30 కోట్లు మింగేసిన పులి

30 కోట్లు మింగేసిన పులి

కొండంత రాగం తీసి.. అదేదో పాట పాడాడట ఎవడో. సరిగ్గా ‘పులి’ సినిమా పరిస్థితి ఇలాగే ఉంది. ‘బాహుబలి’కి ఏమాత్రం తగ్గని సినిమా అంటూ తమిళ ఇండస్ట్రీ జనాలు ఓ గొప్పలు చెప్పుకున్నారు ఈ సినిమా గురించి. తీరా బొమ్మ చూస్తే జనాలకు దిమ్మదిరిగిపోయింది. కోలీవుడ్లో గత కొన్నేళ్లలో వచ్చిన అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటనిపించుకుంది ‘పులి’. తొలి షో నుంచే నెగెటివ్ రావడంతో కలెక్షన్లకు పెద్ద దెబ్బే పడింది. తుపాకి, కత్తి లాంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత వచ్చిన సినిమా కాబట్టి.. విజయ్ బాక్సాఫీస్ స్టామినా ‘పులి’ని కొంత వరకు ఆదుకుంది. అయినా ఫలితం లేదు. నిర్మాతలు సినిమాను బాగానే అమ్మేసుకున్నారు కానీ.. చివరికి బయ్యర్లే అన్యాయమైపోయారు.

సినిమాకు డివైడ్ టాక్ ఉన్నప్పటికీ తొలి వారం తమ సినిమా రూ.71 కోట్ల గ్రాస్ వసూలు చేసిందంటూ నిర్మాతలు ఘనంగా ప్రకటించుకున్నారు. మామూలుగా నిర్మాతల లెక్కలు కొంచెం అతిగా ఉంటాయి. అయినప్పటికీ అదే నిజం అనుకుందాం. ఆ 71 కోట్లలో షేర్ చూస్తే రూ.50 కోట్లకు అటు ఇటుగా ఉంటుంది. ఐతే ‘పులి’ థియేట్రికల్ బిజినెస్ రూ.105 కోట్లకు జరిగింది. మరి మిగతా రోజుల్లో ఇంకో రూ.50 కోట్లకు పైగా రావడం అన్నది అసాధ్యం. రెండో వారానికి థియేటర్లు ఖాళీ అయిపోయాయి కాబట్టి ఇంకో రూ.20 కోట్లు వచ్చినా గొప్పే. కాబట్టి తక్కువలో తక్కువ రూ.30 కోట్ల దాకా నష్టమన్నమాట. ఇక తెలుగు వెర్షన్ సంగతైతే ఘోరం. తుపాకి, జిల్లా లాంటి సినిమాలు ఓ మాదిరిగా ఆడటంతో రూ.7 కోట్లు పెట్టి హక్కులు తీసుకున్నారు. ఓపెనింగ్స్ వర్కవుటైతే బయటపడిపోయేవాళ్లు కానీ.. తొలి రోజు సినిమా విడుదల కాకపోవడంతో చాలా ఆదాయం కోల్పోయారు. నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయాక రెండో రోజు సాయంత్రానికి షోలు పడ్డాయి. దీంతో వసూళ్లలో బాగా కోత పడింది. సగం పెట్టుబడి కూడా వెనక్కి రాలేదని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు