అమరావతిపై గల్ఫ్‌ దేశాల ఆసక్తి

అమరావతిపై గల్ఫ్‌ దేశాల ఆసక్తి

నవ్యాంధ్ర ప్రదేశ్‌ నూతన రాజధాని ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వివిధ ఆసియా, ఐరోపా ఖండ దేశాలు... కెనడా వంటి ఉత్తర అమెరికా దేశాలు అమరావతిలో, నవ్యాంధ్రలో పెట్టుబడులకు ఆసక్తి చూపిన సంగతి తెలిసిందే. అంతేకాదు, అమెరికాలో ఉన్న లక్షలాది మంది తెలుగువారు, ప్రవాస భారతీయులు కూడా నవ్యాంధ్రపై ఆసక్తిగా ఉన్నారు. ఈ దశలో తాజాగా గల్ఫ్‌ దేశాలు కూడా నవ్యాంధ్ర, దాని రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తహతహలాడుతున్నారు. ఇక్కడ పెట్టుబడులు పెడతామంటూ ఎదురొస్తున్నారు.

అందులోభాగంగానే కువైట్‌ ప్రతినిధుల బృందమొకటి ఆంధ్రప్రదేశ్‌ కు వచ్చింది. విజయవాడలోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడిది కార్యాలయంలో శుక్రవారం వారు చంద్రబాబుతో సమావేశమయ్యారు. వియత్నాంలో ఇప్పటికే 5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఆయిల్‌ రిఫైనరీ నిర్మిస్తున్న ఆల్‌ అఫ్రోజ్‌ సంస్థ చైర్మన్‌ సౌద్‌ అల్‌ అఫ్రోజ్‌, ఇతర ప్రతినిధులు చంద్రబాబుతో చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చించారు. ఏపీలో ఆయిల్‌ రిఫైనరీ నెలకొల్పే విషయాన్ని పరిశీలించాలని చంద్రబాబు అఫ్రోను కోరారు. రాజధాని అమరావతిలో పెట్టుుబడులకు అల్‌ అఫ్రోజ్‌ సంస్థ సంసిద్దత వ్యక్తం చేసింది. ఏపీలో పెట్టుబడుల అనుకూల వాతావరణానికి వారు ఆశ్చర్యపోయారు. తమ సంస్థ అనుభవంతో కువైట్‌ , మరిన్ని గల్ఫ్‌ దేశాలకు చెందిన సంస్థలు అమరావతికి క్యూ కట్టడం గ్యారంటీ అని వారు చంద్రబాబుతో అన్నారని సమాచారం. మరోవైపు చంద్రబాబు శుక్రవారం ఉదయం నుంచే బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులతోనూ ఆయన సమావేశమయ్యారు. బాక్సైట్‌ తవ్వకాల జీవో రద్దు, ఇసుక పాలసీ మార్పులపై చర్చించారు. ఈ రెండు అంశాలపై త్వరలో కీలక నిర్ణయాలు వెలువడతాయని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు