సినిమా రివ్యూ: రుద్రమదేవి

సినిమా రివ్యూ: రుద్రమదేవి

రేటింగ్‌: 2.75/5

తారాగణం: అనుష్క, అల్లు అర్జున్‌, రానా, కృష్ణంరాజు తదితరులు
సంగీతం: ఇళయరాజా
కెమెరా: అజయ్‌ విన్సెంట్‌
ఎడిటర్‌: శ్రీకర్‌ ప్రసాద్‌
నిర్మాత గుణశేఖర్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గుణశేఖర్‌

రుద్రమదేవి చిత్రం తీయడమనేది తన కల అని చెప్పిన గుణశేఖర్‌ దానిని సాకారం చేసుకునేందుకు తన యావదాస్తిని పణంగా పెట్టాడు. చారిత్రిక చిత్రాలు తెలుగు తెరపై వచ్చి చాలా కాలమవుతోంది. 'తాండ్ర పాపారాయుడు' తర్వాత మళ్లీ అలాంటి సినిమాలు ఎవరూ అటెంప్ట్‌ చేయలేదు. రాజమౌళి జానపద చిత్రాలు తీస్తున్నాడు కానీ చరిత్రని టచ్‌ చేయట్లేదు. అందుకే రుద్రమదేవి చిత్రం వస్తుందంటే ఒక విధమైన కుతూహలం సినీ ప్రియుల్లో ఏర్పడింది. గుణశేఖర్‌ ఈమధ్య కాలంలో అంటే ఫ్లాప్‌ సినిమాలు తీస్తున్నాడు కానీ ఒక్కడు తీసిన డైరెక్టర్‌ కూడా అతనే కాబట్టి రుద్రమదేవి సినిమాపై ఒక విధమైన అంచనాలైతే ఏర్పడ్డాయి. ప్రతి వారం అదే మసాలా సినిమాలు చూసి విసిగిపోతున్న జనాలకి కాస్త ఉపశమనం ఇచ్చి, కొత్త అనుభూతిని కలిగించేవి ఇలాంటి చిత్రాలే. కాకపోతే ఈ తరహా చిత్రాల్లో ఎమోషన్లు పతాక స్థాయిలో పండాలి. లేదా బాహుబలి మాదిరిగా విజువల్‌ ఎఫెక్టులు అద్దిరిపోవాలి. రుద్రమదేవి విషయంలో ఆ రెండూ జరగలేదు.కథ:   

రాజుగారికి మగపిల్లాడు పుట్టాలని రాజ్యం మొత్తం ఎదురు చూస్తోంటే ఆడపిల్ల పుడుతుంది. ఆ సంగతి తెలిస్తే ప్రజలు నీరుగారిపోతారని, శత్రువులు దండెత్తి వస్తారని భయపడి మగబిడ్డ పుట్టాడని చెప్తారు. రుద్రమదేవిని రుద్రదేవగా (అనుష్క) పెంచి పెద్ద చేస్తారు. యవ్వన ప్రాయానికి వచ్చే వరకు రుద్రదేవకి కూడా ఆడపిల్ల అనే సంగతి తెలియదు. తెలిసినా కానీ జనం కోసం మగాడిగానే నమ్మబలుకుతుంది. ఈ క్రమంలో ఆమెకి ముక్తాంబనిచ్చి (నిత్యమీనన్‌) పెళ్లి కూడా చేస్తారు. అయితే నిజం నిగ్గుదేలి రుద్రమకి పట్టాభిషేకం చేయాలని తలచినపుడు దాయాదులు ఎదురు తిరుగుతారు. శత్రువులు దండెత్తి వస్తారు. రుద్రమ తన ప్రియుడు చాళుక్య యువరాజు (రానా), బాల్యమిత్రుడు గోనగన్నారెడ్డి (అల్లు అర్జున్‌) ఇద్దరితో కలిసి రాజ్యాన్ని ఎలా కాపాడుకుని శత్రువుని జయించింది అనేది కథ.కథనం:

రుద్రమదేవి జీవితంలో ఎంత డ్రామా వుందనేది మనకి తెలీదు. ఏదో చిన్నప్పుడు నాన్‌ డీటెయిల్డ్‌ పుస్తకాల్లో వచ్చిన చిన్న పాఠంలో ఆమె ఎవరనేది కాస్త అవగాహన అయితే వుంటుంది. ఇంటర్నెట్‌లో తెలుసుకోగోరిన వారికి మరికొంత ఐడియా ఏర్పడుతుంది. అయితే ఒక సినిమా తీసేంతగా గుణశేఖర్‌ని ప్రేరేపించిన అంశాలేంటి, రుద్రమదేవి జీవితంలో మనకి తెలియని ఆ విశేషాలు ఏమిటి అనే కుతూహలాన్ని రుద్రమదేవి చిత్రం పూర్తిగా చంపేస్తుంది. ఆడపిల్ల అయినా యుక్త వయసు వచ్చే వరకు మగాడిగానే చలామణీ అయిన రుద్రమదేవి గురించి అంతకు మించిన గొప్ప విశేషాలేం చెప్పలేదు.కదన రంగంలో కదం తొక్కే వీరనారిగానూ ఆమె కనిపించలేదు. కొన్ని పోరాట దృశ్యాలనైతే పెట్టారు కానీ రుద్రమదేవిని ఔరా అని చూసేలా ఒక్క సన్నివేశం కూడా పెట్టలేదు. ఆడది అని తనని జనం చిన్నచూపు చూస్తున్నప్పుడు జనం మతులు పోయేలా ఆమె మాట్లాడనూ మాట్లాడదు. బేలగా రాజ్యం వదిలి గుడిలో నివాసం వుండేందుకు వెళ్లిపోతుంది. గోన గన్నారెడ్డిని 'హీరో'గా చూపించేందుకు రుద్రమదేవిని కూడా అండర్‌ ప్లే చేసినట్టు అనిపిస్తుంది. రానాని పెట్టుకున్నందుకు అతనికీ ఏదో ఒక పని చెప్పాలన్నట్టు, అల్లు అర్జున్‌ వున్నందుకు అతని స్టార్‌డమ్‌ని వాడుకోవాలన్నట్టుగా పలు సన్నివేశాలున్నాయి.

    రుద్రమదేవి ఎంతటి ధీర వనిత అనే సంగతి పక్కనపెట్టి ఆమె వ్యక్తిగత విషయాలని, ప్రేమకి సంబంధించిన అంశాలని గుణశేఖర్‌ వివరంగా పూసగుచ్చాడు. ఏ ట్విస్ట్‌ని కూడా పండించే విధంగా రివీల్‌ చేయలేకపోయారు. డ్రామాకి చోటు లేకపోవడంతో ఎమోషన్లు పండలేదు. ఆడది అని తెలిసి కూడా రుద్రమని పెళ్లి చేసుకున్న ముక్తాంబ ఆ విషయం రివీల్‌ చేసేటప్పుడు వుండాల్సిన ఎమోషన్‌ వుండదు. గోన గన్నారెడ్డి వెనుక వున్నది రుద్రమ అన్న సంగతి బయటపెట్టినప్పుడు కూడా ఏమనిపించదు. గుణశేఖర్‌ ఈ చిత్రానికి ఎలాంటి హంగులు అద్దితే జనం అబ్బురపడతారని ఆలోచించాడే తప్ప కథలో బలమైన భావోద్వేగాలు వున్నాయా లేవా అనేది చూసుకోలేదు.చివరకు పతాక సన్నివేశాల్లో కూడా రుద్రమదేవిని బలహీనంగానే చూపించాడు. అక్కడికి ఆమెకి తనని తాను నిరూపించుకునే అవకాశాన్ని గోన గన్నారెడ్డి కల్పించినట్టుగా చూపించి అల్లు అర్జున్‌ పాత్రని ఎలివేట్‌ చేసి కథానాయికని తగ్గించేశారు. డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని చెప్పుకున్న సినిమాని గుణశేఖర్‌ ఇంత బలహీనంగా తీర్చిదిద్దడం ఆశ్చర్య పరుస్తుంది. అలంకరణకి పెట్టుకున్న అల్లు అర్జున్‌ పాత్రే సినిమాకి బలంగా మారింది. రుద్రమదేవి మాత్రం బేలగా, అబలగా గోచరిస్తుంది.నటీనటులు:

అనుష్కకి ఇలాంటి పాత్రలు అలవాటైపోయాయి. అయితే తాను కూడా సినిమాలో ఎక్కువ సేపు ఒకటే ఎక్స్‌ప్రెషన్‌తో గడిపేయాల్సి వచ్చింది. అల్లు అర్జున్‌ తన తెలంగాణ యాసతో అలరించాడు. అతనే ఈ సినిమాకి హైలైట్‌గా నిలిచాడు. రానాకి బలమైన పాత్ర లేదు కానీ ఉన్నంతలో బాగానే చేశాడు. ప్రకాష్‌రాజ్‌ నటన బాగుంది. కృష్ణంరాజు పాత్ర సబబుగా అనిపిస్తుంది. సుమన్‌, ఆదిత్య మీనన్‌ విలన్లుగా ఫర్వాలేదనిపించారు. నిత్యామీనన్‌, కేథరిన్‌ అదనపు ఆకర్షణగా నిలిచారు. అదృష్టవశాత్తూ బాబా సెహగల్‌, హంసా నందినిపై తీసిన పాటని ఎడిటింగ్‌లో తొలగించారు.సాంకేతికవర్గం:

గుణశేఖర్‌ ఈ చిత్రానికి పడ్డ కష్టం, తపన ఏంటనేవి కనిపిస్తున్నా కానీ తన కథని అలరించే విధంగా తెరకెక్కించడంలో మాత్రం విఫలమయ్యాడనే చెప్పాలి. సాధారణంగా డ్రీమ్‌ ప్రాజెక్టులు అనుకున్న వాటిని అద్భుతంగా తెరకెక్కిస్తారు. గుణశేఖర్‌ ఈ చిత్రానికి ఏ విధంగాను పూర్తి న్యాయం చేయలేకపోయాడు. ఇళయరాజా బాగా నిరాశ పరిచారు. అజయ్‌ విన్సెంట్‌ ఛాయాగ్రహణం బాగుంది. ఎడిటింగ్‌ మరింత బాగుండాల్సింది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు కానీ గ్రాఫిక్స్‌ మరీ కార్టూన్ల మాదిరిగా అనిపించాయి.చివరిగా...

    రుద్రమదేవి కథ తెలుసుకోవాలని అనుకునే వారికి కొన్ని విశేషాలైతే తెలుస్తాయి. కానీ ఆమె గురించిన పూర్తి వివరాలని మాత్రం చూపించలేదు. గ్లామర్‌, యాక్షన్‌ లాంటి అంశాలని జోడించాలని చూసిన దర్శకుడు ఎమోషన్ల మీద దృష్టి పెట్టలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు