పవన్ రాజకీయంపై చిరు షార్ప్ కామెంట్

రాజకీయం పేరెత్తితే చాలు చిరాకు పడిపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య. అవి తన ఒంటికి అస్సలు సరిపడవని ఆయన కొన్నేళ్ల కిందటే తేల్చిపడేశారు. తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టాక పరిశ్రమకు పూర్తిగా అంకితమైపోయారు. తాను పక్కా సినిమా వాడినని చెప్పకనే చెబుతున్నారు.

మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని ఆయన స్పష్టం చేశారు. కనీసం తన తమ్ముడి రాజకీయ పార్టీ గురించి కూడా చిరు ఎప్పుడూ మాట్లాడట్లేదు. గత ఏడాది ఎన్నికల సమయంలోనూ మౌనం పాటించాడు. తమ్ముడికి మద్దతుగా ఓ ప్రకటన కూడా చేయలేదు. ఈ విషయంలో చిరును తప్పుబట్టిన వాళ్లూ ఉన్నారు.

ఐతే చిరుకు రాజకీయాల్లో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఆయన మాట్లాడకుండా ఉండటమే మంచిదని.. చిరు చెప్పినా చెప్పకపోయినా ఆయన మద్దతుదారులంతా పవన్‌కే మద్దతుగా నిలుస్తారనే అభిప్రాయం ఇంకొదరు వ్యక్తం చేశారు.

ఐతే ఇప్పుడు ఎన్నికలు లేని అన్ సీజన్లో చిరు పవన్‌కు తన మద్దతు ప్రకటించడం విశేషం. ప్రజారాజ్యం పార్టీ విషయంలో తాను అందరినీ గుడ్డిగా నమ్మడం వల్ల నష్టం జరిగిందే విషయాన్ని పవన్ బలంగా నమ్ముతాడని చిరు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

పీఆర్పీ ప్రయాణంలో చాలా అంతర్గత విషయాలు తెలుసుకున్నాడని.. ఏదో ఒక రోజు పవన్ అనుకున్నది సాధిస్తాడనే నమ్మకం తనకుందని చిరు అన్నాడు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా లేకున్నా తన నైతిక మద్దతు ఎప్పుడూ జనసేనకే ఉంటుందని చిరు స్పష్టం చేశాడు.

పవన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన తన ఇంటికి వస్తాడని.. తల్లితో గడుపుతాడని.. తామిద్దరం డిన్నర్ చేస్తూ చాలా విషయాలు మాట్లాడుకుంటామని.. అయితే అవి వ్యక్తిగత ముచ్చట్లేనని.. రాజకీయాల గురించి మాత్రం అసలేమాత్రం ప్రస్తావన రాదని చిరు వెల్లడించాడు.