కేసీఆర్ ఈసారి ప్రెస్ మీట్ పెట్ట‌లేదు కానీ..

క‌రోనా ప్ర‌భావం ఓ మోస్త‌రు స్థాయిలో ఉన్న‌పుడు వారం ప‌ది రోజుల‌కు ఒక ప్రెస్ మీట్ పెట్టి జ‌నాల్లో ధైర్యం నింపేవారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అప్ప‌ట్లో ఆయ‌న వివిధ శాఖ‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తూ, ప‌రిస్థితిని స‌మీక్షిస్తూ ఉండేవారు కూడా. కానీ ఈ మ‌హ‌మ్మారి తీవ్ర స్థాయికి చేరి తెలంగాణ‌ను వ‌ణికిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న అందుబాటులో లేక‌పోవ‌డం, ప్రెస్ మీట్ ఊసే లేక‌పోవ‌డం, అస‌లు అధికారుల‌తో కూడా ట‌చ్‌లో లేక‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ రీఎంట్రీ కోసం అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. ఆయ‌న మ‌ళ్లీ ప్రెస్ మీట్ పెడ‌తార‌ని.. రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితిపై అప్ డేట్లు ఇస్తార‌ని.. జ‌నాల్లో ధైర్యం నింపుతార‌ని.. అలాగే విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం కూడా చెబుతార‌ని అంతా అనుకున్నారు.

ఐతే కేసీఆర్ రీఎంట్రీ ఇచ్చారు కానీ.. మీడియా ముందుకు మాత్రం రాలేదు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఆయ‌న ఉన్న‌త స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. అనంత‌రం మీడియా ద్వారా అంద‌రికీ దిశానిర్దేశం చేసే ప్ర‌య‌త్నం చేశారు. ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుని వాటి గురించి వెల్ల‌డించారు. రాష్ట్రంలో మొత్తంగా 41,018 మందికి వైరస్ సోకిందని.. 27,295 మంది కోలుకుని (67%) ఇంటికి వెళ్లిపోయారని… ఎలాంటి లక్షణాలు లేని 9,636 మంది హోం క్వారంటైన్ లో ఉన్నారని.. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారంతా వేగంగా కోలుకుంటున్నారని.. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం వీరందరికీ తగిన సూచనలు, చికిత్స అందిస్తున్నామ‌ని కేసీఆర్ వెల్ల‌డించారు.

గాంధీ, టిమ్స్ లలోనే దాదాపు 3 వేల బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయని.. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి 5 వేలు ఉన్నాయ‌ని… 1500 వెంటిలేటర్లు సిద్దంగా పెట్టామ‌ని..అన్ని ఆసుపత్రుల్లో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల బెడ్లను కేవలం కరోనా కోసమే ప్రత్యేకంగా కేటాయించామని కేసీఆర్ తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, మెరుగైన వైద్యం అందించే విషయంలో ఆరోగ్య శాఖ మంత్రి, సిఎస్ తక్షణ నిర్ణయాలు తీసుకుని అమలుచేయడానికి వీలుగా జనరల్ బడ్జెట్ కు అదనంగా రూ.100 కోట్లు కేటాయించిన‌ట్లు చెప్పారు. రాష్ట్రంలో పీజీ పూర్తి చేసిన 1200 మంది వైద్యులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవాలని, పి.హెచ్.సి.లలో ఖాళీగా ఉన్న 200 మంది డాక్టర్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించిన‌ట్లు సీఎం వెల్ల‌డించారు.

ప్రైవేటు ఆసుప‌త్రుల దందాపై అనేక ఆరోప‌ణ‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో వారికి కేసీఆర్ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ప్రైవేటు ఆసుపత్రులు బెడ్ల అందుబాటు విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని. కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంద‌ని… ప్రతీ ఆసుపత్రి తమ వద్ద ఎన్ని బెడ్లు ఉన్నాయి? అందులో ఎన్ని ఖాళీగా ఉన్నాయి అనే వివరాలు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియచేయాలని అన్నారు. కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావద్దని, అదే సందర్భంలో నిర్లక్ష్యం కూడా వద్ద‌ని.. కరోనా సోకిన వారు అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని.. ఎంతమందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, వైద్య సిబ్బంది సంసిద్ధంగా ఉన్నాయ‌ని కేసీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు.