క‌రోనా ప‌నైపోయింద‌నుకుంటున్నాం కానీ..

ఇండియాలో క‌రోనాను సీరియ‌స్‌గా తీసుకునే రోజులు పోయాయి. గ‌తంతో పోలిస్తే క‌రోనా వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్టిన మాట వాస్త‌వం. కానీ ఇంకా ముప్పు మాత్రం తొల‌గిపోలేదు. ఇంకా కేసులో పెద్ద ఎత్తునే న‌మోద‌వుతున్నాయి. మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. కానీ ఇటు జ‌నాలు, అటు నాయ‌కుల తీరు మాత్రం అస‌లిప్పుడు క‌రోనా ప్ర‌భావ‌మే లేన‌ట్లుగా ఉంటోంది.

కానీ ఒక‌వేళ క‌రోనా పూర్తిగా త‌గ్గుముఖం ప‌ట్టింద‌నుకున్నా.. మ‌ళ్లీ విజృంభించ‌డానికి అవ‌కాశాలు మెండుగానే ఉన్నాయ‌ని యూర‌ప్ దేశాల్లో ప‌రిస్థితి చూస్తే అర్థ‌మ‌వుతుంది. క‌రోనా సెకండ్ వేవ్ ఇప్పుడా దేశాల్ని భ‌యం గుప్పెట‌లోకి నెడుతోంది. ఒక్క‌సారిగా పెరిగిపోతున్న కేసులు, మ‌ర‌ణాల‌తో ఆ దేశాలు వ‌ణికిపోతున్నాయి.

తొలిసారి క‌రోనా విజృంభ‌ణ‌తో అల్లాడిన ఇట‌లీ, స్పెయిన్, జ‌ర్మ‌నీ లాంటి దేశాలు.. క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లతో కొన్ని నెల‌ల్లోనే కోలుకున్నాయి. అక్క‌డ నెమ్మ‌దిగా అన్ని కార్య‌క‌లాపాలూ పున‌ర‌ద్ధ‌రించారు. జ‌నం అన్ని ప‌నులూ చేసుకున్నారు. వ్య‌వ‌స్థ‌ల‌న్నీ పుంజుకున్నాయి. థియేట‌ర్లు సైతం తెరుచుకున్నాయి. సినిమాల సంద‌డి కూడా మొద‌లైంది. కానీ ఈ నెల‌లో మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌ణ మొద‌లైంది. ఈ దేశాల్లో మ‌ళ్లీ రోజు వారీ వేల‌ల్లో కేసులు న‌మోదువుతున్నాయి. మ‌ర‌ణాలు కూడా చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లో ఉంటున్నాయి. దీంతో ఆ దేశాల్లో థియేట‌ర్లు, మాల్స్ మ‌ళ్లీ మూసేయాల్సి వ‌చ్చింది. యూర‌ప్ దేశాల్లో ప‌రిస్థితి ఇలా ఉంటే.. మ‌న ద‌గ్గ‌ర క‌రోనా ఉనికే లేద‌న్న‌ట్లుగా జ‌నాలు మామూలుగా తిరిగేస్తుండ‌టం ప్ర‌మాద ఘంటిక‌ల్ని మోగించేదే.