క్లీన్ ఇమేజ్ ఉన్న మంత్రి.. ఒక్క‌సారిగా అన్ పాపుల‌ర్ అయ్యారే!

జ‌గ‌న్ కేబినెట్‌లో ఇత‌ర మంత్రుల ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఒక‌రిద్ద‌రు మంత్రుల‌కు క్లీన్ ఇమేజ్ ఉంది. వారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌రు.. ప‌నిమాత్ర‌మే చేస్తారు! అనే సంపాయించుకున్నారు. అంతేకాదు.. వారు మంత్రి ప‌ద‌వి ఉందిక‌దా అని దూకుడుగా కూడా ఉండ‌రు. ఎక్క‌డ ఎంత‌వ‌ర‌కు వ్య‌వ‌హ‌రించాలో.. అక్క‌డ అంత‌వ‌ర‌కు ప‌నిచేసి.. క్లీన్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఇటు ప్ర‌భుత్వంలోను, అటు త‌మ జిల్లాలోనూ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి వారు ఒకరిద్ద‌రే ఉంటే.. వారిలోనూ ముందున్నారు.. నెల్లూరు జిల్లాకుచెందిన మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి.

మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన గౌతం.. నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు సాధించారు. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహిత‌మైన నాయ‌కుల్లో ఈయ‌న ఒక‌రు. అంతేకాదు.. మౌనంగా ఉంటూ.. ప్ర‌తి విష‌యంలోను ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తార‌నే పేరు తెచ్చుకున్నారు. వైసీపీ స‌ర్కారు ఏర్ప‌డి ఏడాదిన్న‌ర గ‌డిచిపోయినా.. ఎంద‌రో మంత్రులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసినా.. గౌతంరెడ్డి మాత్రం ఏనాడూ.. ఇలాంటి వాటి జోలికి పోలేదు. దీంతో మా మంచి మంత్రిగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో పేరు సంపాయించుకున్నారు.

అయితే.. ఆయ‌న ఒక్క‌సారిగా అన్ పాపుల‌ర్ అయిపోయార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్‌.. తూర్పుగోదావ‌రి జిల్లా దివీస్ విష‌యంపై గ‌ళం వినిపించారు. 15 గ్రామాలకు చెందిన వేల మంది ఈ ఫ్యాక్ట‌రీకి వ్య‌తిరేకంగా గ‌ళం వినిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ వారికి ద‌న్నుగా నిలిచి.. ప్ర‌భుత్వంపై ప్ర‌శ్న‌లు సంధించారు. అదే స‌మ‌యంలో ఆందోళ‌న కారుల‌ను అరెస్టు చేయ‌డం దారుణ‌మ‌ని.. ముందుగా వారిని విడిచిపెట్టాల‌ని కూడా డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా ఉన్న గౌతంరెడ్డి ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. అస‌లు విష‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేలా కామెంట్లు చేశారు.

దివీస్‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌మే అనుమ‌తి ఇచ్చింద‌ని.. అప్ప‌ట్లో ఏం చేశార‌ని.. ఎద‌రుప్ర‌శ్నించారు. ఇక‌, పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై ప‌వ‌న్ త‌న మ‌న‌సులో మాట చెప్పాల‌ని అన్నారు. నిజానికి స‌మ‌స్యను ఈ వ్యాఖ్య‌లు ప‌క్క‌దారి ప‌ట్టించాయి. ఇత‌ర మంత్రులు, లేదా నిత్యం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసే మంత్రులు ఇలా మాట్లాడి ఉంటే.. వేరేగా ఉండేద‌ని, కానీ, క్లీన్ ఇమేజ్ ఉన్న ఉన్న‌త విద్యావంతుడైన గౌతంరెడ్డి ఇలా వ్యాఖ్యానించ‌డం స‌రికాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌న మౌనంగా ఉన్నా.. స‌రిపోయేద‌ని అంటున్నారు.