వైసీపీలో సాయిరెడ్డి స్థానం చెక్కుచెదర్లేదా?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత‌ర్గ‌త ప‌రిణామాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తాజాగా షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ప్రభుత్వం, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడంపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఈ నోటీసును వైసీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వి.విజ‌య‌సాయిరెడ్డి పేరుతో విడుద‌ల చేసింది. త‌ద్వారా, మ‌రోమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజ‌య‌సాయిరెడ్డి స‌త్తా ఏంటో తెలిసింద‌ని అంటున్నారు.

ఇటీవలి కాలంలో రఘురామకృష్ణంరాజుకు, పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలకు మధ్య తీవ్రస్థాయిలో నువ్వా నేనా అనేలా విభేదాలు చోటు చేసుకున్నాయి. దాంతోపాటుగా ర‌ఘురామ‌కృష్ణం రాజు వైసీపీ నేత‌ల‌కు మంట పుట్టించే ప‌లు కామెంట్లు చేశారు. పార్టీ అడిగితేనే తాను తిరిగి వైసీపీలో చేరానని, పార్టీ గుర్తు లేకపోయినా సొంతంగా ఎంపీగా గెలవగల సత్తా తనకుందని ఆయన వ్యాఖ్యానించారు. అనంత‌రం కొద్దిరోజుల‌కు తనకు ప్రాణహాని ఉందని లోక్‌సభ స్పీకర్, జిల్లా ఎస్పీలకు ఆయన లేఖలు కూడా రాశారు. ఎంపీ వ్యాఖ్యలు, చర్య‌లు పార్టీలో తీవ్ర కలవరం కలిగించాయి. ఈ నేప‌థ్యంలో పార్టీ నోటీసులు జారీ చేసింది.

వివిధ ప‌త్రికల క్లిప్పింగ్స్ జోడిస్తూ ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ విజ‌య‌సాయిరెడ్డి ర‌ఘురామ కృష్ణంరాజుకు షోకాజ్ నోటీసు ఇచ్చారు. మూడు రాజధానుల నిర్ణయం మీద ధిక్కార స్వరం, ఇంగ్లీష్ మీడియం అంశంలో విభేదించడం, బతిమలాడితేనే పార్టీలో చేరానన్న కామెంట్స్, ఇసుక విషయంలో ఎమ్మెల్యేల మీద విమ‌ర్శ‌లు, పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుందనే వ్యాఖ్య‌ల ప‌త్రిక‌ల క్లిప్పింగులు జోడిస్తూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను నోటీసులో త‌ప్పుప‌ట్టారు. పార్టీ ఎమ్మెల్యేలపై నిరాధార ఆరోపణలు చేయడంపై వివ‌ర‌ణ ఇచ్చారు.

కాగా, గ‌త కొద్దికాలంగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌కు, పార్టీ ముఖ్య‌నేత విజ‌య‌సాయిరెడ్డికి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌ని ప్ర‌చారం చేస్తున్న వారికి చెక్ పెట్టేలా, విజ‌య‌సాయిరెడ్డి పేరుతోనే ఈ షోకాజ్ నోటీసు అందించ‌డం గ‌మ‌నార్హం. త‌ద్వారా మ‌రోమారు వైసీపీలో నంబ‌ర్‌2 విజ‌య‌సాయిరెడ్డి అని జ‌గ‌న్ చెప్ప‌క‌నే చెప్పార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.