నానికి వాపా, బలుపా?

నానికి వాపా, బలుపా?

హీరో నాని కూడా ఇప్పుడు ఇరవై కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. రాజమౌళి ఈగని మినహాయిస్తే ఇంతకుముందు తన సినిమాల్లో దేనికీ పది కోట్ల షేర్‌ వచ్చిందే లేదు. భలే భలే మగాడివోయ్‌ చిత్రానికి క్రేజీ దర్శకుడు కూడా లేకుండా నాని ఇంత పెద్ద విజయం సాధించడంతో అతను కూడా ఒక మాదిరి స్టార్‌ అయిపోయాడని మీడియా ఆకాశానికి ఎత్తేస్తోంది. నిజంగానే ఇప్పుడు మిడ్‌ రేంజ్‌ హీరోల్లో నానికి చాలా డిమాండ్‌ వుంది. ఇంతవరకు అతని సినిమాలపై అయిదు కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఆలోచించిన నిర్మాతలు ఇప్పుడు అవసరాన్ని బట్టి పదిహేను కోట్లు పెట్టడానికి కూడా వెనకాడరు. ఈ విజయంతో నానికి ఇక తిరుగు వుండదని, ఇంతకాలం పడ్డ కష్టాలు అన్నీ అయిపోయినట్టేనని, ఇక తర్వాతి సినిమా ఏంటని వెతుక్కునే పరిస్థితి వుండదని అనేస్తున్నారు. కానీ నాని ఇప్పుడే జాగ్రత్త పడాలి.

ఇప్పుడు తను తీసుకునే ప్రతి నిర్ణయం అతని భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. మిగతా హీరోల మాదిరిగా తనకి పరిశ్రమలో గాడ్‌ఫాదర్లు ఎవరూ లేరు కనుక తన కెరియర్‌ని తనే జాగ్రత్తగా నిర్మించుకోవాలి. భలే భలే మగాడివోయ్‌తో తనకి వచ్చిన ఇమేజ్‌ వాపో, బలుపో అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. ఇకపై తను ఎంచుకునే సినిమాల పరంగా నాని కేర్‌ తీసుకుని మినిమం గ్యారెంటీ సినిమాలు ఇస్తూ పోతే కొన్నాళ్లకి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు