తాప్సీ కూడా బుద్ధి చూపించింది!

తాప్సీ కూడా బుద్ధి చూపించింది!

మన తెలుగు అమ్మాయిల్ని కాదని పరాయి భాష వాళ్లను తెచ్చి పెట్టుకోవడం మనకో సరదా. మన సినిమాలతో పేరు తెచ్చుకుని, వేరే భాషకు వెళ్లి మన గురించి చీప్ గా మాట్లాడటం వాళ్లకు అలవాటు. ఎన్నిసార్లు ఇలా జరిగినా మనం మాత్రం మారడం లేదు. అసిన్, ఇలియానా, తమన్నాలు ఒకే బాటలో నడిచారు. ఇక్కడ ఇచ్చిన కిరీటాన్ని నెత్తిన మోసుకెళ్లి, అక్కడ హొయలు ఒలకబోశారు. మనం వేసిన పునాది మీద బాలీవుడ్ కెరీర్ ను నిర్మించుకోవాలని ప్రయత్నాలు చేశారు. చివరకు తెలుగువారిని, తెలుగు సినమాలను పక్కన పెట్టేయడమే కాక, తక్కువగా కూడా చూశారు. ఇప్పుడు తాప్సీ వీళ్ల లిస్టులో చేరింది. ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ రాలేదు ఈ పిల్లకి. దాంతో తమిళనాడులో కూడా అదృష్టాన్ని వెతుక్కోవడానికి పోయింది. ఒకట్రెండు చాన్సులు సంపాదించింది. ఆ చేసేదేదో సైలెంట్ గా చేసుకోవచ్చు కదా! తెలుగు సినిమాల గురించి చీప్ గా మాట్లాడుతోంది.

తెలుగు వారికి సహజంగా నటిస్తే నచ్చదట. మనవాళ్లు గ్లామరే చూస్తారట. అందంగా లేకపోతే తట్టుకోలేరట. అందాన్ని తప్ప టాలెంట్ ను గుర్తించనే గుర్తించరట. అదే తమిళ ప్రేక్షకులైతే సహజత్వాన్ని ఇష్టపడతారట. నిజమైన టాలెంట్ ను గుర్తిస్తారట. ఓ ఇంటర్వ్యూలో ఇవన్నీ ఏకధాటిగా చెప్పుకొచ్చింది. ఇంతలేసి మాటలన్నాకయినా మనవాళ్ల కడుపులు కాస్త మండితే బాగుణ్ను. అసలు నటించడమే కాదు. హావభావాలను పలికించడమూ రాదు. డైలాగులు చెప్పడం అంతకన్నా రాదు. ఇలాంటి వాళ్లంతా మన గురించి, మన సినిమాల గురించి, మనవాళ్ల టేస్ట్ గురించి స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్నారు. అయినా మనం ఏమీ చేయలేమా! ఏరు దాటాక తెప్ప తగలేసే ఇలాంటి వాళ్లందరినీ పక్కకు నెట్టి, మన వాళ్లతో సినిమాలు తీయలేమా! బిందుమాధవి, మాధవీలత, శ్రీదివ్య, కలర్స్ స్వాతి లాంటి వారికి నటన రాదా! వాళ్లు మనకు పనికి రారా! ఇప్పటికైనా మన దర్శక నిర్మాతలు కాస్త ఆలోచిస్తే ఇలాంటి వాళ్లందరి నోళ్లూ మూతపడతాయి. లేదంటే తెలుగువారి పరువుకు పదే పదే గండి పడుతూనే ఉంటుంది! 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు