క‌రోనాపై పోరు.. ఢిల్లీ సీఎం అద్భుతాలు చేస్తున్నాడు

క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ విష‌యంలో మొద‌ట బాగా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న వాళ్ల‌లో ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఒక‌రు. దేశంలో మొద‌ట వైర‌స్ వ్యాప్తి చాలా ఎక్కువ‌గా జ‌రిగిన రాష్ట్రాల్లో కూడా ఢిల్లీ ఒక‌టి. అక్క‌డ కేసుల సంఖ్య ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరిగిపోతుంటే.. కేజ్రీవాల్‌ను చేత‌కాని సీఎంగా విమ‌ర్శించారు చాలామంది.కానీ ఆయ‌న స‌మ‌ర్థ‌త ఏంటో ఇప్పుడు అంద‌రికీ తెలుస్తోంది. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు రోజు రోజుకూ పెరిగిపోతున్న కేసుల‌తో అల్లాడుతున్నాయి. ఢిల్లీలో కూడా కేసుల సంఖ్య ఎక్కువ‌గానే ఉంది కానీ.. దాన్ని సాధ్య‌మైనంత‌గా నియంత్రించే.. క‌రోనా పేషెంట్ల‌కు స‌రైన వైద్యం అందించే విష‌యంలో ఢిల్లీ ప్ర‌భుత్వం గొప్ప ముంద‌డుగే వేస్తోంది.

దేశ‌వ్యాప్తంగా చాలా రాష్ట్రాలు క‌రోనాకు చికిత్స అందించలేక చేతులెత్తేశాయి. ముంద‌స్తు ఏర్పాట్లు ఎక్క‌డా స‌రిగా లేవు. పేషెంట్ల‌కు బెడ్లు అందుబాటులో లేక.. ఈ విష‌యంలో స‌రైన స‌మాచారం లేక ఎలా ఇబ్బందులు ప‌డుతున్నారో చూస్తూనే ఉన్నాం. కానీ ఢిల్లీలో మాత్రం దేశంలోనే అత్యధికంగా ప్ర‌భుత్వ‌మే 15 వేల బెడ్ల‌ను ఏర్పాటు చేసింది. 15 రోజుల కింద‌ట 8 వేల బెడ్లే అందుబాటులో ఉండ‌గా.. అవి ఇప్పుడు రెట్టింప‌య్యాయి. దేశంలోనే అత్య‌ధిక రిక‌వ‌రీ రేటున్న‌ది ప్ర‌స్తుతం ఢిల్లీలోనే. నెల వ్య‌వ‌ధిలో 38 శాతం నుంచి రిక‌వ‌రీ రేటు 69 శాతానికి పెర‌గ‌డం విశేషం. దేశంలో అత్య‌ధికంగా క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్న‌ది ఢిల్లీనే. ప్ర‌తి ప‌ది ల‌క్ష‌ల మందిలో ఆ రాష్ట్రం 31,405 మందికి ప‌రీక్ష‌లు చేస్తోంది. అలాగే యాక్టివ్ కేసులు అతి త‌క్కువ‌గా ఉన్న రాష్ట్రం ఢిల్లీనే. ఆ శాతం 28.5గా ఉంది. యాప్ ద్వారా ఏ ఏ ఆసుప‌త్రిలో ఎన్ని బెడ్లున్నాయి.. ఎక్క‌డ ఎంత‌మంది క‌రోనా పేషెంట్లున్నార‌నే వివ‌రాల‌ను జ‌నాల‌కు చేర‌వేస్తోంది ఢిల్లీ ప్ర‌భుత్వం.

అలాగే దేశంలో తొలిసారిగా క‌రోనా నుంచి కోలుకున్న రోగుల ప్లాస్మా ద్వారా చికిత్స అందించే ప్ర‌క్రియ మొద‌లుపెట్ట‌డ‌మే కాదు.. ఇప్పుడు దేశంలోనే ఎక్క‌డా లేని విధంగా ప్లాస్మా బ్యాంకును కూడా ఏర్పాటు చేసింది కేజ్రీ స‌ర్కారు. ప్ర‌పంచంలోనే అతి పెద్ద కోవిడ్ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఘ‌న‌త కూడా ఢిల్లీ ప్ర‌భుత్వానిదే. అక్క‌డ క‌రోనా ఇన్ఫెక్ష‌న్ రేటు కూడా అతి త‌క్కువ‌గా 10 శాత‌మే ఉంది. నెల కింద‌ట అది 23 శాతంగా ఉంది. మొత్తంగా కేజ్రీవాల్ స‌ర్కారు చేప‌ట్టిన చ‌ర్య‌లు అద్భుత ఫ‌లితాన్నిస్తుండ‌టంతో ఆయ‌నపై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో ఢిల్లీ స‌ర్కారును చూసి మిగ‌తా రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌న్నీ నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న‌డంలో సందేహం లేదు.