అద్భుతంగా తెరకెక్కింది. ఎడిటింగ్‌ ఫర్వాలేదు. నిర్మాత బాగానే ఖర్చు పెట్టారు. సంపత్‌ నంది తనకి మాస్‌ ఆడియన్స్‌ టేస్ట్‌ తెలుసని చూపించాడు. దర్శకుడిగా తనకి ఎక్కువ మార్కులు పడిపోకపోయినా కానీ మాస్‌ని ఆకట్టుకునేలా సినిమా తీయడంలో తనకున్న నేర్పుని ఎవరూ కాదనలేరు.

చివరిగా...

మాస్‌ మసాలా కోసం కటకటలాడిపోతున్న వారికి ఈ సినిమా కరువు తీర్చేస్తుంది కానీ రొటీన్‌ సినిమాలతో విసిగిపోయిన వాళ్ళకి మాత్రం రొటీన్‌ అనే పదాన్ని భూతద్దంలో చూపిస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English