సినిమా రివ్యూ: శివమ్‌

సినిమా రివ్యూ: శివమ్‌

సినిమా రివ్యూ: శివమ్‌
రేటింగ్‌: 2.5/5
తారాగణం: రామ్‌, రాశి ఖన్నా తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
కెమెరా: రసూల్‌
ఎడిటర్‌: మధు
నిర్మాత: రవికిషోర్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి

రొటీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కి భిన్నంగా సరికొత్తగా వుండే సినిమాని అందిస్తున్నామంటూ రామ్‌ చాలా ఎక్సయిటింగ్‌గా చెప్పాడు. విడుదలకి ముందు ఈ చిత్రానికి జరిగిన బిజినెస్‌ చూస్తే ఇది ఎంత బాగుంటుందో అనే నమ్మకం కలగకపోదు. మరి దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి ఏమి చెప్పాడో, అది చూసిన రామ్‌కి, ఇతర చిత్ర బృందానికి ఏం అనిపించిందో తెలీదు కానీ 'శివమ్‌' చిత్రం మాత్రం ప్రేక్షకుల పాలిట శాపమైంది. సరికొత్త వినోదాన్ని అందిస్తున్నామనే భ్రమలో అసలు ఏమాత్రం ఎంజాయ్‌ చేయలేని ఒక చిత్ర విచిత్రమైన సినిమాని తీసి జనాల మీదకి వదిలారు. ఎన్నో సినిమాల్లో చూసిన పాయింట్లన్నిటినీ కలిపి ఒక ప్రేమకథకి తగిలించి శ్రీనివాసరెడ్డి చేసిన కిచిడీ మొదట్లో బాగానే అనిపించినా కానీ కాసేపటికే మొహం మొత్తేస్తుంది.

కథ:    

ప్రేమజంటలకి పెళ్లిళ్లు చేసే శివ (రామ్‌) తన జంట కోసం వేచి చూస్తుంటాడు. రైల్లో వెళుతుండగా తనకి కనిపించిన అమ్మాయి 'ఐలవ్యూ' అంటూ అరిచే సరికి సరాసరి రైల్లోంచి దూకేసి ఆమె వెంట పడతాడు. కానీ ఆమెని ముందు నుంచే ప్రేమిస్తూ వచ్చిన రౌడీ అభితో (అభిమన్యుసింగ్‌) పాటు తాను పెట్టుకున్న ఒక చిన్న గొడవ కూడా వచ్చి శివ మెడకి చుట్టుకుంటుంది. అన్ని సమస్యల్నీ పరిష్కరించుకున్న శివ చివరిగా తన ప్రేమని ఎలా దక్కించుకుంటాడనేది కథ.

కథనం:

ఇందులోని ఏ ముఖ్య ఘట్టం తీసుకున్నా కానీ ఏదో ఒక సినిమాలో చూసినట్టే అనిపిస్తుంది. కొడుకుని చంపడానికి తిరిగే తండ్రి, ఎక్కడో రోడ్డు మీద రౌడీని కొడితే వాళ్ల మనుషులంతా హీరోపై పగబట్టడం, హీరోయిన్‌ని చూడగానే విలన్‌ ప్రేమలో పడడం, ఇలా ఏది తీసుకున్నా కానీ ఎక్కడో ఒక చోట చూసినట్టే అనిపిస్తుంది. ఈ రొటీన్‌ తతంగం అంతా కొత్తగా అనిపించాలని కామెడీతో కవర్‌ చేయడానికి చూసారు. కానీ వారు అనుకున్నది ఒకటైతే, తెరమీదకి వచ్చింది ఒకటి కావడంతో ఈ కామెడీని ఎక్కువ మంది ఎంజాయ్‌ చేయలేరు.

ఫస్ట్‌హాఫ్‌ కాసేపు సరదాగానే సాగినా కానీ తర్వాత్తర్వాత అంతగా ఆకట్టుకోదు. ఈమధ్య వస్తున్న సినిమాల్లో సెకండ్‌ హాఫ్‌ బాగోవడం లేదంటూ కామెంట్లు వస్తున్నాయని, కానీ శివమ్‌ చిత్రానికి సెకండ్‌ హాఫ్‌ ప్లస్‌ అవుతుందని రామ్‌ చెప్పాడు. సెకండ్‌ హాఫ్‌లో ఏదైనా చేసి శివమ్‌ని ఆసక్తికరంగా మారుస్తారనే నమ్మకాలేవీ ఇంటర్వెల్‌ పాయింట్‌లో కలగకపోయినా కానీ ఏదో చేస్తారనే ఆశ అయితే వుంటుంది. కానీ శివమ్‌ ద్వితీయార్థం మరింత నాసిరకంగా తయారు కావడంతో థియేటర్లో కూర్చోవడమే కష్టమవుతుంది. కథ లేకుండా సినిమాని దారుణాతి దారుణంగా ఎందుకు సాగతీసారనేది కూడా అర్థం కాదు. ఏ పాయింట్‌లో అయినా కానీ క్లయిమాక్స్‌కి చేర్చడానికి వీలున్న సినిమాని కారణం లేకుండా సాగతీయడం వల్ల శివమ్‌ పూర్తిగా చెడిపోయింది.

కామెడీ పేరు చెప్పి ఈమధ్య ప్రతి సినిమాలోను కథని పక్కన పడేస్తున్నారు. ఇందులోను అదే ఎస్కేపిజం చూపించారు. కానీ ఇలాంటి సినిమాల్లో కామెడీ ఎంత పండితే అంత బెనిఫిట్‌ ఉంటుంది. శివమ్‌ సినిమాలో కామెడీ చిరాకు పెట్టడం వల్ల ఇక దీనిని ఎంజాయ్‌ చేయడానికి వీల్లేకుండా పోయింది. పండగ చేస్కో చిత్రం కూడా కథ లేకుండా నాసిరకంగా రూపొందినా కానీ కొన్ని కలిసి వచ్చి రామ్‌ పాస్‌ అయిపోయాడు. కానీ శివమ్‌ సినిమాకి అతని ఆటలు చెల్లడం కష్టమే. ఎందుకంటే ఈ మూడు గంటల సోదిని భరించే ఓపిక ఎవరికో కానీ ఉండదు.

నటీనటులు:

రామ్‌ తనవరకు చేయగలిగింది చేసాడు. అయితే క్యారెక్టర్ల పరంగా వేరియేషన్‌ చూపించడానికి ప్రయత్నించడం లేదు. అన్ని సినిమాల్లో ఒకే తీరున నటిస్తున్నట్టు అనిపిస్తుంది. టాలెంట్‌ ఉన్నవాడే కనుక కొత్తగా చేయడానికి ప్రయత్నించాలి. రాశిఖన్నా చూడ్డానికి బాగుంది. కాస్త ఒళ్లు తగ్గించాలి. తెరనిండా ఆర్టిస్టులున్నారు. వారిలో చాలా మంది ప్రతిభావంతులు కూడా ఉన్నారు. కానీ దర్శకుడు వారిలో ఏ ఒక్కరినీ సరిగ్గా వాడుకోలేకపోయాడు. అందుకే తారాగణం మీద పెట్టినదంతా కూడా వృధాగా పోయింది.

సాంకేతికవర్గం:

శ్రీనివాసరెడ్డి పాత పద్ధతుల్లో సినిమాని నడిపించి పాస్‌ అవడానికి చూసాడు కానీ కొత్తదనం కోసం ప్రయత్నించలేదు. కొత్త దర్శకుడితో చేయడానికి అంత ఎక్సయిట్‌ అయిన రామ్‌ని ఏమి చెప్పి మెప్పించాడనేది మాత్రం అర్థం కాలేదు. దేవిశ్రీప్రసాద్‌ కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసాడు. ఈ రొటీన్‌ సినిమాకి తూ తూ మంత్రం పాటలు చేసిచ్చేసాడు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా మనసు పెట్టి చేసాడనిపించలేదు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. ఎడిటింగ్‌ చాలా బ్యాడ్‌. సినిమాలో అవసరం లేని మేటర్‌ చాలా ఉన్నా కానీ ఎడిటర్‌ కత్తెరకి పని చెప్పలేదు. కనీసం నిడివి తక్కువ అయినా కానీ కాస్తో కూస్తో తట్టుకునే వీలుండేదేమో.

చివరిగా...

రొటీన్‌ సినిమాలు చూడ్డానికి ఇష్టపడే వాళ్లు కూడా భరించలేనంత రొటీన్‌గా ఉన్న శివమ్‌ ఈ కంటెంట్‌తో బాక్సాఫీస్‌ని గట్టెక్కడం కష్టమే. రామ్‌ ఇప్పటికీ స్టోరీ సెలక్షన్‌లో అవే తప్పులు చేస్తూ తన ప్రతిభని వృధా చేసుకుంటున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English