రైతులకు వంశీ ఓ ఉచిత సలహా.. ఓ బంపర్ ఆఫర్

రాజధాని అమరావతి కోసం దాదాపు 270 రోజులుగా పోరాటాలు చేస్తున్న రైతులకు గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ ఉచిత సలహా ఇచ్చారు. రాజధాని విషయంలో రైతులు కోర్టులకు వెళ్ళేబదులు ప్రభుత్వంతో చర్చలు జరిపితే ఉపయోగం ఉంటుందని ఓ సలహా ఇచ్చారు. రాజధాని నిర్మాణం అన్నది అమరావతిలో జరిగే పనికాదని కూడా ఎంఎల్ఏ తేల్చేశారు. లక్ష కోట్లతో రాజధాని నిర్మించటానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవు కాబట్టి రైతులు ఇక ఆ ఆశలు వదిలేసుకోవాల్సిందే అంటూ క్లారిటి ఇచ్చేశారు.

అయితే ఇదే సమయంలో రైతులకు వంశీ ఓ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. అదేమిటంటే రాజధాని నిర్మాణం బదులు మెగా టౌన్ షిప్పు నిర్మిస్తే సరిపోతుందన్నారు. మెగా టౌన్ షిప్పు నిర్మాణానికి రైతులంతా తమ సమ్మతి తెలపాలట.  టౌన్ షిప్పును నిర్మించినా రైతుల భూములకు మంచి ధరలే వస్తాయని ఎంఎల్ఏ హామీ ఇస్తున్నారు. రాజధాని నిర్మిస్తేనే తమ భూములకు ధరలు వస్తాయనే అపోహలో రైతులు ఉండద్దని కూడా సూచించారు. మెగా టౌన్ షిప్పు నిర్మించినా ధరలు మంచిగానే వస్తాయట.

తన ప్రతిపాదనకు రైతులు గనుక అంగీకరిస్తే తాను జగన్మోహన్ రెడ్డిని కలిసి విషయం చెప్పి ఒప్పిస్తానంటూ భరోసా ఇచ్చారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూములిచ్చిన రైతులకు కూడా మెగా టౌన్ షిప్పులో ప్లాట్లు ఇవ్వటానికి సిఎంను తాను ఒప్పిస్తానని హామీ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. తాను చెప్పిన మెగా టౌన్ షిప్పు నిర్మాణానికి రైతులు ఎలా అంగీకరిస్తారని ఎంఎల్ఏ అనుకున్నారో అర్ధం కావటం లేదు. కష్టమో నష్టమో తమ వాదనను కోర్టులోనే వినిపించేందుకు రైతులు రెడీ అయ్యారు కాబట్టే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తు కోర్టుల్లో కేసులు వేశారు.

అయినా సమస్య పరిష్కారానికే తాను సూచన చేసినట్లు వంశీ చెప్పుకోవటం బాగానే ఉంది.  అసలు వంశీ ఏ హోదాతో రైతులకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ? వంశీ ఏమీ మంత్రి కాదు. కనీసం అధికారపార్టీ ఎంఎల్ఏ కూడా కాదు. మెగా టౌన్ షిప్పు అనే విషయం తప్ప రాజాదాని రైతులను  చర్చలకు రావాలని మంత్రులు కొడాలి నాని, పేర్నినాని, బొత్సా సత్యనారాయణతో పాటు కొందరు ఎంఎల్ఏలు కోరినా రైతులెవరు అంగీకరించలేదు. అలాంటిది టీడీపీలో తిరుగుబాటు ఎంఎల్ఏ వంశీ చెప్పగానే రైతులు వస్తారా ? తనకున్న అవకాశాలతో అధికారపార్టీతో వంశీ తిరుగుతున్నా సాంకేతికంగా ఇప్పటికీ టీడీపీ ఎంఎల్ఏనే అన్న విషయాన్ని బహుశా వంశీ మరచిపోయిట్లున్నారు.