రాజుగారు జగన్ ‘కోడ్’ క్రాక్ చేశారా?

మేం ఇప్పుడు చెప్పే కథనానికి చెప్పే పోలిక కేవలం అర్థం కావటానికే తప్పించి.. మంచి చెడులతో సంబంధం లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో చూసే ఉంటారు. అందులో రోబోను క్లోన్ చేసే కాన్సెప్ట్ చూస్తే.. ఒరిజినల్ రోబో శక్తిసామర్థ్యాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉంటుంది. ఇప్పుడు అలాంటిదే ఏపీ రాజకీయాల్లో కనిపిస్తోంది. ముందే చెప్పినట్లు.. ఇక్కడ మంచి చెడుల్ని ప్రస్తావన కంటే కూడా.. ఒరిజినల్ ను క్లోన్ చేసినప్పుడు వచ్చే ప్రొడక్ట్ ఎంత పవర్ ఫుల్ అని చెప్పటమే ఉద్దేశం.

తెలుగు రాజకీయాల్లో ఎన్టీవోడు ఒక సంచలనమైతే.. వైఎస్ మరో సంచలనం. ఇప్పుడు జగన్ కూడా ఆ కోవలోకే వస్తాడు. ఆశ పడటం వేరు. ఆశ పడింది చేజిక్కించుకోవటం వేరు. రాళ్లు వేయించిన చేతులతోనే కండువా కప్పించుకొని.. పూలబొకేను తీసుకొని వారింటికే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చేసే అతిధిగా మారటం అంత తేలికైన విషయం కాదు. అలాంటి వారు చాలా తక్కువమందే కనిపిస్తారు. ముఖ్యమంత్రి కావాలన్న ఆశను మొహమాటం లేకుండా చెప్పేయటమే కాదు.. ఆ ప్రయాణంలో ఎదురుదెబ్బలు తినటం.. జైలుకు వెళ్లాల్సిన వచ్చినా స్థైర్యం కోల్పోకుండా మొండితనంతో ముందుకెళ్లటం మామూలు విషయం కాదు.

గాంధీ ఫ్యామిలీ ముందు తల ఎగరేయటానికి చాలానే గుండెలు కావాలి. అలాంటిది సవాలు విసిరినట్లుగా రాజకీయ సింహాసనాన్ని సొంతం చేసుకోవటం అంత తేలికైంది కాదు. దానికెంతో మదనం అవసరం. వ్యూహాలు ఎన్ని పన్నినా.. వాటికి ఎదురయ్యే ప్రతివ్యూహాల్ని చిత్తు చేసుకుంటూ ముందుకెళ్లటం మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. అది కూడా చంద్రబాబు లాంటి పోల్ మేనేజ్ మెంట్ గురుకు అర్థం కాని రీతిలో ఎత్తులు వేయటం చిన్న విషయం కాదు. కాబట్టే.. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయ్యారు. అలాంటి అధినేత కింద బాగా నలిగిన వ్యక్తి.. జగన్ పొలిటికల్ డీఎన్ఏను అసాంతం నమిలి మింగిన వ్యక్తి.. ఆయనకు సవాలు విసిరితే సీన్ ఎలా ఉంటుంది?

జగన్ పొలిటికల్ డీఎన్ఏ ఒక ఎత్తు అయితే.. విజయసాయి రెడ్డి లాంటి మాస్టర్ మైండ్ తో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోడ్ తయారు చేసిన తర్వాత..దాన్ని క్రాక్ చేయటం మామూలు వాళ్ల వల్ల కాదు. ఒకవేళ.. అదే చేస్తే.. ఏమవుతుందన్నప్పుడు నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు పేరు గుర్తుకు రాక మానదు. రాజకీయ ప్రత్యర్థులకు ఒక పట్టాన కొరుకుడు పడని జగన్ పార్టీ కోడ్ ను రక్తంలో ఇముడ్చుకున్న వైనం రాజు తాజా ఎత్తును చూసినప్పుడు ఇట్టే అర్థమవుతుంది.

తన ప్రత్యర్థుల్ని జగన్ పరివారం ఎంత నిశితంగా పరిశీలిస్తుందో.. అంతకు ఏ మాత్రం తగ్గని రీతిలో రాజుగారు చేస్తున్న పనులు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త సవాలు విసురుతుందని చెప్పక తప్పదు. కొండను ఢీ కొనే ముందు.. సదరు వ్యక్తి అయితే నిర్లక్ష్యంతోనో అయినా చేస్తారు. లేదంటే.. పక్కాగా సిద్ధమయ్యాకే చేస్తారు. రాజుగారి వ్యవహారం చూస్తే.. రెండో తరహాకు చెందిన వారేనని చెప్పాలి. ఇటీవల కాలంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని తప్పు పట్టటం ద్వారా.. అధినాయకత్వం ఆగ్రహానికి గురి కావటం పెద్ద విషయం కాదు. కానీ.. ఆ ఆగ్రహజ్వాల తన వరకు చేరకుండా వేసే ఎత్తులు ఉంటాయి చూశారా? అక్కడే కనిపిస్తుంది రఘురామ ఎత్తుగడ ఏమిటన్నది.

సంజాయితీ అడిగిన వెంటనే.. సమాధానం చెప్పటమో.. తన వాదనను వినిపించటమో లాంటివి రొడ్డు కొట్టుడు వ్యవహారమే జరుగుతుందని అందరూ భావించారు. దానికి భిన్నంగా సంజాయితీ తర్వాత.. ముందు తనకు పంపిన నోటీసుకు విధివిధానాలేమిటి? రూల్ పొజిషన్ ప్రకారం ఉందా? లేదా? అన్నది చూసుకోవటం.. తనను ఇరుకున పెట్టేందుకు సంధించిన అస్త్రాన్ని వారిపైనే ఉపయోగించే జగన్.. విజయసాయి రెడ్డిల పొలిటికల్ మార్కును విజయవంతంగా రఘురామ ప్రయోగించారనే చెప్పాలి.

తనకు లేఖ రాయాల్సింది క్రమశిక్షణ కమిటి కదా? కమిటీ కోరితే మినిట్స్ చూపించండి?.. ఇదంతా ఎందుకు అసలు మీరు నాకు పంపిన లెటర్ హెడ్ తప్పు.. ఈసీ రూల్స్ కు భిన్నంగా మీ లెటర్ హెడ్ ఉండటం ఏమిటి? దాని సంగతేమిటి? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరిట మరో పార్టీ.. ఆ పార్టీ లేఖ ఎలా పంపుతారు? రాష్ట్ర పార్టీ జాతీయ కార్యదర్శి అంటూ ఎలా పేర్కొన్నారు? ఇలా తనకు పంపిన లేఖలో వేసిన ప్రశ్నలకు మూడు రెట్లు ఎక్కువగా అడిగి ఉక్కిరిబిక్కిరి చేశారు.

ఇదంతా చూసినప్పుడు జగన్ పొలిటికల్ డీఎన్ ను క్లోన్ చేయటంలో రఘురామ సక్సెస్ అయ్యారన్న వాదన వినిపిస్తోంది. ఇంతకాలం తమకు మాత్రమే పరిమితమైన జగన్ ‘తెలివి’ ఇప్పుడు రఘురామ లాంటి శిష్యులతో బయటకు వచ్చి.. తాము నేర్పిన విద్యతోనే తమను ఇరుకున పడేసే ధోరణిని ప్రదర్శిస్తున్న వైనం ఏపీ రాజకీయాల్ని వేడెక్కిస్తోంది. జగన్ ను.. ఆయన పార్టీను క్రాక్ చేసి.. డీఎన్ఏను క్లోన్ చేసిన రఘురామ లాంటి వారికి చెక్ పెట్టటం రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టినంత ఈజీ కాదు.