మెగా ప్రొడ్యూసర్ కొడుకు అడ్రస్ గల్లంతు

మెగా ప్రొడ్యూసర్ కొడుకు అడ్రస్ గల్లంతు

తొలి సినిమా ‘తూనీగ తూనీగ’ ఫ్లాప్ అయినా.. ‘అంతకుముందు ఆ తరువాత’ లాంటి మంచి సినిమాతో బాగానే పేరు తెచ్చుకున్నాడు సుమంత్ అశ్విన్. ఆ తర్వాత మారుతి బేనర్లో చేసిన ‘లవర్స్’ కూడా పర్వాలేదనిపించింది. దీంతో కుర్రాడు హీరోగా నిలదొక్కుకున్నట్లే కనిపించాడు. కొడుకును హీరోగా నిలబెట్టడానికి సినిమాల నిర్మాణం మానుకున్న మెగా ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు ఇక ఊపిరి పీల్చుకోవచ్చనే అనుకున్నారంతా. కానీ ఏడాదిలో కుర్రాడి జాతకం తిరగబడింది. పోయినేడాది ‘చక్కిలిగింత’ సినిమాతో దారుణమైన ఫ్లాప్ చూసిన సుమంత్.. తాజాగా ‘కొలంబస్’ సినిమాతో మరో ఎదురు దెబ్బ తిన్నాడు.

కొలంబస్ సినిమా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. దసరాకు ఈ సినిమా ఒకటి విడుదలైన సంగతి కూడా జనాలు పట్టించుకోవట్లేదు. ఎమ్మెస్ రాజు స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందించిన సినిమా ఇది. ‘కొలంబస్’ పెద్ద హిట్టని ఆయన డబ్బా కొట్టేసుకుంటున్నారు కానీ..  జనాలకు మాత్రం ఆ సినిమా పట్టట్లేదు. మరో చిన్న సినిమా ‘రాజు గారి గది’ అంచనాల్ని మించిపోయి బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుంటే.. ‘కొలంబస్’ సినిమా మాత్రం ఎవ్వరికీ పట్టట్లేదు. ఈ సినిమా ఎలా ఉంది అని మాట్లాడే నాథుడే లేడు. సినిమా ఎలా ఉందని అడిగేవాడు లేడు. చెప్పేవాడు లేడు. మొత్తానికి మెగా ప్రొడ్యూసర్ కొడుకు మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టాల్సిన స్థితిలో ఉన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు