ఏపీలో ఆ స్కీం బడ్జెట్ 25 కోట్లు, పబ్లిసిటీకి 60 కోట్లట

తన పథకాల గురించి జగన్ సర్కారు పబ్లిసిటీ ఏ స్థాయిలో ఉంటుందో మీరు ఏపీలో ఉంటే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ న్యూస్ పేపర్లు ఫాలో అయ్యే వారికి ప్రతి నెలా ఏదో ఒక పథకం ప్రారంభిస్తున్నట్లు.. భారీగా నిధుల్ని కేటాయించినట్లు.. దానికి సంబంధించిన ఒక ప్రోగ్రాం గురించి మొదటి పేజీ మొత్తాన్ని కవర్ చేస్తూ యాడ్ ఇవ్వటం కనిపిస్తుంది. అన్ని పత్రికల్లో మొదటి పేజీలో ఈ యాడ్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో తెలంగాణలో పబ్లిష్ అయ్యే పేపర్లలోనూ ఈ తరహా ప్రకటనలు దర్శనమిస్తుంటాయి.

ఇంతభారీగా పథకాలు అమలు చేస్తున్న జగన్ సర్కారును ప్రశంసించకుండా ఉండలేమన్నట్లు కొందరు మాట్లాడుతుంటారు. కానీ.. పావలా పథకానికి పావలా పబ్లిసిటీకి అన్నట్లు ప్రకటల్ని ముంచెత్తటం జగన్ సర్కారుకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. తాజాగా జగన్ అమలు చేసే పథకాలు.. వాటికి ఖర్చు చేసే ప్రకటనల మొత్తం లెక్క తెలిస్తే.. ఇలా కూడా చేస్తారా? అంటూ నోరెళ్ల బెడతారు. ఏపీలో అమలయ్యే పథకాలు.. వాటికి ప్రభుత్వం చేసే ప్రకటనల ఖర్చు గురించి ఆసక్తికర అంశాల్ని ఒక తెలుగు తమ్ముడు బయటపెట్టాడు.

తాజాగా టీవీ చానల్ లో జరిగిన ఒక డిబేట్ లో పాల్గొన్న టీడీపీ నేత జీవీ రెడ్డి ఒక ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. ఈ విషయం విని మిగతా వారు ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితి.

“ఉపాధి కల్పనలో భాగంగా బ్యాంకుల ద్వారా రూ.10 వేలు రుణంగా ఇప్పించే స్కీం ఒకటి ఏపీలో ఉంది. ఈ స్కీంలో తీసుకున్న అప్పును మాత్రం తీసుకున్న వ్యక్తే తిరిగి చెల్లించాలి. కానీ.. దానికి అయ్యే వడ్డీని మాత్రం ప్రభుత్వం చెల్లిస్తుంది. ఏడాదికి ఆ వడ్డీ కింద ప్రభుత్వం చెల్లించేది రూ.25 కోట్లు. ట్విస్ట్ ఏంటంటే… 25 కోట్లు ఖర్చయ్యే ఈ పథకం ప్రచారం కోసం పెట్టే ఖర్చు ఎంతో తెలుసా రూ.60 కోట్లు” అని జీవి రెడ్డి వెల్లడించారు. ఇలాంటి పథకాలు దేశంలో ఏపీలో తప్పించి మరెక్కడా కనిపించవేమో?

ఈ ప్రకటనలపై మరిన్ని ఆసక్తికరమైన విషయాలు జీవీ రెడ్డి వెల్లడించారు. ‘‘ఫీజు రీయింబర్స్ మెంట్ పథకమే తీసుకుంటే… గతంలో రాజశేఖర్ రెడ్డి నుంచి చంద్రబాబు నాయుడు వరకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఎలా ఉండేది? సంవత్సరానికి ఒకసారి విద్యార్థి ఫీజు కట్టేది ప్రభుత్వం. నేరుగా విద్యా సంస్థలకే చెల్లించేవారు. జగన్ వచ్చిన తర్వాత దాన్ని.. ఒక సంవత్సరానికి కట్టాల్సిన ఫీజు నాలుగు ఇన్ స్టాల్ మెంట్లకు ఇస్తున్నారు. అది కూడా పేరెంట్స్ అకౌంట్లో వేస్తుంటారు. దాన్ని తీసుకుపోయి కాలేజీలో కట్టాలి. ప్రతి ఇన్ స్టాల్ మెంట్ కు ఒక ఫుల్ పేజీ యాడ్. జగనన్న విద్యా దీవెన యాడ్.. ప్రతి క్వార్టర్ కు ఒకటి. ప్రకటనల్ని ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా ఇస్తున్నారు. ఇలా యాడ్ ఇచ్చిన ప్రతిసారీ ప్రధాన పత్రికలకు ఒక్కోదానికీ ప్రభుత్వానికి రూ.8 కోట్లు – రూ.9 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇలా ఒక్కో స్కీంకు ఏడాదికి రూ.30-40 కోట్లు ప్రకటనల కోసం ఖర్చు చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు. దీనికి సంబంధించి వివిధ దినపత్రికల్లో వచ్చిన యాడ్స్ ను చూపించారు.

ఇదిలా ఉంటే..కొన్ని పథకాలకు లబ్థిదారులకు అందే సాయం కంటే కూడా ప్రకటనలకు భారీగా ఖర్చు చేయటం విస్మయానికి గురయ్యేలా చేస్తుంది.

ఇదంతా చదివిన తర్వాత.. ఒక పథకాన్ని ఇన్ స్టాల్ మెంట్లు రూపంలో చెల్లించటం ఒక ఎత్తు అయితే.. ప్రకటనల్ని సైతం ఇన్ స్టాల్ మెంట్ చెల్లించే ప్రతిసారి ఇచ్చే ప్రభుత్వంగా జగన్ ను మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. కాదంటారా?