సినిమా రివ్యూ: సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌

సినిమా రివ్యూ: సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌

సినిమా రివ్యూ: సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌
రేటింగ్‌: 3/5
తారాగణం: సాయి ధరమ్‌తేజ్‌, రెజీనా తదితరులు
సంగీతం: మిక్కీ జె. మేయర్‌
కెమెరా: రాంప్రసాద్‌
ఎడిటర్‌: గౌతరరాజు
నిర్మాత: దిల్‌ రాజు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరీష్‌ శంకర్‌

పవన్‌కళ్యాణ్‌, ఎన్టీఆర్‌తో వరుసగా సినిమాలు చేసిన హరీష్‌ శంకర్‌, మరో స్టార్‌ హీరోతో సినిమా చేయకుండా యువ హీరో సాయి ధరమ్‌తేజ్‌తో 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' చేయడం సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్‌ అవడంతో తనతో వెంటనే పని చేయడానికి స్టార్లు ఆసక్తి చూపించకపోవడంతో, వారి కోసమని వెయిట్‌ చేయకుండా తన కథకి తగ్గ హీరోతో ఈ సినిమా చేసినట్టు హరీష్‌ చెప్పాడు. మిరపకాయ్‌, గబ్బర్‌సింగ్‌లాంటి ఎంటర్‌టైనర్లని అందించిన హరీష్‌ శంకర్‌ ఇంకోసారి అలాంటి వినోదాత్మక సినిమా మీదే డిపెండ్‌ అయి సేఫ్‌ గేమ్‌ ఆడాడు. తను చేస్తున్నది ఏ ఇమేజ్‌ లేని కుర్ర హీరోతో అనే డౌట్లు లేకుండా సాయి ధరమ్‌తేజ్‌నే ఫుల్‌ టైమ్‌ మాస్‌ హీరోగా చూపించాడు.

కథ:

తను ఏ పని చేసినా కానీ క్యాష్‌ చేసుకునే మెంటాలిటీ సుబ్రమణ్యంది (సాయి). అతడికి సీత (రెజీనా) అనే ప్రేమలో మోసపోయిన అమ్మాయి పరిచయం అవుతుంది. ఇద్దరూ కలిసి డబ్బు కోసం ఒక కార్యక్రమంలో భార్యాభర్తలుగా నటిస్తారు. దాంతో వారి జీవితమే మారిపోతుంది. అదే నాటకాన్ని కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.

కథనం:

కథలో కొత్తదనం అంటూ లేదని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కథ చదివితే ఈపాటికే ఆ సంగతి మీకు అర్థమై వుండాలి. ఈ కథని చెప్పడానికి హరీష్‌ శంకర్‌ కొత్త రకం స్క్రీన్‌ప్లే కూడా రాసుకోలేదు. చాలా రొటీన్‌గా ప్రేమలో మోసపోయిన అమ్మాయితో హీరోకి పరిచయం కావడం, తర్వాత తన భర్తగా నటించాల్సి రావడం, ఆ తర్వాత ఇద్దరూ వెళ్లి పెద్దల మనసులు గెలుచుకోవడం లాంటి ఫార్మేట్‌లో నడిపించారు. హీరో పాత్రని అమ్ముడుపోయే వ్యక్తి అని చూపించారు. ఆ నేచర్‌ని చూపించి వినోదం పండించే అవకాశం వున్నా కానీ దానిని వాడుకోలేదు. హీరో అలా డబ్బు కోసం ఏదైనా చేయడానికి వెనుక ఓ చేదు బ్యాక్‌స్టోరీ పెట్టారు.

సవతి తల్లి ప్రేమ కోసం తపించే కొడుకు, ఆమె కూతురినే చెల్లి అనుకుని తనకోసం ఏదైనా చేసేసే స్వభావం వున్నవాడు అంటూ మరీ ఎనభైల నాటి సెంటిమెంట్‌ పిండే ప్రయత్నం జరిగింది. బోర్‌ కొట్టించకపోయినా కానీ ఇంటర్వెల్‌ వరకు ఎలాంటి ఆసక్తి కలిగించకుండా నీరసంగా సాగిపోయింది. ఇంటర్వెల్‌ దగ్గర ఫైటు సీన్‌తో చిన్న ట్విస్టు పెట్టారు. ద్వితీయార్థంలో కామెడీ మీదే ఫోకస్‌ పెట్టారు. ఫైట్లు, పాటలు వచ్చి పోతున్నా కానీ నవ్వించడానికి ఎన్ని అవకాశాలున్నాయో అన్నీ వాడుకోవాలని చూసారు. అందులో బాగానే సక్సెస్‌ అయ్యారు కూడా. నవ్వుకోడానికి సినిమాకి వెళ్లినట్టయితే సెకండ్‌ హాఫ్‌లోని కామెడీకి పైసా వసూల్‌ అనిపిస్తుంది.

నవ్వించడం మీదే దృష్టి పెట్టి విలన్లు అందరినీ కూడా కమెడియన్లుగానే చిత్రీకరించారు. విలనీని కూడా సీరియస్‌గా తీసుకోవాల్సిన పని లేకుండా చేసినప్పుడు చివర్లో ఆ సెంటిమెంట్‌ పెట్టాల్సిన అవసరం ఏమిటో అర్థం కాదు. అక్కడ కూడా కామెడీతోనే ముగించడానికి వీలుందేమో చూసుకోవాల్సింది. దాని వల్ల చివరి ఇరవై నిముషాల్లో సినిమాపై తగ్గిన ఇంప్రెషన్‌ నిలబడి వుండేది. ఇప్పటికే ఇలాంటి పులిహోర సినిమాలు చాలానే చూసి విసిగిపోయిన ప్రేక్షకులు ఎన్నిసార్లు ఇవే అంటూ పెదవి విరవచ్చు. కానీ వినోదంతో టైమ్‌పాస్‌ చాలనుకుంటే మాత్రం ఒకసారి చూడవచ్చు.

నటీనటులు:

సాయి ధరమ్‌తేజ్‌లో ఎనర్జీ లెవల్స్‌ బాగా వున్నాయి కానీ పవన్‌కళ్యాణ్‌ని అనుకరించే అలవాటు బాగా వుంది. దానిని మార్చుకోవాలి. మంచి మాస్‌ హీరో కాగల లక్షణాలున్నాయి. రెజీనా ఎప్పటిలానే తన నటనతో మెప్పించింది. అదా శర్మకి ప్రాధాన్యత లేని చిన్న పాత్రనిచ్చారు. బ్రహ్మానందం కామెడీ తేలిపోయింది. రావు రమేష్‌, ఫిష్‌ వెంకట్‌ పాత్రలు బాగున్నాయి. ఝాన్సీ, తేజస్వి రొటీన్‌ పాత్రల్లో కనిపించారు.

సాంకేతికవర్గం:

హరీష్‌ శంకర్‌ సేఫ్‌ గేమ్‌ ఆడాలని చూసాడు. వాణిజ్య విలువల మీదే దృష్టి పెట్టి కథా విలువల్ని పక్కన పెట్టాడు. దీని వల్ల ఈ చిత్రం యావరేజ్‌గా మిగిలింది. మిక్కీ జె. మేయర్‌ సంగీతం సోసోగా వున్నా తెరపై పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటింగ్‌ ఓకే అనిపిస్తుంది. దిల్‌ రాజు ఈ చిత్రానికి ఖర్చు బాగానే పెట్టాడు.

చివరిగా...


సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ సరదాగా ఓ సారి నవ్వుకోడానికి చూడవచ్చు. చిన్న హీరోతో హరీష్‌ శంకర్‌ ఎలాంటి ప్రయోగాలకి పూనుకోలేదు. కనుక కొత్తదనానికి చోటు లేకుండా పోయి వైవిధ్యాన్ని ఇష్టపడే వారిని అంతగా ఆకట్టుకోదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English