రామ్‌ చరణ్‌కి కజిన్సే విలన్స్‌!

రామ్‌ చరణ్‌కి కజిన్సే విలన్స్‌!

చిరంజీవి అనే మహావృక్షం నీడలో చాలా మంది హీరోలయ్యారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో వున్నంత మంది హీరోలు ఇంకే ఫ్యామిలీలో లేరు. పైగా చిరు ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలంతా కూడా సక్సెస్‌ అయి బిజీ అయ్యారు. పవన్‌కళ్యాణ్‌ని పక్కన పెడితే చరణ్‌, అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌.. ఇలా వీరంతా ఒకే ఏజ్‌ గ్రూప్‌ వారు కావడంతో పోటీ తీవ్రతరమైంది. చరణ్‌, అర్జున్‌ ఒక రేంజ్‌ హీరోలైతే.. వరుణ్‌, సాయి ధరమ్‌ ఇద్దరూ నెమ్మదిగా నిచ్చెన ఎక్కుతున్నారు.

చిరంజీవి తనయుడిగా తండ్రి వారసత్వాన్ని పూర్తిగా ఎంజాయ్‌ చేయాలని, ఫాన్‌ బేస్‌ అంతటినీ తానే ఉత్తేజితం చేయాలని చరణ్‌కి వుంటుంది. కానీ మెగా ఫ్యామిలీ నుంచే ఇన్ని ఆప్షన్స్‌ వుండడంతో అభిమానులు చరణ్‌ని ప్రత్యేకంగా చూడడం లేదు. వీళ్లందరిలో ఒకడిగానే చూస్తూ అతని సినిమాలు బాగుంటే చూస్తున్నారు, లేదా మానేస్తున్నారు. మెగా బ్రాండ్‌ని సాంతం వాడుకోలేకపోతున్న వెలితి ఒక పక్క చరణ్‌ని వేధిస్తుండగా... కుటుంబంలో ఇంతమంది హీరోలు వుండడం వల్ల చరణ్‌కి కొందరు దర్శకులతో పని చేసే అవకాశం రావడం లేదు. చరణ్‌ ఖాళీగా లేడంటే వెంటనే తమ ఫ్యామిలీలోనే మరో హీరోతో సినిమా చేసేసుకుంటున్నారు.

ఒక్కోసారి ఓ దర్శకుడు చెప్పిన కథలో మార్పులు సూచించడమో, లేదా హోల్డ్‌లో పెట్టడమో చేస్తే.. ఆ కథని తమ ఫ్యామిలీనుంచే మరో హీరో ఎగరేసుకుపోతున్నాడు. అల్లు అర్జున్‌ వరుసగా పెద్ద దర్శకులతో సినిమాలు చేస్తూ వుంటే చరణ్‌ మాత్రం తన నంబర్‌ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడాల్సి వస్తోంది. మరో వైపు వరుణ్‌ తేజ్‌ వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాడు. చిరు, పవన్‌ పోలికలున్నాయంటూ సాయి ధరమ్‌ తేజ్‌ని కూడా నెత్తిన పెట్టుకుంటున్నారు. సాధారణంగా వేరే హీరోలతో పోటీ పడడం, వారిపై పై చేయి సాధించడమే ఏ హీరోకైనా ప్రథమ కర్తవ్యం. కానీ చరణ్‌ మాత్రం తన ఫ్యామిలీకి చెందిన వారితోనే తంటాలు పడాల్సి వస్తోంది. ముందు ఇంట గెలిచి, ఆపై రచ్చ గెలవాల్సిన సిట్యువేషన్‌ క్రియేట్‌ అయింది.

తన పేరు చెప్పుకుని ఎంత మంది హీరోలైనా కాదనలేని పరిస్థితి చిరంజీవిది. పైగా వారి సినిమాల ప్రమోషన్స్‌కి కూడా తానే 'పెద్ద'గా వ్యవహరించి ఆడియో వేడుకలకి వెళ్లడం, లేదా వారి సినిమాలు విడుదలైన తర్వాత ప్రెస్‌మీట్లు పెట్టడం లాంటివి చేయాల్సి వస్తోంది. మేనల్లుళ్లూ, తమ్ముళ్ల కొడుకులు తన కొడుక్కే ఎసరు పెడుతున్నారని తెలిసినా కానీ ఆ వెలితి బయటకి కనబడనివ్వకుండా నవ్వుతూ వారి భుజం తట్టాల్సి వస్తోంది. బ్రూస్‌లీ పరాజయం తర్వాత రామ్‌ చరణ్‌ ఈ విషయం మీదే ఎక్కువ కన్సర్న్‌ ఫీలవుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ మెగా పోటీని తట్టుకుని.. చిరు వారసుడిగా తన సత్తా చాటుకోవడానికి చరణ్‌ ముందు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో, ఎలా పై చేయి సాధిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు