బెంగాల్‌ టైగర్‌.. అగ్ని పరీక్షే

బెంగాల్‌ టైగర్‌.. అగ్ని పరీక్షే

బెంగాల్‌ టైగర్‌ మాంచి నాన్‌ వెజ్‌ సినిమా.. మాస్‌ ఆడియన్స్‌కు విందు భోజనమే అంటున్నాడు హీరో రవితేజ. ఈ సినిమా 100 శాతం కాదు, 101 శాతం విజయవంతం అవుతుందంటున్నాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ భీమ్స్‌. తన సినిమా టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసేస్తుందని.. క్రిస్మస్‌, సంక్రాంతి పండగలు ముందే వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నాడు డైరెక్టర్‌ సంపత్‌ నంది. వీళ్ల కాన్ఫిడెన్స్‌ బాగానే ఉంది కానీ.. బెంగాల్‌ టైగర్‌ మాత్రం ఈ నెల పదో తారీఖున చాలా పెద్ద పరీక్షే ఎదుర్కోబోతున్నాడు. ఈ ఏడాది తెలుగులో హిట్టయిన సినిమాల వరస చూస్తే మాత్రం 'బెంగాల్‌ టైగర్‌' టీం కచ్చితంగా టెన్షన్‌ పడుతూ ఉంటుందనడంలో సందేహం లేదు.

పటాస్‌, టెంపర్‌, బాహుబలి, శ్రీమంతుడు, సినిమా చూపిస్త మావ, భలే భలే మగాడివోయ్‌, రాజు గారి గది, కుమారి 21 ఎఫ్‌.. ఇవీ ఈ ఏడాది మంచి విజయం సాధించిన సినిమాలు. వీటిలో ఏదీ కూడా పక్కా మాస్‌ మసాలా సినిమా కాదు. ఎంతో కొంత వైవిధ్యం ఉన్నవే. ఈ ఏడాది వచ్చిన రొటీన్‌ మాస్‌ మసాలా సినిమాలేవీ కూడా ఆడలేదు. ఆ టైపు సినిమాలకు టాలీవుడ్లో కాలం చెల్లిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే 'బెంగాల్‌ టైగర్‌' ట్రైలర్‌ చూస్తే సంపత్‌ నంది కొత్తగా ఏమీ ట్రై చేసినట్లు లేడు. మనం చాలా ఏళ్లుగా చూస్తున్న మాస్‌ మసాలా అంశాల్నే దట్టించినట్లున్నాడు. ఐతే ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు విజయవంతం చేసిన చిత్రాల వరస చూస్తే మాత్రం మా టేస్టు మారిందని చెబుతున్నట్లుంది. మరి ఈ పరిస్థితుల్లో 'బెంగాల్‌ టైగర్‌' ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు