అంత అర్జెంట్ గా విచారించాల్సిన అవసరం లేదన్న ఏపీ హైకోర్టు

ఏపీలో స్థానిక ఎన్నికల్ని నిర్వహించాలని ఏపీ ఎన్నికల కమిషనర్ పట్టుదలతో ఉండటం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల్ని నిర్వహించటం సరికాదని ఏపీ సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ ను జారీ చేయటం తెలిసిందే. దీనిపై ఏపీ సర్కారు హైకోర్టును ఆశ్రయించటం.. ఎన్నికల షెడ్యుల్ పై సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేయటం తెలిసిందే. దీంతో.. స్థానిక ఎన్నికల ప్రక్రియ ఆగింది.

దీన్ని సవాలు చేస్తూ ఏపీ ఎన్నికల సంఘం అప్పీలుకు హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను ఇప్పటికిప్పుడు అంత అర్జెంట్ గా విచారణ జరపాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అప్పీల్ ను తక్షణమే విచారించకపోతే వచ్చే న్యాయపరమైన ప్రతిబంధకాలు ఏమీ లేవన్న న్యాయమూర్తి.. దీనిపై విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల్ని జారీ చేశారు.

సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్ని నిలిపివేయాలని కోరుతూ.. ఈసీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీల్ పై ఈసీ నిమ్మగడ్డ రమేశ్ హౌస్ మోషన్ రూపంలో అప్పీల్ చేశారు. అత్యవసర కేసుల్ని విచారిస్తున్న జస్టిస్ దుర్గాప్రసాద్ నేతృత్వంలోని వెకేషన్‌ బెంచ్‌ మంగళవారం సాయంత్రం ఆయన ఇంటి వద్దే విచారణ జరిపింది. ఎన్నికల కమిషనర్ తరఫున ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరుపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు.

ఎన్నికల ప్రక్రియ షురూ అయ్యాక కోర్టులు జోక్యం చేసుకోరాదని.. ఆప్పీలుపై విచారణ ఒకరోజు వాయిదా వేసినా.. ఎన్నికల్లో పోటీదారులు..ఓటర్లు తీవ్రమైన గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. దీనికి స్పందించిన ధర్మాసనం ఈ వాదనల్ని 18న రెగ్యులర్ బెంచ్ ముందు చెప్పుకోవాలన్నారు. ఇదిలా ఉంటే.. ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ఆగిందని చెప్పటం సబబు కాదని ఏజీ శ్రీరాం వ్యాఖ్యానించగా.. తాము ఏజీ వాదనలతో ఏకీభవిస్తున్నట్లుగా న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. మరో సీనియర్ న్యాయవాది ఈ విచారణలో జోక్యం చేసుకొని ఈ వ్యాజ్యంలో నిమ్మగడ్డ రమేశ్ ను వ్యక్తిగత ప్రతివాదిగా చేర్చారని.. ఆయన తరఫున తాను హాజరవుతానని చెప్పగా.. అందుకు ధర్మాసనం నిరాకరించి.. వాదనలు వినమని స్పష్టం చేసింది. అంతేకాదు. పార్టీలతో సంబంధం లేకుండా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వ పథకాలతో ఓటర్లు ఎలా ప్రభావితం చేసే కొత్త పథకాలేమీ ఉండవని ఏజీ శ్రీరామ్ స్పష్టం చేశారు. ఇవన్నీ చూసినప్పుడు ఎన్నికల కమిషన్ ది కేవలం ఆందోళన మాత్రమేనని.. కేసును ఈ నెల 18కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారం నిమ్మగడ్డకు ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు.