ఆ నిర్మాత అజిత్ తోక తొక్కాడు

ఆ నిర్మాత అజిత్ తోక తొక్కాడు

ఒకప్పుడు ‘శ్రీ సూర్యా మూవీస్’ అన్న బేనర్ నేమ్ చూసి సినిమాలకు వెళ్లిపోయేవాళ్లు తెలుగు, తమిళ ప్రేక్షకులు. సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ బ్యాన్సర్లో ఒకటిగా ఉండేది ఆ సంస్థ. ఇటు తెలుగులో, అటు తమిళంలో భారీ సినిమాలు నిర్మిస్తూ.. సూపర్ హిట్లు అందుకుంటూ అగ్ర నిర్మాతగా వెలుగొందాడు ఎ.ఎం.రత్నం. ఒక దశలో స్టార్ డైరెక్టర్ శంకర్ తో వరుసగా సినిమాలు తీసి భారీ హిట్లు కొట్టాడు రత్నం. కానీఆ తర్వాత వరుస ఫ్లాపులు ఆయన్ని దెబ్బ తీశాయి. ముఖ్యంగా కొడుకులిద్దరితో తీసిన సినిమాలు ఆయన్ని ముంచేశాయి. దీంతో సూర్యా మూవీస్ బేనరే మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఐతే కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న రత్నం.. ఇప్పుడు మళ్లీ తమిళంలో హవా సాగిస్తున్నాడు. కొత్త బేనర్ ఒకటి మొదలుపెట్టి, కుమార్తె ఐశ్వర్యను నిర్మాతగా ఇంట్రడ్యూస్ చేసిన ఆయన స్టార్ హీరో అజిత్ తో హ్యాట్రిక్ హిట్లు కొట్టి భారీగా లాభాలు మూటగట్టుకున్నాడు.  ముందు వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఆరంభం’ పెద్ద హిట్టయింది. ఆ తర్వాత ఎన్నై అరిందాల్ (ఎంతవాడుగానీ) కూడా హిట్టే. తాజాగా అజిత్ తో ఆయన తీసిన ‘వేదాలం’ బాక్సాఫీస్ ను షేక్ చేసేస్తోంది.

రూ.40 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాడు రత్నం. ఫస్ట్ వీకెండ్లోనే ఆ మొత్తం వసూలుు చేసేసిందా సినిమా. వర్షాల్లోనూ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ మూవీ.. ఫుల్ రన్ లో వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి రీఎంట్రీలో అజిత్ ను నమ్ముకుని మళ్లీ ఒకప్పటి స్థాయి అందుకున్నాడు రత్నం. మామూలుగా ఇలా అదృష్టం కలిసొస్తే నక్క తోక తొక్కారు అంటారు. కానీ రత్నం మాత్రం అజిత్ తోక తొక్కాడని అనాలేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు