ఆహా.. సౌండు లేకుండా సినిమాలు దించేస్తున్నారే

100 ప‌ర్సంట్ తెలుగు కంటెంట్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా. అల్లు అర‌వింద్ సార‌థ్యంలో చిన్న చిన్న అడుగులు వేస్తూనే లాక్ డౌన్ టైంలో బాగానే స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను పెంచుకుంది. ఐతే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అంటే నిరంతరం కొత్త కంటెంట్ ఇస్తూనే ఉండాలి.

త‌మదంటూ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అన్నింటికంటే ముఖ్యం. నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ లాంటి పెద్ద ఓటీటీలు భారీ బ‌డ్జెట్లో సొంతంగా వెబ్ సిరీస్‌లు నిర్మిస్తుంటాయి. సినిమాలు కూడా టేక‌ప్ చేస్తుంటాయి. ఆహా కోసం ఆ స్థాయి బ‌డ్జెట్లు పెట్టే ఛాన్స్ లేక‌పోవ‌డంతో ఉన్నంత‌లో ప‌రిమిత బ‌డ్జెట్లో క్వాలిటీ కంటెంట్ ఇవ్వ‌డానికి చూస్తోంది.

ఆహా ఇప్ప‌టికే భానుమ‌తి రామ‌కృష్ణ‌, క‌ల‌ర్ ఫోటో లాంటి చిన్న సినిమాల‌ను ఎక్స్‌క్లూజివ్‌గా అందించింది. కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ వాళ్ల‌తో క‌లిసి పంచుకుంది. త్వ‌ర‌లోనే మా వింత గాథ వినుమా సినిమాను ఎక్స్‌క్లూజివ్‌గా అందించ‌బోతోంది. ఈ సినిమా ఎప్పుడు మొద‌లైందో, ఎప్పుడు పూర్త‌యిందో తెలియ‌దు. ఉన్న‌ట్లుండి న‌వంబ‌రు 4న ప్రిమియ‌ర్స్ అన్నారు.

దీంతో పాటే ఇప్పుడు కొత్త‌గా మ‌రో సినిమా ప్రిమియ‌ర్స్‌ను ప్ర‌క‌టించింది ఆహా. ఆ సినిమా పేరు.. అనగ‌న‌గా ఓ అతిథి. కృష్ణ చైత‌న్య‌, పాయ‌ల్ రాజ్‌పుత్ ఇందులో ముఖ్య పాత్ర‌లు పోషించారు. క‌న్న‌డ‌లో విజ‌య‌వంత‌మైన ఆ క‌రాళ రాత్రి చిత్రాన్ని దాని ద‌ర్శ‌కుడు ద‌యాల్ ప‌ద్మ‌నాభ‌న్ తెలుగులో రీమేక్ చేశాడు. వంశీ పైడిప‌ల్లి ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ను లాంచ్ చేశాడు. ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌రు 13 నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది.