నేడు అచ్చెన్న.. రేపు ఆయనా?

గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడానికి ముందు నుంచి తాము.. అధికారం చేపడితే తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి, అక్రమాలన్నీ బయటికి తీస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తూనే వస్తున్నారు. వచ్చాక కూడా ఆ హెచ్చరికలు కొనసాగాయి.

ఐతే గత ఏడాది కాలంలో అలాంటి సంకేతాలు పెద్దగా కనిపంచకపోవడంతో తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి విషయంలో జగన్ సర్కారు లైట్ తీసుకున్నట్లే కనిపించింది. కానీ ఇటీవలి పరిణామాలు చూస్తుంటే అభిప్రాయాలు మారుతున్నాయి.

ఏడాది కాలంలో నెమ్మదిగా గత ప్రభుత్వ వ్యవహారాలన్నింటినీ స్టడీ చేసి ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి తెచ్చి తెదేపా అగ్ర నాయకుల్ని టార్గెట్ చేయబోతున్నట్లుగా స్పష్టమవుతోంది.

తాజాగా ఈఎస్ఐలో మందుల కొనుగోలు స్కామ్‌ను బయటికి తెచ్చింది జగన్ సర్కారు. ఇందులో ఇప్పటికే కొందరు ఉద్యోగులను అరెస్టు చేశారు. ఇప్పుడు తెదేపా అగ్ర నేత, గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడిని అరెస్టు చేసే వరకు వచ్చింది వ్యవహారం.

ఈ స్కాంలో ఆయన అడ్డంగా దొరికారని అంటున్నారు. కొన్ని నకిలీ కంపెనీలకు టెండర్ కూడా లేకుండా మందుల కాంట్రాక్టు ఇచ్చే దిశగా ఆయన ఈఎస్ఐకి లేఖ రాసినట్లుగా చెబుతున్నారు. ఆ లేఖ తాలూకు ప్రతి, ఇతర సాక్ష్యాలు సేకరించిన తర్వాతే అధికారులు అచ్చెన్నను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఈ స్కాంలో మరికొందరు తెదేపా అగ్ర నేతల ప్రమేయం ఉందంటున్నారు. మరో మాజీ మంత్రిని కూడా సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందట. ఆ మంత్రి.. ప్రత్తిపాటి పుల్లారావు అనే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

ఆయన తనయుడికి ఈ స్కాంలో వాటా ఉందని.. దీంతో ప్రత్తిపాటిని కూడా సీబీఐ టార్గెట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. మరోవైపు అమరావతి భూముల వ్యవహారంలోనూ రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.