నెవ్వర్: ఎన్టీఆర్ తో చంద్రుళ్ల పోలికా?

నెవ్వర్: ఎన్టీఆర్ తో చంద్రుళ్ల పోలికా?

రెండు తెలుగు రాష్ట్రాలకు పెద్ద దిక్కుగా చంద్రుళ్లు ఇద్దరూ వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ ఎన్టీవోడి శిష్యులే. ఒకరు ఎన్టీఆర్‌ కు అల్లుడు అయితే.. మరొకరు ఎన్టీఆర్‌ ను వీరవిధేయతతో ఆరాధించి..చివరకు తన కొడుక్కి ఆయన పేరు పెట్టేసుకున్న వ్యక్తి. ఈ రోజున రెండు రాష్ట్రాల్లో తిరుగులేని నేతలగా చెలామణీ అవుతున్న ఈ ఇద్దరు చంద్రుళ్లకు ఎన్టీఆర్‌ కు పోలిక పెడితే..? అటు ఎన్టీఆర్‌ కు.. ఇటు చంద్రుళ్లతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగించిన అతి కొద్ది మందిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒకరు.

తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏర్పాటు వరకు చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగి.. చివరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో.. ఒత్తిడితో ఆయన వైపు వెళ్లిపోయిన తుమ్మలను.. ఎన్టీఆర్‌.. చంద్రుళ్ల మధ్య పోలికలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నిస్తే ఆయనేం సమాధానం చెబుతారు? రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఎన్టీఆర్‌ కు.. రాజకీయాల్లో ఒక ఎత్తుకు తీసుకెళ్లిన చంద్రబాబుకు.. దశాబ్దం పాటు అధికారానికి దూరంగా ఉన్న సమయంలో ఆదరించి అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన కేసీఆర్‌ గురించి తుమ్మల ఎలాంటి అభిప్రాయాలు చెప్పుకొచ్చారన్నది చూస్తే ఆసక్తికరంగా అనిపించక మానదు.

అనవసరమైన మొహమాటం వదిలేసి.. నిక్కచ్చిగా మాట్లాడిన తుమ్మల మాటలు ఆసక్తికరంగా అనిపించటమే కాదు.. ఇప్పుడు నడుస్తున్న విధేయ రాజకీయ నేతలకు కాస్త భిన్నమైన వ్యక్తిగా తుమ్మల నాగేశ్వరరావు కనిపిస్తారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన అభిప్రాయాల్ని నిక్కచ్చిగా చెప్పేశారు. మిగిలిన ప్రశ్నల్ని కాసేపు పక్కన పెడితే.. ఎన్టీఆర్‌.. ఇద్దరు చంద్రుళ్ల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరమని చెప్పకతప్పదు.

ఎన్టీఆర్‌ ను మానవాతీత శక్తిగా అభివర్ణించిన తుమ్మల.. ఇద్దరు చంద్రుళ్లను ఎన్టీఆర్‌ తో పోలిక తీసుకురాలేమని తేల్చేశారు. ఎన్టీఆర్‌ దేవుడు లాంటి వాడని.. ఎన్టీఆర్‌ దగ్గర స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం సామాన్యంగా రాదని.. కానీ.. చిన్న వయసులోనే మంత్రిని అయిన తాను.. ఎన్టీఆర్‌ కు ఏదైనా చెబితే ఓకే అయ్యేదని.. బాబు దగ్గరా అలానే ఉండేదని.. కేసీఆర్‌ దగ్గరా కంటిన్యూ అవుతుందని చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్‌.. చంద్రుళ్లను ముఖ్యమంత్రులుగా చూస్తున్న నేపథ్యంలో వారిలో ఉన్న ప్లస్‌.. మైనస్‌ లు చెప్పమంటే తుమ్మల ఎలాంటి మొహమాటం పడకుండా చెప్పేశారు. ఎన్టీఆర్‌ ఒక మానవాతీత అంశగా అభివర్ణించిన తుమ్మల.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనని తేల్చేశారు. ''ఎన్టీఆర్‌ ని ఎవరితోనూ పోల్చలేం. ఆ మహానుభావుడ్ని పదవి నుంచి దింపాల్సి వచ్చినప్పుడు పార్టీ కోసమే నేను.. కేసీఆర్‌..ఇంకో ముగ్గురం కలిసి చేశాం. కానీ.. చరిత్రలో అదో దురదృష్టకరం. చంద్రబాబు.. కేసీఆర్‌ లలో తేడా కనిపించట్లేదు. చంద్రబాబు ఎక్కువసేపు ఆలోచించి చేస్తే.. కేసీఆర్‌ వెనువెంటనే చేస్తారు. నిర్ణయాల్లో బాబు దగ్గర నిదానంగా.. కేసీఆర్‌ దగ్గర వేగంగా ఉండటం వల్ల నష్టాలు వస్తాయి. ఇప్పుడు కుటుంబ పాలన ఎక్కువ అయ్యింది. వేరే ముఖ్యమంత్రుల వద్ద కుటుంబ పాలన అంతగా ఉండేది కాదు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులు మొత్తం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఒకవేళ పదవులకు నామినేట్‌ చేసి ఉంటే విమర్శించేందుకు అవకాశం ఉండేది. ఏమైనా ఎన్టీఆర్‌ తో చంద్రబాబు.. కేసీఆర్‌ లను పోల్వలేం'' అని తేల్చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు