లాక్ డౌన్ దిశగా సంపన్న దేశం.. మన పరిస్థితేంటి?

అక్కడెక్కడో సౌతాఫిక్రాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగిపోతున్న వార్తలు రావటం.. ఆ వెంటనే మొదలైన కలకలం.. కొద్దిరోజులకే ప్రపంచంలోని దాదాపు పాతిక దేశాలకు పైనే ఈ మాయదారి మహమ్మారి విస్తరించటం తెలిసిందే. పక్కా జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్నప్పటికి.. మన దేశంలోనూ ఒమిక్రాన్ కేసులు వచ్చేశాయి.

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. సింగిల్ డిజిట్ లో మొదలైన కేసులు.. చూస్తుండగానే పెరుగుతున్నాయి. చూస్తుంటే.. మరికొద్ది రోజుల్లో ఈ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఒమిక్రాన్ దెబ్బకు సంపన్న దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇప్పుడా జాబితాలోకి బ్రిటన్ చేరింది.

అంతకంతకూ పెరుగుతున్న ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో బ్రిటన్ లో రెండు వారాల పాటు లాక్ డౌన్ విధిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో పడింది ఆ దేశ ప్రభుత్వం. వైరస్ వ్యాప్తి చేసే గొలుసును తెంచేందుకు వీలుగా.. క్రిస్మస్ పూర్తి అయిన వెంటనే.. లాక్ డౌన్ విధించే ఆలోచన ఉన్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. సభలు.. సమావేశాలు.. చర్చలు.. లాంటి వాటి మీద తాత్కాలిక నిషేధాన్ని విధించటంతో పాటు.. రెస్టారెంట్లను కూడా మూసివేయాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. కొన్ని సూచనలు చేసినట్లుగా చెబుతున్నారు.

ఒక్క శుక్రవారం నాడే బ్రిటన్ లో 93,045 కేసులు నమోదయ్యాయి. దీంతో.. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారం సాగింది. బ్రిటన్ లో ఇప్పటికే డెల్టా వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉంటే.. దానికి తోడుగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. దేశ రాజధాని లండన్ లో.. అత్యవసర పరిస్థితి ఉందని లండన్ మేయర్ ప్రకటన చేయటం గమనార్హం. మహానగరంలో కేసులు పెరిగాయని.. ప్రజాసేవలపై ప్రభావం పడటం మొదలైదన్నారు. కొవిడ్ కారణంగా లండన్ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరిగింది. ఇదిలా ఉండగా.. లండన్.. స్కాట్లాండ్ లో ఒమిక్రాన్ కేసులు నమోదు కావటంతో ఆందోళన చెందుతోంది. బ్రిటన్ తాజా పరిస్థితిని చూసిన ఐరోపా దేశాలు.. ఇప్పుడు మరింత అలెర్టు అయ్యాయి.

ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకోవటానికి వీలుగా ఐరోపా దేశాలు ఇప్పుడు నడుం బిగించాయి. చూస్తుండగానే కేసుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఆయా దేశాలు అత్యున్నత స్థాయి సమావేశాలని నిర్వహించి.. ఒమిక్రాన్ విషయంలో ఎలా వ్యవహరించాలన్న అంశంపై చర్చలు జరుపుతున్నారు. అంతేకాదు.. ఇప్పటివరకు చిన్నారులకు టీకాల విషయంలో పెద్దగా పట్టనట్లుగా ఉన్న దేశాలు.. ఇప్పుడు ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంగున్నాయి. డెన్మార్క్ లో థియేటర్లు.. పార్కు.. లాంటివి మూసేశారు. మొత్తంగా.. ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి పలు దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. మన దేశంలో కూడా కొంతమేర చర్యలు తీసుకుంటున్నా.. ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు ఏ మాత్రం ప్రభావం చూపుతాయో చూడాలి.