కోటలు దాటుతున్న కోన మాటలు!

కోటలు దాటుతున్న కోన మాటలు!

'శంకరాభరణం' చిత్రానికి కథ, మాటలు రాయడంతో పాటు సమర్పణ బాధ్యతలు తీసుకోవడమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసానని కోన వెంకట్‌ చెబుతున్నాడు. నిఖిల్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రం 'ఫస్‌ గయా రే ఒబామా' అనే హిందీ చిత్రం స్ఫూర్తితో తెరకెక్కింది. ఈ క్రైమ్‌ కామెడీతో తెలుగు సినిమాకి కొత్త ట్రెండ్‌ పరిచయం చేస్తానని కోన వెంకట్‌ అంటున్నాడు. ఈ చిత్రాన్ని నవంబర్‌ 11న విడుదల చేయాలని అనుకున్నారు కానీ అఖిల్‌ రిలీజ్‌ అవుతోందని నవంబర్‌ 20కి వాయిదా వేసారు. నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 4కి మారిన ఈ చిత్రాన్ని అఖిల్‌ రన్‌కి అంతరాయం కలిగించకుండా తాము వెనక్కి జరుగుతున్నామని కోన వెంకట్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అఖిల్‌ సినిమాకీ, శంకరాభరణంకీ స్కేల్‌ పరంగా, స్టార్‌ వేల్యూ పరంగా వున్న అంతరాలు అన్నీ ఇన్నీ కావు.

కనీసం అఖిల్‌లో సగం తూగని సినిమాని దానికి అడ్డు తొలగించామని చెప్పడం అక్కినేని అభిమానులకి ఆగ్రహం తెప్పించింది. థియేటర్లు దొరకవనే భయంతో, కలెక్షన్లు రావనే బెంగతో సినిమాని వాయిదా వేసుకుని మళ్లీ మాకు ఏదో లాభం చేస్తున్నవాడిలా మాట్లాడొద్దంటూ అక్కినేని అభిమానులు అప్పటికప్పుడే కోన వెంకట్‌ని తగులుకున్నారు. ఏదేమైనా ఈమధ్య స్టేట్‌మెంట్స్‌ పరంగా కోన కోటలు దాటేస్తున్నాడు. బ్రూస్‌లీ పరాజయంతో తనకే సంబంధం లేదంటూ పూర్తిగా శ్రీను వైట్లని బాధ్యుడ్ని చేసేస్తున్న కోన అదే 'దూకుడు' విజయంలో తనకి క్రెడిట్‌ ఇవ్వలేదంటూ గగ్గోలు పెట్టడంతో అతని ద్వంద్వ వైఖరిని సోషల్‌ మీడియాలో దుయ్యబడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు