యంగ్ హీరో.. మళ్లీ ఆ రోజులొచ్చేస్తున్నాయా?

యంగ్ హీరో.. మళ్లీ ఆ రోజులొచ్చేస్తున్నాయా?

ఎంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా వరుసగా 14 ఫ్లాపుల తర్వాత కూడా ఓ హీరో ఇండస్ట్రీలో నిలబడడమంటే మాటలు కాదు. కానీ యువ కథానాయకుడు నితిన్ పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడి పోరాడి చివరికి ‘ఇష్క్’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత ‘గుండె జారి గల్లంతయ్యిందే’ లాంటి మరో సూపర్ హిట్టు కొట్టాడు. దీంతో అప్పటిదాకా నితిన్ ను పట్టించుకోని వారందరూ అతడి వైపు చూశారు. పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్ అతడితో ఏరికోరి సినిమా చేశాడు. ‘హార్ట్ ఎటాక్’ ఏవరేజ్ అని టాక్ తెచ్చుకున్నా.. అప్పటికి నితిన్ అంటే ఉన్న క్రేజ్ లో బాగానే ఆడేసింది. ఐతే సక్సెస్ సాధించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం కష్టం కదా. నితిన్ అదే చేయలేకపోతున్నాడు.

కరుణాకర్ దర్శకత్వంలో నితిన్ చేసిన ‘చిన్నదాన నీకోసం’ పోయినేడాది ఆఖర్లో భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ అంచనాల్ని అందుకోలేక బోల్తా కొట్టేసింది. తాజాగా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ నితిన్ ను మరింత కిందికి లాగేసింది. ఎప్పుడో మూడేళ్ల కింద మొదలైన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడి..  ఎట్టకేలకు విడుదలైంది. తీరా రిలీజయ్యాక చూస్తే ఈ సినిమా విడుదల కాకుండా ఆగిపోయి ఉన్నా బావుణ్నే అని నితిన్ అభిమానులు బాధపడే పరిస్థితి. హార్ట్ ఎటాక్ ను ఏవరేజ్ ఖాతాలో వేస్తే నితిన్ గత మూడు సినిమాలూ నిరాశ పరిచినట్లే లెక్క. అంటే కుర్రాడు మళ్లీ పాత దారిలోకి వెళ్లిపోతున్నాడేమో అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇప్పుడిక నితిన్ ఆశలన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న ‘అ.. ఆ’ మీదే. త్రివిక్రమ్ కూడా ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో నిరాశ పరిచాడు. కాబట్టి ఇద్దరికీ ఆ సినిమా చాలా కీలకం. ఆ సినిమా తేడా కొడితే మాత్రం నితిన్ మీద విపరీతమైన ప్రెజర్ పడటం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు