మళ్లీ పాత ఎమ్మెస్ రాజును చూస్తారట

మళ్లీ పాత ఎమ్మెస్ రాజును చూస్తారట

ఇప్పుడు టాలీవుడ్లో అగ్ర నిర్మాతగా హవా సాగిస్తున్న దిల్ రాజుకు కూడా ఒకప్పుడు స్ఫూర్తిగా నిలిచిన నిర్మాత ఎమ్మెస్ రాజు. ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో నిర్మాతగా అగ్ర పథానికి దూసుకెళ్లాడు రాజు. అప్పట్లో ఆయనే నెంబర్ వన్ ప్రొడ్యూసర్. ఎం.ఎస్ అంటే మెగా సక్సెస్ అన్న గుర్తింపు సంపాదించారాయన. ఐతే పౌర్ణమి దగ్గర్నుంచి ఆయన జాతకం తిరగబడింది. వాన, ఆట లాంటి ఫ్లాపులతో బాగా వెనకబడి పోయారు. కొడుకు సుమంత్ అశ్విన్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ స్వీయ దర్శకత్వంలో తీసిన ‘తూనీగ తూనీగ’ కూడా ఆయనకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఐతే సుమంత్ ఎలాగోలా హీరోలా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘కొలంబస్’ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించిన రాజు.. త్వరలోనే మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అవుతానంటున్నాడు. మళ్లీ ఓ పెద్ద హీరోతో సినిమా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నానని.. జనాలు మళ్లీ పాత ఎమ్మెస్ రాజును చూడబోతున్నారని అంటున్నారాయన. ‘‘నిర్మాతగా 12 సినిమాలు నిర్మించా. వాటిలో మూడొంతుల సినిమాలు బాగా ఆడాయి. ఐతే మధ్యలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. మా అబ్బాయిని హీరోగా నిలబెట్టాలన్నదే నా కోరిక. నేను కొంత గ్యాప్ తీసుకోవడానికి కూడా సుమంతే కారణం. ఇప్పుడతను తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక నేను మళ్లీ యాక్టివ్ అవుతా. నా బేనర్లో త్వరలోనే ఓ పెద్ద హీరోతో సినిమా మొదలుపెట్టబోతున్నా. సుమంత్‌తోనూ ఓ సినిమా తీస్తా’’ అని చెప్పాడు ఎమ్మెస్ రాజు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు