మోడీకి పర్ ఫెక్ట్ ట్వీట్ పంచ్ అంటే ఇదేనేమో?

విమర్శల మీద విమర్శలు చేసుకుంటూ పోయే కన్నా.. చేసేదేదో దిమ్మ తిరిగిపోయేలా వేస్తే.. దాని లెక్కే వేరుగా ఉంటుంది. దేశ ప్రజల మీద గడిచిన ఇరవై రెండు రోజులుగా మొహమాటం లేని రీతిలో ఆయిల్ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. పెట్రోల్.. డీజిల్ ధరల్ని భారీగా పెంచేస్తున్న వైనం తెలిసిందే. ఇలాంటివేళ.. విపక్షాలు మొదలు పలు సంస్థలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక.. సామాన్యుడి వేదన అంతా ఇంతా కాదు.

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు కనిష్ఠంగా ఉన్నప్పటికి.. లీటరు పెట్రోల్.. డీజిల్ ధరలు రూ.80ను దాటేస్తున్న పరిస్థితి. ఇలాంటివేళ.. మోడీసర్కారుపై తనకున్న ఆగ్రహాన్ని.. పెట్రోల్.. డీజిల్ ధరల పెరుగుదల తీరును తప్పు పట్టేందుకు నెటిజన్ ఒకరు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకీ ఈ ట్వీట్ గొప్పతనం ఏమంటే.. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం మోడీ ట్విట్టర్ ఖాతా నుంచి పోస్టు అయ్యింది. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన.. అప్పటి యూపీఏ సర్కారు పెంచిన పెట్రోల్.. డీజిల్ ధరలను తప్పు పడుతూ.. ట్వీట్ సంధించారు. పెట్రోల్ ధరల్ని పెంచటం కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న యూపీఏ సర్కారు వైఫల్యమని.. గుజరాత్ లోని కోట్లాది మందికి ఇదో పెను భారంగా మారుతుందన్న ఆవేదనను వ్యక్తం చేశారు మోడీ అప్పట్లో.

ఇప్పుడు అదే ట్వీట్ కు కేవలం మూడంటే మూడుమార్పులు చేస్తూ.. నెటిజన్ ఒకరు దాన్ని పోస్టు చేశారు. కాంగ్రెస్ స్థానంలో బీజేపీ.. యూపీఏ స్థానంలో ఎన్ డీఏ.. గుజరాత్ స్థానంలో ఇండియా పదాల్ని చేర్చటం ద్వారా.. మోడీ అప్పటి ఆవేదనను గుర్తు చేస్తూ.. మరిప్పటి సంగతేమిటంటూ సంధించిన ట్వీట్ తో కేంద్రానికి దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చారని చెప్పాలి. ఒకప్పటి మోడీ ట్వీట్ తోనే.. తాజాగా ఆయన సర్కారు నిర్ణయాన్ని తప్పుపట్టేసిన వైనం అందరిని ఆకర్షిస్తోందని చెప్పాలి.