బీజేపీకి కన్నా రాజీనామా …

ఏపీ మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అనుకున్నంత పనిచేశారు. ఇన్ని రోజులు నాన్చిన తర్వాత బీజేపీ నుంచి వైదొలిగినట్లు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రటిస్తానని అన్నారు. కన్నాతో పాటు ఆయన అనుచరులు కూడా కమలం  పార్టీ నుంచి వైదొలిగారు.

 ఇంత కాలం ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీలో కొనసాగుతూ వచ్చానని కన్నా చెప్పుకున్నారు. తొలుత పార్టీ అధ్యక్ష బాధ్యత చేపట్టానన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల అభ్యర్థులను  పది నెలల కాలంలో ఎంపిక చేసి నియోజకవర్గాల్లో నిలబెట్టామన్నారు. 2024లో మోదీ నేతృత్వ  బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేశామన్నారు. అయితే అనివార్య కారణాలతో  పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పడకనే రాజీనామా చేసినట్లు పెద్దగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే భవిష్యత్తు కార్యాచరణను వెంటనే ప్రకటించేందుకు ఆయన నిరాకరించారు..

ఎటూ  తేల్చుకోలేక..

 కన్నా టీడీపీలో చేరతారా.. జనసేన  వేపు వెళతారా ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఎటు వెళ్లాలో అర్థం కాకే ఇంతకాలం  జాప్యం చేశారని చెబుతున్నారు. టీడీపీ, జనసేన ఎన్నికల పొత్తుపై స్పష్టత వస్తే ఆయన పార్టీ మారే విషయం కూడా ఖాయమవుతుందని చెబుతున్నారు. పొత్తు కుదిరితే జనసేనలో చేరి టీడీపీ మద్దతుతో గెలవడం మంచిదని కన్నా భావిస్తున్నారట. లేనిపక్షంలో  నేరుగా టీడీపీలో చేరాలనుకుంటున్నారని   సమాచారం.ఈ నెల 23 లేదా 24న కన్నా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది..