సినిమా రివ్యూ: బాహుబలి

సినిమా రివ్యూ: బాహుబలి

రేటింగ్‌: 3.25/5
తారాగణం: ప్రభాస్‌, రాణా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ తదితరులు
మ్యూజిక్‌: కీరవాణి
కెమెరా: సెంథిల్‌
ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
ప్రొడ్యూసర్స్‌: శోభు, ప్రసాద్‌
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజమౌళి

బాహుబలిపై అపారమైన అంచనాలు పెరిగిపోవడానికి వెనుక దశాబ్ధానికి పైగా రాజమౌళి పెంచుకున్న క్రెడిట్‌, అతనిపై కుదిరిన గురి వున్నాయి. మగధీర, ఈగ లాంటి సంచలన చిత్రాలతో రాజమౌళి తన విజన్‌ ఏంటనేది ముందే చాటుకోవడంతో అతడు భారతదేశ సినీ చరిత్రలోనే అతి భారీ చిత్రం తీస్తున్నాడంటే తప్పకుండా అద్భుతంగా వుంటుందనే నమ్మకం ఏర్పడింది. ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ఛత్రపతి కమర్షియల్‌ సినిమాలు ఇష్టపడే జనాలకి ఎప్పటికీ ఒక క్లాసిక్‌గా గుర్తుండిపోతుంది. ఇవన్నీ ఒకెత్తు అయితే ఈ చిత్రాన్ని రాజమౌళి, అతని టీమ్‌ ప్రమోట్‌ చేసిన విధానం దీనికి అంతులేని హైప్‌ తీసుకొచ్చింది. కేవలం తెలుగు సినీ ప్రియులే కాకుండా, యావద్భారత దేశ సినీ ప్రియులు దీనిని చూడాలనే కుతూహలాన్ని కలిగించింది. బాహుబలి చిత్రానికి పర భాషల వాళ్లు జేజేలు పలుకుతున్నారు. కానీ అదే సమయంలో తెలుగువారి నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అదెందుకో, అసలు బాహుబలి ఎక్కడ క్లిక్కయ్యాడో, ఎందులో తడబడ్డాడో చూద్దాం.

కథ:

రాజమాత శివగామి (రమ్యకృష్ణ) ఒక పసిబిడ్డని కాపాడి చనిపోతుంది. తమ రాజ్యానికి దూరంగా ఎక్కడో ఒక తాండాలో వదిలేస్తుంది. అతను అక్కడే పెరిగి పెద్దవుతాడు. శివుడు (ప్రభాస్‌) ఎలాగైనా అక్కడి జలపాతాలని దాటి ఆ కొండ అవతల ఏముందో తెలుసుకోవాలని అనుకుంటాడు. అవంతిక (తమన్నా) కారణంగా అతను దానిని సాధిస్తాడు. కానీ తనని చూసిన వారంతా మోకరిల్లుతోంటే, బాహుబలి అని పిలుస్తోంటే తనెవరనేది శివుడు తెలుసుకోవాలని అనుకుంటాడు. బాహుబలి వద్ద సేనాని అయిన కట్టప్ప (సత్యరాజ్‌) జరిగింది వివరిస్తాడు. మాషిష్మతి సామ్రాజ్యానికి రాజు ఎవరనేది తేలాలంటే బాహుబలి (ప్రభాస్‌), బల్లాలదేవ (రాణా) ఇద్దరిలో ఎవరు బుద్ధిశాలి, బలశాలి అనేది తేలాలి. కాళకేయులపై యుద్ధంలో యుక్తి, శక్తి చూపించి రాజుగా బాధ్యతలు అందుకుంటాడు బాహుబలి. అంతటితో బాహుబలి - ఆరంభం ముగుస్తుంది. ఇక బాహుబలి మిగతా కథ తెలియాలంటే బాహుబలి - ముగింపు కోసం వేచి చూడాలి.

కథనం:    

రాజమౌళి ఈ చిత్రంలో బలమైన పాత్రలని రాసుకున్నాడు. కథాపరంగా చాలా సాధారణంగా అనిపించేదే అయినా కానీ ప్రతి పాత్రకీ వెన్నెముక వుండేలా, అన్ని పాత్రలు గుర్తుండిపోయేలా తీర్చిదిద్దాడు. బాహుబలి అపారమైన బలమున్న వాడయితే, అతనికి సమానమైన బలమున్న వాడు బల్లాలదేవ. బాహుబలి రాజనీతి చూపించే రకమైతే, బల్లాలదేవ యుద్ధనీతిని నమ్ముతాడు. తన గాంభీర్యంతో, రాజదక్షతతో శివగామి తెలుగు తెరపై చూసిన పవర్‌ఫుల్‌ ఫిమేల్‌ క్యారెక్టర్ల సరసన నిలుస్తుంది. రాజు కోసం జీవితాన్ని అంకితం చేసిన బానిస కట్టప్ప మరో పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌. బాహుబలి చనిపోయినా కానీ ప్రతీకార జ్వాలతో రగిలిపోయే పాత్ర అనుష్క చేసిన దేవసేన క్యారెక్టర్‌. ఇలా క్యారెక్టర్ల పరంగా బాహుబలిలో అన్నీ బలమైనవే.

ఈ పాత్రల చుట్టూనే కథ అల్లుకున్నామని రాజమౌళి చెప్పాడు. ఈ పాత్రలన్నిటికీ సమానమైన గుర్తింపు ఇవ్వాలన్నా, అన్నిటినీ సరిగ్గా చూపించాలన్నా ఒక్క భాగంలో సినిమా తీసేస్తే సరిపోదని అన్నాడు. అది నిజమే అయి ఉండవచ్చు కానీ కేవలం పాత్రల పరిచయాలతోనే ఈ చిత్రంలో చాలా సమయం గడిపేసారు. ప్రతి పాత్రకీ ఒక ఇంట్రడక్షన్‌ సీన్‌ భారీ స్థాయిలో వుంటుంది. శివుడి పాత్ర శివలింగాన్ని మోసే సీన్‌తో పరిచయం అవుతుంది. శివగామి పాత్ర పరిచయానికి ఒక చాలా లెంగ్తీ సీన్‌ పెట్టారు. కట్టప్ప కోసమని సుదీప్‌తో ఒక స్పెషల్‌ క్యారెక్టరే చేయించారు. అవంతికగా తమన్నా పాత్ర కోసమని ఒక సబ్‌ ప్లాట్‌ పెట్టారు. బల్లాలదేవ పరిచయం కోసం బుల్‌ ఫైట్‌, బాహుబలి ఆగమనం కోసం ఇంటర్వెల్‌ సీన్‌.. ఇలా సమయం అంతా పాత్రల పరిచయాలకే సరిపోవడంతో డ్రామాకి సమయం లేకుండా పోయింది.

బాహుబలి, బల్లాలదేవల మధ్య దాయాదుల సమస్యల్ని కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్‌ చేయకముందే కాళకేయులతో యుద్ధం ముంచుకొస్తుంది. ఆ సన్నివేశాన్ని హాలీవుడ్‌ స్థాయిలో తీయాలనే ప్రయత్నంలో భాగంగా చివరి నలభై నిముషాలు దాని బిల్డప్‌, ఎగ్జిక్యూషన్‌కే కేటాయించారు. పాత్రల పరిచయం మినహా బాహుబలి - ది బిగినింగ్‌లో మనం చూసింది కేవలం తమన్నా, ప్రభాస్‌ల లవ్‌ ట్రాక్‌, కాళకేయుల వార్‌ ఎపిసోడ్‌. దీంతో పాత్రలతో ఎక్కడా ఎమోషనల్‌ బాండింగ్‌ ఏర్పడకుండా పోయింది. సినిమాలోని ప్రతి దృశ్యం అద్భుతంగా కనిపిస్తున్నా కానీ ఆడియన్స్‌ని అలరించే డ్రామా లేకపోవడంతో బాహుబలి వెలితి మిగులుస్తుంది. కథని రెండు భాగాలుగా విభజించడం వల్ల చాలా సమస్యలు వచ్చాయి. కనీసం ఫ్లాష్‌బ్యాక్‌ అయినా ఇందులో తేల్చేయాల్సింది.

అంతా అసంపూర్ణంగా మిగలడం వల్ల సగటు ప్రేక్షకుడికి అసంతృప్తి మిగులుతుంది. ఆ గ్రాఫిక్స్‌ని, యుద్ధ సన్నివేశాన్ని చూసి తృప్తి పడాల్సిందే తప్ప ఒక పూర్తి స్థాయి సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌కి చోటు లేకుండా పోయింది.

నటీనటులు:

ప్రభాస్‌ ఈ పాత్ర కోసం ఫిజికల్‌గా చాలా కష్టపడ్డాడనే సంగతి తెలుస్తుంది. తన పాత్రలకి అతను న్యాయం చేశాడు. రాణా కూడా విలన్‌ పాత్రలో ఒదిగిపోయాడు. అనుష్కది చిన్న పాత్రే అయినా కొన్ని షాకింగ్‌ మూమెంట్స్‌ వున్నాయి. తమన్నా బాడీ లాంగ్వేజ్‌ అస్సలు బాలేదు. రమ్యకృష్ణన్‌ నటన బాగుంది. నీలాంబరి తర్వాత తనకి మరో గుర్తుండిపోయే పాత్ర ఇది. సత్యరాజ్‌ క్యారెక్టరైజేషన్‌, అతని పర్‌ఫార్మెన్స్‌ అలరిస్తాయి. నాజర్‌ కుటిల రాజుగా బాగా చేసాడు. శేష్‌ అడివి పర్వాలేదు. కాళకేయ రాజుగా ప్రభాకర్‌ గెటప్‌ బాగా కుదిరింది. రోహిణి, తనికెళ్ల భరణి తదితరులు సపోర్టింగ్‌ రోల్స్‌లో కనిపించారు.

సాంకేతికవర్గం:

రాజమౌళి విజన్‌కి హేట్సాఫ్‌ చెప్పాల్సిందే. ఇలాంటి కథలని ఊహించడం, తెర మీదకి తీసుకురావడం మాటలు కాదు. తన ఊహా ప్రపంచాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన రాజమౌళి కథనం విషయంలో తడబడ్డాడు. పట్టున్న కథనం వుండి వుంటే బాహుబలి చరిత్రలో నిలిచిపోయే సినిమా అయి వుండేది. కీరవాణి సంగీతం ఫర్వాలేదు. సెంథిల్‌ సినిమాటోగ్రఫీ పెద్ద ఎస్సెట్‌. గ్రాఫిక్స్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌కి చాలా హై క్వాలిటీ అనిపిస్తాయి. ఇంత ఖర్చు పెట్టిన నిర్మాతల ధైర్యాన్ని మెచ్చుకోవాలి. సాబు సిరిల్‌ కళా దర్శకత్వం బాహుబలికి ప్రధానాకర్షణ. సంభాషణలు పేలవంగా వున్నాయి.

చివరిగా...

బాహుబలి చిత్రం ఎమోషనల్‌గా శాటిస్‌ఫై చేయకపోయినా, సగంలోనే ఆపేసి అసంతృప్తి మిగిల్చినా, చూడ్డానికి రెండు కళ్ళు చాలవనే రీతిలో తెరకెక్కించారు. ఆ విజువల్స్‌ కోసం ఈ చిత్రాన్ని చూడాల్సిందే. కాకపోతే అంచనాలు తగ్గించుకుని వెళ్లాలి. కలెక్షన్ల పరంగా ఒక రెండు వారాల పాటు ఢోకా వుండదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English