బాబాయికి ‘కాపు’ కాసేందుకు కోన వెంకట్ రాజకీయం!

కోన వెంకట్ పేరు తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవర్‌ఫుల్ డైలాగులకు, కథలకు ఆయన పెట్టింది పేరు. అంతెందుకు తాజాగా వచ్చిన చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్యకు కూడా ఆయనే కథ అందించారు. స్క్రీన్ ప్లే కూడా ఆయనదే.

అలాంటి కోన వెంకట్ ఇప్పుడు తన స్వస్థలం బాపట్లలో నిర్వహించిన ఓ కార్యక్రమం రాజకీయంగా చర్చనీయమవుతోంది. వెంకట్ బాపట్లలో చిరంజీవి అభిమానులతో ప్రత్యేకంగా ఓ సమావేశం నిర్వహించారు. పెద్దసంఖ్యలో చిరంజీవి అభిమానులు హాజరయ్యారు. ఇదంతా సాధారణంగా అనిపిస్తున్నా.. దీని వెనుక రాజకీయం ఉందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.

బాపట్ల ఎమ్మెల్యేగా ఉన్న కోన రఘుపతి.. కోన వెంకట్‌కు బాబాయి అవుతారు. ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన కోన రఘుపతి జగన్ మంత్రివర్గంలో బెర్త్ ఆశించినా అవకాశం దొరకలేదు. ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి సరిపెట్టారు.

2024లో వైసీపీ అధికారంలోకి వస్తే రఘుపతికి మంత్రి పదవి రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే, బాపట్లలో ఆయన విజయం సాధించడంపైనే అనుమానాలున్నాయి. అందుకు కారణం కాపుల ఓట్లు ఆ నియోజకవర్గంలో పెద్దసంఖ్యలో ఉండడం.

రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిపి పోటీచేసే సూచనలున్నాయి. పైగా జనసేన ఈసారి కాపుల ఓట్లను లక్ష్యంగా చేసుకుంది. గత ఎన్నికలలో కులాలకు దూరమని పవన్ చెప్పడంతో అప్పట్లో కాపులు, జనసేన లింకేజ్ అంతగా జరగలేదు. కానీ, ఈసారి పరిస్థితి వేరు.

కాబట్టి 2024లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి.. కాపులంతా జనసేనకు మద్దతుగా ఈ కూటమి అభ్యర్థికి ఓట్లేస్తే రఘుపతి విజయం కష్టమే. బ్రాహ్మణ వర్గానికి చెందిన రఘుపతి విజయంలో ఇంతవరకు కాపుల ఓట్లు కీలకంగా పనిచేశాయి. కానీ, వచ్చే ఎన్నికలలో వారి ఓట్లు పడకపోతే ఆయన ఓటమి తప్పదు.

ఆ ఆందోళనతోనే కాపుల ఓట్లకు రఘుపతి ప్రణాళిక రచించారని.. అందులో భాగంగానే సినీ కెనక్షన్ ఉన్న తన బంధువు కోన వెంకట్‌ను రంగంలోకి దించి మెగా అభిమానుల ఓట్లు ఆకర్షించే పనిని రఘుపతి ప్రారంభించారని టాక్. ఆ స్ట్రాటజీకి యాక్షన్ పార్టీగా కోన వెంకట్ వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు.