ట్రంప్ రోజూ కరోనా టెస్ట్ చేయించుకుంటున్నారట

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా పేరు వింటేనే… అందరూ ఒకింత భయాందోళనలకు గురవుతున్నమాట చూస్తూనే ఉన్నాం. ఎక్కడ ఆ వైరస్ తమకు సోకుతుందోనన్న భయం మనల్నీ ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా కట్టడిపై తనదైన శైలి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న అగ్రరాజ్యం అమెరికా అధద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ వైరస్ పేరు వింటే హడలిపోతున్నారని చెప్పక దప్పదు. కరోనాను చాలా లైటర్ వేలో తీసుకుంటున్నట్లుగా ఫోజు కొడుతున్న ట్రంప్… తన దైనందిన జీవితంలో ఆ వైరస్ ఎక్కడ తనను అంటుకుంటుందేమోనని ఓ రేంజిలో భయపడిపోతున్నారు. ఇందుకు నిదర్శనంగా ప్రతి రోజూ తాను కరోనా పరీక్షలు చేయించుకుంటానని, ఇప్పటికే రోజువారీ కరోనా టెస్టులు మొదలెట్టినట్లు కూడా ట్రంప్ ప్రకటించారు.

ఆ వివరాల్లోకి వెళితే… ట్రంప్‌కి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో పనిచేస్తోన్న అమెరికా మిలిటరీ అధికారి ఒకరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఇప్పటికే ట్రంప్‌తో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు కరోనా పరీక్షలు చేయగా వారిద్దరికీ నెగిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ… కరోనా సోకిన తన వ్యక్తిగత భద్రతా అధికారిని శ్వేతసౌధంలో తాను, మైక్ పెన్స్‌ అరుదుగా కలిసేవారమని చెప్పారు. ఆ అధికారి చాలా మంచివాడని వ్యాఖ్యానించారు.

ఇప్పటికే తాను, మైక్‌ కరోనా పరీక్షలు చేయించుకున్నామని ట్రంప్ చెప్పారు. తాను, మైక్‌తో పాటు శ్వేతసౌధంలోని సిబ్బంది అందరం ఇకపై ప్రతి రోజు కరోనా వైరస్‌ పరీక్ష చేయించుకుంటామని తెలిపారు. తాను గురువారం, శుక్రవారం పరీక్షలు చేయించుకున్నానని, రెండుసార్లూ నెగిటివ్‌ అని నిర్ధారణ అయిందని ట్రంప్ ప్రకటించారు. మైక్‌కి కూడా నెగిటివ్ అని తేలిందని చెప్పారు. ఇంతకు ముందు తాము వారానికి ఒకసారి కరోనా పరీక్షలు చేయించుకునేవారమని, ఇకపై ప్రతిరోజు చేయించుకుంటామని తెలిపారు. ఈ ప్రకటన చూస్తుంటే… కరోనా అంటే ట్రంప్ ఏ మేర భయపడిపోతున్నారో ఇట్టే తెలిసిపోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.