తిరుమల శ్రీవారిని దర్శించుకునే భాగ్యం వారికేనట

ఎన్నిసార్లు చూసి తనివితీరని తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆయన భక్తులు ఎంతలా తపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో తిరుమల శ్రీవారి దర్శనాన్ని భక్తులకు బంద్ చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ నేపథ్యంలో మూసిన తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు.. భక్తుల కోసం త్వరలో తెరిచే అవకాశం ఉందంటున్నారు. లాక్ డౌన్ 4.0 ఉన్నా.. కొన్ని మినహాయింపులతోనే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మామూలు రోజుల్లో యాభై.. అరవై వేలకు తగ్గకుండా శ్రీవారి దర్శనాన్ని భక్తులు పొందేవారు. హుండీ ఆదాయమే రూ.3 కోట్లు తగ్గేది కాదు. అందుకు భిన్నంగా లాక్ డౌన్ పరిస్థితులు ఉన్నాయి. మాయదారి రోగంతో సహజీవనం చేయాల్సిన వేళ.. శ్రీవారి దర్శన విధానం కూడా మారిపోతుందని చెబుతున్నారు. గతంలో మాదిరి కాకుండా తొలి దశలో గంటకు నాలుగు వందల మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారని చెబుతున్నారు.

టోకెన్ సిస్టంతో పాటు.. స్లాట్ విధానాన్ని అనుసరించటం ద్వారా స్వామి వారి దర్శనం భక్తులకు కలుగుతుందని చెబుతున్నారు. లాక్ డౌన్ తర్వాత పరిమిత సంఖ్యలో స్వామి వారి దర్శనానికి అనుమతులు ఇస్తారని చెబుతున్నారు. స్వామివారి దర్శనాన్ని షురూ చేసినంతనే.. తొలుత టీటీడీ ఉద్యోగులకు.. వారి కుటుంబాలకు కల్పిస్తారని.. ఆ తర్వాత తిరుపతి వాసులకు అనుమతి ఇస్తారని చెబుతున్నారు.

ఆ తర్వాత మాత్రమే సాధారణ భక్తులకు స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉంటుందన్న మాట వినిపిస్తోంది. గంటకు 400 మంది చొప్పున.. రోజులో పన్నెండు.. పద్నాలుగు గంటలు మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుందన్న మాట వినిపిస్తోంది. స్వామి వారి దివ్య మంగళ స్వరూపం కోసం తహతహలాడుతున్న భక్త జనులకు.. స్వామి వారి దర్శన భాగ్యం కలుగుతుందనే వార్త అమితానందానికి గురి చేస్తుందని చెప్పక తప్పదు.