కేంద్రం ముందు ప‌రువు తీసుకున్న తెలుగు రాష్ట్రాలు!

విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం ముగిసింది. అయితే.. ఇంత కీల‌క స‌మావేశానికి.. రెండు తెలుగు రాష్ట్రాలు ఎంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి? ఏ విధ‌మైన ముందు చూపుతో ముందుకు సాగాలి. కానీ.. అలా జ‌ర‌గ‌లేదు. కేంద్రం ముందే మ‌నోళ్లు పేచీ ప‌డ్డారు. నేను స‌హ‌క‌రించేది లేదంటే.. నేనూ అంతే అంటూ.. ఇరు రాష్ట్రాలు భీష్మించాయి. దీంతో కేంద్రం ఈ స‌మావేశాన్ని ఇంత‌టితో ముగించింది.

అస‌లు ఏం జ‌రిగింది.?

స‌మావేశంలో ఏపీ లేవ‌నెత్తిన ప్రతి అంశంలోనూ ఆ రాష్ట్రానికి షాక్ తగిలింది. ఏపీ లేవనెత్తిన ఏ అంశానికి కూడా తెలంగాణ అధికారులు ఒప్పుకున్నది లేదు. ఇక రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. రైల్వే జోన్ నిర్ణయాన్ని కేబినెట్‌ కు వదిలేయాలని హోంశాఖ కార్యదర్శి సూచించారు. రాజధానికి మరో రూ.వెయ్యి కోట్లు కావాలని ఏపీ కోరింది. ఇప్పటికే రూ.1500 కోట్లు ఇచ్చామ‌ని.. ముందు వాటిని ఎలా ఖ‌ర్చు పెట్టారో.. వివరాలు ఇవ్వాలని కేంద్రం తెలిపింది. అప్పుడు మిగిలిన ఖ‌ర్చును చూద్దామ‌ని కేంద్రం పేర్కొంది.

సమావేశంలో మరో కొత్త విషయాన్ని ఏపీ అధికారులు లేవనెత్తారు. శివరామకృష్ణన్ కమిటీ రూ.29 వేల కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసిందన్నారు. అందుకు అనుగుణంగా నిధులు ఇవ్వాలని ఏపీ కోరినప్పటికీ కేంద్రం స్పందించలేదు. వెనుకబడిన 7 జిల్లాలకు నిధులు ఇవ్వాలని ఏపీ అధికారులు కోరారు. ఐదేళ్లే ఇవ్వాలని నిర్ణయం జరిగిందని హోంశాఖ అధికారులు పేర్కొన్నారు. షీలా బిడే కమిటీ సిఫార్సుల పై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది.

షీలా బిడే కమిటీ సిఫార్సులను తెలంగాణ ఒప్పుకోవడం లేదని హోంశాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ అంగీకరించకపోయినా.. హోంశాఖ నిర్ణయం తీసుకోవచ్చని ఏపీ తెలిపింది. న్యాయ నిపుణుల సలహాల మేరకు నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తెలిపింది. ఏపీ లేవనెత్తిన ప్రతి అంశాన్ని తెలంగాణ అధికారులు వ్యతిరేకించారు. ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ సహా పలు సంస్థల వ్యవహారం.. కోర్టు పరిధిలో ఉన్నాయని తెలంగాణ అధికారులు వెల్లడించారు. పౌర సరఫరాల శాఖ బకాయిల అంకెల్లో తేడాలున్నాయని ఏపీ పేర్కొంది. ఇలా ఇరు రాష్ట్రాలు వాదించుకోవ‌డంతో ఎలాంటి నిర్ణయం లేకుండానే భేటీ అసంపూర్తిగా ముగిసింది.