AP : కార్య‌క‌ర్త‌ల‌కూ కానుకలు… ఏ రూపంలో ?

ఇప్ప‌టిదాకా వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌పై మండిప‌డుతున్న కార్య‌క‌ర్త‌ల‌ను కూల్ చేసేందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌న్నాహాలు చేస్తున్నారు అని తెలుస్తోంది. మొన్న‌టి ఉమ్మ‌డి క‌ర్నూలు కేంద్రంగా జ‌రిగిన ప్లీన‌రీలో ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. కార్య‌క‌ర్త‌ల‌ను ఆదుకునేందుకు అధినాయ‌క‌త్వం సిద్ధంగానే ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్పుడిదే అంత‌టా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

ఇప్ప‌టికే ప్ర‌భుత్వానికి సంబంధించిన ప‌నులు చేప‌ట్టి బిల్లులు రాక అవ‌స్థలు ప‌డుతున్న వారికి ఇదొక ఊర‌ట కానుంది. మ‌రి! వాళ్ల‌ను ఏ విధంగా ఆదుకుంటారు.. ఏ మేర‌కు నిధులు ఇస్తారు ? అన్న వాటిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. కార్య‌క‌ర్త‌ల‌కే కాదు ఎమ్మెల్యేల‌కూ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి ప‌నుల‌కు ఒక్కొక్క‌రికి 12 కోట్లు మంజూరుకు సీఎం నిర్ణ‌యించారు. ముందు రెండు కోట్లు విడుద‌ల చేసి, ప‌నులు చేప‌ట్టాక అటుపై మిగిలిన నిధులు కేటాయించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. అంటే గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మన ప్ర‌భుత్వం పేరిట గుర్తించిన స‌మ‌స్య‌ల‌పైనే దృష్టి సారించి, తొలుత కేటాయించిన నిధుల‌ను వాడుకుని, సంబంధిత ప‌నుల‌ను నాణ్య‌త‌తో చేయించి త‌న‌కు నివేదించాల‌ని, దీర్ఘ కాలిక స‌మ‌స్య‌ల గుర్తింపున‌కు, ప‌రిష్కారానికి త‌గు ప్రాధాన్యం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.

ఇక తాజాగా విడుద‌ల‌య్యే నిధుల‌తో కార్య‌క‌ర్త‌ల‌కు ప‌నులు అప్ప‌గించేందుకు ఎమ్మెల్యేలు సుముఖంగానే ఉన్నారు. అయితే బిల్లుల క్లియ‌రెన్స్ కు త‌గు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సంబంధిత కార్య‌క‌ర్త‌లు కోరుతున్నారు. ఒక‌వేళ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి పేరిట నిధులు కేటాయించి సంబంధిత ప‌నులు అప్ప‌గిస్తే చేస్తామ‌ని కానీ ఏళ్ల‌కు ఏళ్లు బిల్లులు పెండింగ్ పెడ‌తామంటే చేయ‌లేమ‌ని తేల్చేస్తున్నారు.

మ‌రోవైపు మంత్రులు కూడా పెండింగ్ బిల్లుల క్లియ‌రెన్స్ కోసం ముఖ్య‌మంత్రిపై ఒత్తిడి పెంచేందుకు చూస్తున్నారు. మ‌రోవైపు రెండు రోజుల్లో రెండు వేల కోట్ల రూపాయ‌ల బ‌కాయిల‌ను తీర్చేస్తామ‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేశ్ అంటున్నారు. ఎక్క‌డికి వెళ్లినా బిల్లుల పెండింగ్ విష‌య‌మే చెబుతున్నారు అని, క‌నుక వీటి క్లియ‌రెన్స్ పై దృష్టి సారిస్తామ‌ని అంటున్నారు.