సినిమా రివ్యూ: భలే భలే మగాడివోయ్‌

సినిమా రివ్యూ: భలే భలే మగాడివోయ్‌

సినిమా రివ్యూ: భలే భలే మగాడివోయ్‌
రేటింగ్‌: 3.25/5
తారాగణం: నాని, లావణ్య తదితరులు
సంగీతం: గోపి సుందర్‌
కెమెరా: నిఝర్‌ షఫి
ఎడిటర్‌: ఉద్ధవ్‌
నిర్మాత: బన్నీ వాసు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి

ట్రెయిలర్స్‌ రిలీజ్‌ అయిన దగ్గర్నుంచీ 'భలే భలే మగాడివోయ్‌' సినిమా సర్కిల్స్‌లోనే కాక, సోషల్‌ నెట్‌వర్క్‌లో, రెగ్యులర్‌ సినిమాగోయర్స్‌లో చాలా బజ్‌ చేస్తోంది. విడుదలకి ముందు నుంచీ దీనిపై పాజిటివ్‌ బజ్‌ స్ప్రెడ్‌ అయింది. ఇంతవరకు చాలా విజయవంతమైన చిత్రాలని అందించిన మారుతి ఈసారి టాలెంటెడ్‌ యాక్టర్‌ అనిపించుకున్న నానితో జత కలిసాడు. మారుతి సినిమాల్లో బూతు డామినేట్‌ చేస్తుందనే అపప్రద వుంది. ఆ ముద్రని పోగొట్టుకోవడానికి మారుతి కృషి చేసాడు. ఆసువుగా దొర్లిపోయే డబుల్‌ మీనింగ్‌ డైలాగుల్ని తన సంభాషణల నుంచి తొలగించాడు. క్లీన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ని అందించాడు.

కథ:    

లక్కీకి (నాని) మతిమరపు. దీని వల్ల తనకి పెళ్లి కాదు. అతని లోపాన్ని చూసి అందరూ తిరస్కరిస్తూ వుంటారు. నందన (లావణ్య) అనే డాన్స్‌ టీచర్‌ని చూసి ప్రేమిస్తాడు. ఏ పని చేస్తున్నా కాసేపు కూడా కాన్సన్‌ట్రేట్‌ చేయలేడు. ఒక పని మీద ధ్యాస వుండగా మరోటి గుర్తొస్తే మొదటి పని మర్చిపోతుంటాడు. అలాంటి బలహీనతతో తన ప్రేమలో ఎలా నెగ్గుకొస్తాడనే సమస్య వుండగా, తన లోపం గురించి నందన తండ్రికి బాగా తెలియడంతో అతనికి దొరక్కుండా తిరుగుతుంటాడు. తనకున్న ఇబ్బందులతోనే తన ప్రేమ పరీక్షలో ఎలా నెగ్గాడనేది కథ.

కథనం:

మతిమరపు కారణంగా అనేక ఇబ్బందులు పడే హీరో ప్రేమలో పడడం అనేదే ఆకర్షణీయమైన కాన్సెప్టు. తను ప్రేమించిన అమ్మాయి ఇకనుంచి తనని పేరు పెట్టి పిలవమంటే తన పేరేంటో కూడా గుర్తు లేని ప్రేమికుడు ఆమెని ఎలా మెప్పిస్తుంటాడు అనేది ఫన్నీగా చూపించారు. తన మతిమరపుకి సంఘసేవ అని కలర్‌ ఇచ్చి ఆమె మనసు దోచుకుంటూ వుంటాడు. ఈ తతంగాన్ని అంతా వినోదాత్మకంగా చూపించడంలో మారుతి సక్సెస్‌ అయ్యాడు.

తన మతిమరపుని హీరోయిన్‌ దగ్గరైతే దాస్తాడు కానీ ఆమె తండ్రికి అతనేంటనేది ముందే తెలుసు. ఇక్కడే స్క్రీన్‌ప్లే పరంగా లాక్‌ పడింది. ఆమె తండ్రికి దొరక్కుండా, ఇటు హీరోయిన్‌కి తన విషయం తెలీకుండా నెట్టుకు రావాలి. వినోదానికి లోటు లేని విధంగా సెటప్‌ చేసుకున్నాడు. కానీ సెకండాఫ్‌లో ఊహించినంత కామెడీ లేదు. కాబోయే మావయ్యని మెప్పించడం కోసమని అతని వద్ద పని చేయడానికి వెళతాడు. అదంతా కామెడీకి ఉపయోగపడలేదు.

తమ కొడుకు ప్రేమని కాపాడ్డం కోసం అన్నా చెల్లెళ్లుగా నటించడానికి హీరో తల్లిదండ్రులు వెనకాడరు. అది కామెడీ కోసం చేసిందే అయినా అంతగా పండలేదు. ఇక నాని గురించి తనకి ముందే తెలుసునని, అతని గురించిన ప్రతి విషయాన్ని మురళీ శర్మ చెప్పుకురావడం మరీ సినిమాటిక్‌గా వుంది. కేవలం సినిమాని ముగించడానికి ఎంచుకున్న ఎస్కేపిస్ట్‌ దారిలా అనిపించింది.

కామెడీ తగ్గిన ప్రతిసారీ నాని తన నటనతో సినిమాని ఆదుకున్నాడు. శ్రీశైలం చూడ్డానికని బయల్దేరి దారితప్పిపోవడం, వేరే గుడికి తీసుకెళ్లడం అనే సీన్‌లో చాలా టైమ్‌ వేస్ట్‌ అయింది. కేవలం తన టాలెంట్‌తో ఆ సీన్‌ని నాని నిలబెట్టాడు. కొన్నిసార్లు మాత్రం జెన్యూన్‌గానే కామెడీ బాగా పండింది. ముఖ్యంగా ఫస్ట్‌ హాఫ్‌ హిలేరియస్‌గా వుంది. అదే దూకుడు ద్వితీయార్థంలో కూడా కొనసాగినట్టయితే ఈ సినిమా రేంజ్‌ వేరేలా వుండేది.

నటీనటులు:

నాని తన నటనతో ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ అయ్యాడు. సినిమా, సినిమాకీ తన నటనలో అతను చూపిస్తోన్న వైవిధ్యం చాలా బాగుంది. తన కెరియర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుందిది. లావణ్య బాగా చేసింది. అందంగా వుంది. మురళీ శర్మ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అయ్యాడు. అజయ్‌ బాగానే చేశాడు. వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, శ్రీనివాసరెడ్డి, నరేష్‌ తదితరులు కామెడీ కోసమని తలో చెయ్యి వేశారు. కొన్ని జోకులు భలేగా పేలాయి.

సాంకేతికవర్గం:

మారుతి డైరెక్షన్‌ సోసోగానే వుంది కానీ రచయితగా సక్సెస్‌ అయ్యాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌ పండించడంలో తనకున్న పట్టుని మళ్లీ చూపెట్టాడు. పాటలు బాగున్నాయి. గోపీసుందర్‌ మ్యూజిక్‌ ప్లస్‌ అయింది. ఎడిటింగ్‌ పర్‌ఫెక్ట్‌గా వుంది. కెమెరా వర్క్‌ కూడా ఆకర్షణీయంగా వుంది. ఇంతకుముందు మారుతి సినిమాలు టెక్నికల్‌గా లో స్టాండర్డ్‌ అనిపించేవి. కానీ ఈసారి క్వాలిటీ టెక్నీషియన్లు పని చేయడంతో సినిమా చాలా రిచ్‌గా కనిపించింది.

చివరిగా...


ఫ్యామిలీతో కలిసి వెళ్లి సరదాగా నవ్వుకుని రావడానికి కావాల్సినంత వినోదమున్న చిత్రమిది. బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సాధించడం ఖాయమనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు