వైన్ షాపులు మూసేయండి.. హైకోర్టు ఆర్డ‌ర్

అవును వైన్ షాపులు మూసేయ‌మ‌ని హైకోర్టు ఆర్డ‌ర్ ఇచ్చింది. రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఇది పెద్ద షాకే. ఇంత‌కీ ఇలా కోర్టు ఆర్డ‌ర్ ఇచ్చింది తెలంగాణ ప్ర‌భుత్వానికా.. ఏపీ ప్ర‌భుత్వానికా అని మందుబాబులు కంగారు ప‌డిపోవాల్సిన ప‌ని లేదు. ఈ ప‌రిణామం జ‌రిగింది త‌మిళ‌నాడులో. దేశ‌వ్యాప్తంగా ఏపీ స‌హా చాలా రాష్ట్రాల్లో సోమ‌వారం మ‌ద్యం దుకాణాలు పునఃప్రారంభం కాగా.. తెలంగాణ‌లో బుధ‌వారం వైన్ షాపులు తెరుచుకున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడులో మ‌రో రోజు ఆల‌స్యంగా.. అంటే గురువారం మ‌ద్యం దుకాణాలు తెరిచారు. ఐతే సోమ‌వారం స‌రిహ‌ద్దులు దాటుకుని ఏపీకి వెళ్లి మ‌రీ ఎగ‌బ‌డి మందు కొన్న త‌మిళ‌నాడు మందుబాబులు.. త‌మ రాష్ట్రంలోనూ అదుపు త‌ప్పి ప్ర‌వ‌ర్తించారు. సోష‌ల్ డిస్ట‌న్సింగ్‌ను ప‌ట్టించుకోలేదు. మాస్కులు ధ‌రించ‌లేదు. చాలా చోట్ల ప‌రిస్థితులు అదుపు త‌ప్పాయి.

దీంతో కమ‌ల్ హాస‌న్ నేతృథ్వంలోని ఎంఎన్ఎం పార్టీతో పాటు కొన్ని సంస్థ‌లు త‌మిళ‌నాట మ‌ద్యం అమ్మ‌కాలు ఆపాల‌ని హైకోర్టులో పిటిష‌న్లు వేశాయి. వీటిని ప‌రిశీలించిన హైకోర్టు.. త‌క్ష‌ణం తమిళ‌నాడులో మ‌ద్యం దుకాణాలు మూసి వేయాల‌ని ఆదేశించింది. మ‌ద్యం దుకాణాల ముందు భౌతిక దూరం పాటించ‌క‌పోవ‌డం, మాస్కులు ధ‌రించ‌క‌పోవ‌డాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. దీంతో వెంట‌నే మ‌ద్యం దుకాణాలు మూసేయాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఐతే మందుబాబుల‌కు ఓ చిన్న ఊర‌ట మాత్రం ఇచ్చింది హైకోర్టు. ఆన్ లైన్ ద్వారా మ‌ద్యం అమ్మ‌కాలు చేప‌ట్ట‌వ‌చ్చ‌ని చెప్పింది. ఐతే హైకోర్టు ఆదేశాల‌పై అప్పీల్ చేయాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం భావిస్తోంది. శ‌నివారం ఉద‌యం అయితే త‌మిళ‌నాట మ‌ద్యం దుకాణాలు తెరుచుకునే అవ‌కాశాలు లేన‌ట్లే. తొలి రోజు త‌మిళ‌నాట ఏకంగా రూ.175 కోట్ల మేర మ‌ద్యం అమ్మ‌కాలు జ‌ర‌గ‌డం విశేషం.