సినిమా రివ్యూ: శంకరాభరణం

సినిమా రివ్యూ: శంకరాభరణం

సినిమా రివ్యూ: శంకరాభరణం
రేటింగ్‌: 2/5
తారాగణం: నిఖిల్‌, నందిత, అంజలి తదితరులు
సంగీతం: ప్రవీణ్‌
కెమెరా: సాయి శ్రీరాం
ఎడిటర్‌: ఛోటా ప్రసాద్‌
కథ, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్‌
నిర్మాత: ఎమ్‌.వి.వి. సత్యనారాయణ
దర్శకత్వం: ఉదయ్‌ నందనవనం

'శంకరాభరణం' మీద అపారమైన నమ్మకంతో ఈ చిత్రానికి రచనతో పాటు సమర్పకుని బాధ్యతలు, దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసిన కోన వెంకట్‌ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను కథ అందించిన బ్రూస్‌లీ పరాజయానికి శ్రీను వైట్ల బాధ్యుడని, తాను రాసిచ్చిన సన్నివేశాలని వాడుకోలేదని, అందుకే ఆ చిత్రం అంతటి ఫ్లాప్‌ అయిందని, అంతే కాక అది పోవడం వల్ల తన పేరు పోయిందని కూడా అన్నాడు. పోయిన ప్రతిష్టని తిరిగి నిలబెట్టే చిత్రమిదే అంటూ శంకరాభరణంకి బాగా పబ్లిసిటీ చేసుకున్నాడు. కట్‌ చేస్తే... 'శంకరాభరణం' మరో తలనొప్పి కారక చిత్రంగా తయారైంది. బ్రూస్‌లీకి తన బాధ్యతేమీ లేదని చెప్పుకున్న కోన వెంకట్‌కి ఇప్పుడు కవర్‌ చేసుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఫస్‌ గయారే ఒబామా చిత్రానికి రీమేక్‌ అయిన శంకరాభరణం అంచనాలని తలకిందులు చేసింది.  

కథ:   
తండ్రి అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో బీహార్‌లో వున్న తమ పాత భవంతిని అమ్మి డబ్బులు పట్టుకెళ్లడానికి గౌతమ్‌ (నిఖిల్‌) యుఎస్‌ నుంచి ఇండియాకొస్తాడు. తమ భవంతిని అమ్మడానికి వీల్లేదని, దాన్నిండా తమ బంధువులే వుంటున్నారని అర్థం కావడంతో దానిని అమ్మే దారులు అన్వేషిస్తుంటాడు. ఈలోగా ఇతని దగ్గర చాలా డబ్బుందని వివిధ కిడ్నాప్‌ గ్యాంగ్‌లు గౌతమ్‌ని కిడ్నాప్‌ చేసి డబ్బులు దండుకోవాలని చూస్తుంటాయి. కిడ్నాప్‌కి గురైన గౌతమ్‌ వారి బారి నుంచి ఎలా తప్పించుకున్నాడు, తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడనేది మిగతా కథ.

కథనం:
తను రాయని కథకి తన పేరేసాడని శ్రీను వైట్లని తిట్టిపోసిన కోన వెంకట్‌ ఈసారి వేరెవరో రాసిన కథకి అవసరం లేని కొంత డ్రామాని అద్ది అది తన కథేనని వేసుకున్నాడు. ఫస్‌ గయా రే ఒబామా చిత్రాన్ని చాలా దారుణంగా రీమేక్‌ చేస్తే తప్ప ఇలాంటి సబ్‌స్టాండర్డ్‌ ప్రోడక్ట్‌ రాదు. చక్కని కథ, హాయిగా నవ్వించే వినోదంతో పాటు టాలెంటెడ్‌ స్టార్‌ కాస్ట్‌ ఆ చిత్రాన్ని ఒక మంచి చిత్రంగా నిలబెట్టాయి. ఆ కథని కోన వెంకట్‌ తన రచనతో కంగాళీ చేసి పారేసాడు. ఈ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమ షేపే మారిపోతుందని, కొత్త కథల ట్రెండ్‌ మొదలవుతుందని ఎన్నో కబుర్లు చెప్పిన కోన వెంకట్‌ ఒక కొత్త కథని తీసుకుని కూడా తన నాసిరకం కథనంతో దానిని బోరింగ్‌గా మార్చేసాడు.

సినిమా మొదలైన ఎంత సేపటికీ కథలో లీనం కావడం కాదు కదా కనీసం కామెడీకి నవ్వు కూడా రాదు. ఒక పదిహేను నిమిషాలు గడిచేసరికి సీన్‌ ఏంటనేది అర్థమైపోతుంది. ఒరిజినల్‌ చూసిన వారికైతే అసలు కథని సెకండ్‌ హాఫ్‌కి వాయిదా వేసి కాలయాపన చేస్తున్న సంగతి తెలిసిపోతుంది. ఇంటర్వెల్‌ వరకు నాగార్జున 'గ్రీకువీరుడు' సినిమాకీ దీనికీ తేడా ఏమీ కనిపించదు. కామెడీ పేరుతో చేసిందేమీ క్లిక్‌ అవకపోవడం వల్ల ఇక మిగిలిన సినిమాపై అంచనాలు కూడా ఏమీ వుండవు. కాకపోతే భరించలేని ఫస్ట్‌ హాఫ్‌తో పోలిస్తే సెకండ్‌ హాఫ్‌ బెటర్‌ అనిపిస్తుంది. దీనికి కారణం ఆ హిందీ సినిమానే. ఇక్కడ్నుంచి అయినా దానిని యథాతథంగా ఫాలో కాకుండా కోన తన తెలివితేటలు చూపించడం వల్ల అది కూడా అంతంతమాత్రంగానే నవ్విస్తుంది.

పతాక సన్నివేశాల్లో మినహా చెప్పుకోతగ్గ హాస్యం పండకపోవడంతో శంకరాభరణం ఒక నాసి రకం సినిమాగా మిగిలిపోయింది. దీనికి దర్శకత్వ పర్యవేక్షణ కూడా తానే చేసానని చెప్పుకుంటున్నాడు కనుక ఈ చిత్రానికి ఇక కర్త, కర్మ, క్రియ అన్నీ కోన వెంకటే అవుతాడు. ఈసారి నిందించడానికి, తప్పించుకోవడానికి కూడా వీల్లేదు కనుక ఇప్పుడు జరిగే డ్యామేజ్‌ ఎంతనేది లెక్క వేసుకోవాలిక.

నటీనటులు:
నిఖిల్‌ ఆ ఫేక్‌ యాక్సెంట్‌తో ఏమాత్రం మెప్పించలేకపోయాడు. నందిత కూడా అంతే. కామెడీ చేస్తున్నాననే భ్రమలో ఏదేదో చేసేసింది. అంజలి ఉన్నంతలో ఫర్వాలేదనిపిస్తే, పృధ్వీ అప్పుడప్పుడూ నవ్వించాడు. సప్తగిరి ఇలాంటి విషయంలేని పాత్రలు ఇంకెన్ని సార్లు చేస్తాడో మరి. బ్రహ్మానందం లేపోవడమొక్కటే ఈ సినిమా పరంగా కోన చూపించిన వెరైటీ.

సాంకేతికవర్గం:
ఒక్క పాట కూడా వినదగ్గట్టు లేదు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వింటే మ్యూజిక్‌ డైరెక్టర్‌కి పెద్దగా పస లేదనే సంగతి అర్థమవుతుంది. కెమెరా వర్క్‌ జస్ట్‌ ఓకే. కోన డైలాగులు కూడా పేలలేదు. ఎడిటర్‌కి మరీ ఇంత మొహమాటం పనికి రాదనిపించింది. అవసరం లేని జంక్‌ చాలా ఉందిందులో. దర్శకుడు తనకి రాసిచ్చింది తీసాడంతే. డైరెక్టర్‌ అంటే అన్ని శాఖల్నీ కమాండ్‌ చేయాలి కానీ తాను ఒకరి కమాండ్‌లో వుండకూడదు.

చివరిగా...
ఈమధ్య కాస్త వెరైటీ సినిమాలు చేస్తూ నమ్మకం కలిగించిన నిఖిల్‌ ఇలాంటి నాసిరకం స్క్రిప్ట్‌కి ఓకే చెప్పడమేంటో? విడుదలకి ముందున్న ఆసక్తి వల్ల ఓపెనింగ్స్‌ తెచ్చుకున్నా తర్వాత సర్వయివ్‌ కావడం కష్టమేననిపిస్తోంది.