ఏపీ అధికారులకు జైలు శిక్ష‌.. మ‌ళ్లీ బుక్క‌య్యారుగా!

అదేం ఖ‌ర్మ‌మో కానీ.. ఏపీ అధికారులు మ‌ళ్లీ కోర్టు ముందు చేతులు క‌ట్టుకుని నిల‌బ‌డ‌డ‌మే కాదు.. మ‌రోసారి అడ్డంగా బుక్క‌య్యారు. ఈ సారి ఇద్ద‌రు కీల‌క అధికారుల‌కు హైకోర్టు జైలు శిక్ష‌, జ‌రిమానాలు కూడా విధించింది. ఆ ఇద్దరూ కూడా విద్యాశాఖ‌కు చెందిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. ఒక్కొక్క‌రికీ నెల రోజుల జైలు శిక్ష‌తో పాటు రూ. 2000 చొప్పున హైకోర్టు జ‌రిమానా విధించ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

రాష్ట్ర ఉన్న‌త విద్యాశాఖ‌కు సంబంధించిన స‌ర్వీసు రూల్స్‌పై గత ఏడాది హైకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. దీనిని అమ‌లు చేయాల‌ని ఉన్న‌త విద్యాశాఖ‌ను ఆదేశించింది. అయితే.. ఈ తీర్పును అధికారులు చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించారు. మ‌ళ్లీ ఇదే విష‌యంపై తాజాగా హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో గ‌తంలో ఇచ్చిన తీర్పును అమ‌లు చేశారా? అని హైకోర్టు ప్ర‌శ్నించింది.

అయితే.. గ‌త తీర్పును అమ‌లు చేయ‌లేద‌ని వెల్ల‌డించ‌డంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన హైకోర్టు వెంట‌నే దీనికి బాధ్యులు ఎవ‌ర‌ని ప్ర‌శ్నించింది. ఈ క్ర‌మంలో ఉన్న‌త విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి సీనియ‌ర్ ఐఏఎస్ బుడితి రాజ‌శేఖ‌ర్‌, ఇంట‌ర్ బోర్డు క‌మిష‌న‌ర్ రామ‌కృష్ణ‌లు బాధ్యుల‌ని పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు వివ‌రించారు. దీంతో ఆ ఇద్ద‌రిని బాధ్యులను చేస్తూ.. హైకోర్టు జైలు శిక్ష విధించింది. ఒక్కొక్క‌రికీ నెల రోజుల పాటు జైలు శిక్ష‌, త‌లా రూ.2000 చొప్పున జ‌రిమానా విధించింది.

వైసీపీ హ‌యాంలో ఇప్ప‌టికే చాలా మంది అధికారులు ఆఖ‌రుకు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నుంచి డీజీపీ వ‌ర‌కు, ఇత‌ర అధికారులు కూడా అనేక సంద‌ర్భాల్లో హైకోర్టు మెట్లు ఎక్కారు. అంతేకాదు.. కోర్టులో చీవాట్లు కూడా తిన్నారు. ఇక‌, మ‌రికొంద‌రు అధికారుల‌కు గ‌తంలో జైలు శిక్ష కూడా ప‌డింది. అయితే.. ధ‌ర్మాసనం క‌లుగ జేసుకుని.. త‌ర్వాత వారికి ఊర‌ట క‌ల్పించింది.