డెల్టా కన్నా ప్రమాదకరమైన మరో కరోనా వేరియంట్..!

కరోనా మహమ్మారి మనల్ని ఇప్పట్లో వదిలేలా కనపడటం లేదు. కొత్త కొత్త వేరియంట్లుగా రూపాంతరం చెందుతూ.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. సెకండ్ వేవ్ లో కలవరం సృష్టించిన డెల్టా వేరియంట్.. ఎంత మంది ప్రాణాలను తీసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది ఇలా తగ్గిపోగానే.. డెల్టా ప్లస్ రాబోతోందని.. అది థర్డ్ వేవ్ కి సంకేతమని చెప్పారు.

థర్డ్ వేవ్ భయంలో ఉన్న ప్రజలపై మరో పిడుగులాంటి వార్త పడింది. ఈ డెల్టా కంటే ప్రమాదమైన మరో కరోనా వేరియంట్ ని గుర్తించారు. డెల్టా రకం కంటే కరోనా లాంబ్డా వేరియంట్ అత్యంత ప్రమాదకరమని మలేషియా ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది.

ప్రపంచంలోని 30 దేశాల్లో లాంబ్డా వేరియంట్ ను గుర్తించారు. యూకేలోనూ ఆరు లాంబ్డా వేరియంట్ కేసులు వెలుగుచూశాయి.ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాల రేటు ఉన్న పెరూ దేశం నుంచి లాంబ్డా జాతి వైరస్ ఉద్భవించిందని మలేషియా ఆరోగ్యమంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది.

యూకేలో గుర్తించిన లాంబ్డా కరోనా వేరియంట్ డెల్టా కంటే ఎక్కువ ప్రమాదకరమైన అంటువ్యాధి అని పరిశోధకులు చెప్పారు.పెరూలో మే, జూన్ నెలల్లో వెలుగుచూసిన కరోనావైరస్ నమూనాలలో లాంబ్డా దాదాపు 82 శాతం ఉందని పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ (పాహో) వెల్లడించింది.

మరో దక్షిణ అమెరికా దేశమైన చిలీలో మే, జూన్ నుంచి 31 శాతానికి పైగా నమూనాల్లో లాంబ్డా వేరియంట్ వైరస్ ఉందని గుర్తించారు.లాంబ్డా వైరస్ త్వరగా ప్రబలుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.యూకేలో వెలుగుచూసిన ఆరు లాంబ్డా కరోనా వైరస్ వేరియంట్ విదేశీ ప్రయాణాలతోనే వచ్చిందని ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. లాంబ్డా కరోనా వైరస్ వేరియంట్ ప్రవర్తన, ఉత్పరివర్తనాల ప్రభావంపై ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నామని యూకే ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.