పోలవరం అవినీతి.. ఇది కదా ట్విస్ట్ అంటే

ఆంధ్రప్రదేశ్ గత తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుల్లో పోలవరం ఒకటి. ఈ ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అప్పట్లో తీవ్ర ఆరోపణలే చేసింది. కానీ అవేమీ పట్టించుకోకుండా బాబు సర్కారు వీలైనంత వేగంగానే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లింది.

ఆ ప్రభుత్వమే కొనసాగి ఉంటే ఈపాటికి పోలవం పూర్తి కావచ్చేదేమో. జగన్ సర్కారు వచ్చాక ఈ ప్రాజెక్టు పనులకు బ్రేక్ వేసి.. పనుల్లో అవినీతి మీద దృష్టి పెట్టింది. ఓ ఉన్నతాధికారి ఆధ్వర్యంలో విచారణ కమిటీని కూడా నియమించింది. ఆ కమిటీ పోలవరంలో అవినీతి జరిగినట్లు నివేదిక కూడా ఇచ్చింది అప్పట్లో. అది కేంద్ర ప్రభుత్వం వద్దకు కూడా వెళ్లింది.

ఆ తర్వాత ఏం జరిగిందన్నది అప్ డేట్ లేదు. ఐతే ఇప్పుడు జనసేన నేత పెంటపాటి పుల్లారావు.. పోలవరం అవినీతిపై వివరాలు బయట పెట్టాలని కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాయగా.. ఊహించని సమాధానం రావడం విశేషం. పోలవరంలో అవినీతికి ఆధారాలు లేవని జలశక్తి శాఖ సమాధానం చెప్పడం గమనార్హం.

ఓవైపు జగన్ సర్కారు నియమించిన కమిటీ పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని చెప్పింది. గత ఏడాది ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్నట్లుగా మాట్లాడారు. పోలవరాన్ని బాబు ఏటీఎంలా వాడుకున్నారని ఆరోపించారు. ఇలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పోలవరం అవినీతిపై అంత వ్యతిరేకతతో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు బుక్ అయినట్లే అని అంతా అనుకున్నారు.

కానీ ఇప్పుడు కేంద్ర జలశక్తి శాఖ పోలవరంలో అవినీతికి ఆధారాల్లేవని తేల్చేసింది. ఏపీ ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చాక దాన్ని పరిశీలించి ప్రధాన మంత్రి కార్యాలయం.. నివేదికలో పేర్కొన్న అవినీతి ఆరోపణలకు ఆధారాలు కావాలని రెండు మూడుసార్లు లేఖలు రాసినా జగన్ సర్కారు నుంచి బదులు లేదట.

ఈ నివేదికలో ఆరోపణల సంగతి తేలాకే ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని కేంద్రం మెలిక పెట్టడంతో.. ఆ నివేదికను పక్కన పెట్టాలని జగన్ సర్కారు కేంద్ర జలశక్తి శాఖకు సూచించినట్లు వెల్లడి కావడం గమనార్హం. మొత్తానికి తాజా పరిణామాలతో పోలవరంలో అవినీతి జరగలేదని ఇటు రాష్ట్రం, అటు కేంద్రం ఒప్పుకున్నట్లయింది.